ఇద్దరూ సంపాదిస్తే.. కలిసే బీమా! | Both meet insurance earns .. | Sakshi
Sakshi News home page

ఇద్దరూ సంపాదిస్తే.. కలిసే బీమా!

Published Mon, Nov 30 2015 12:22 AM | Last Updated on Sun, Sep 3 2017 1:13 PM

ఇద్దరూ సంపాదిస్తే.. కలిసే బీమా!

ఇద్దరూ సంపాదిస్తే.. కలిసే బీమా!

భార్యాభర్తల కోసం మార్కెట్లోకి జాయింట్ టర్మ్ పాలసీలు
వేర్వేరుగా తీసుకునే పాలసీలకన్నా తక్కువ ప్రీమియంకే లభ్యం
సంపాదించే జంటలు పెరుగుతుండటంతో మారుతున్న అవసరాలు
భాగస్వాములకు నెలనెలా స్థిర మొత్తం చెల్లించేలా కూడా ఆప్షన్లు

 
బీమాకు సంబంధించి మీరెన్ని పాలసీలు తీసుకున్నా... కుటుంబంలో సంపాదించే వ్యక్తి పేరిట ఓ టర్మ్ పాలసీ ఉండటం మాత్రం తప్పనిసరి. ఒకరకంగా అసలైన బీమా రక్షణ అంటే టర్మ్ పాలసీతోనే సాధ్యం. తక్కువ ప్రీమియంతో అధిక మొత్తానికి బీమా కవరేజీ ఇవ్వటం దీని ప్రత్యేకత. కాకపోతే పాలసీదారు మరణించిన పక్షంలో మాత్రమే కవరేజీ మొత్తం తన కుటుంబానికి అందుతుంది. పాలసీ గడువు తీరిపోయిన తరవాత కూడా పాలసీదారు జీవించి ఉంటే... ఎలాంటి కవరేజీ మొత్తం చేతికి రాదు. సరే! కుటుంబంలో సంపాదించే వ్యక్తి పేరిట టర్మ్ పాలసీ తీసుకుంటాం. అంతవరకూ బాగానే ఉంది. మరి భార్యాభర్తలిద్దరూ సంపాదిస్తుంటే!! ఇద్దరి పేరిటా టర్మ్ పాలసీలు తీసుకోవాలా? తీసుకోక తప్పదు. కాకపోతే ఇద్దరి పేరిటా విడివిడిగా తీసుకుంటే ప్రీమియం కాస్త ఎక్కువ కట్టాల్సి వస్తుంది. అందుకే ఈ మధ్య పీఎన్‌బీ మెట్‌లైఫ్ సంస్థ జాయింట్ టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీని అందుబాటులోకి తెచ్చింది. ఇద్దరి పేరిటా సంయుక్తంగా ఉండే ఈ పాలసీ వల్ల... ఇద్దరిలో ఏ ఒక్కరు మరణించినా మిగిలిన వారికి కవరేజీ మొత్తం అందుతుంది. పైగా జాయింట్ పాలసీ కావటం వల్ల ప్రీమియం కూడా తక్కువ. ఇంకా ఐసెక్యూర్ టర్మ్ ప్లాన్ పేరిట బజాజ్ అలయంజ్, ఐ-స్పౌస్ పేరిట ఏగాన్ రెలిగేర్ కూడా జాయింట్ టర్మ్ పాలసీని అందిస్తున్నాయి. భార్యాభర్తలిద్దరూ సంపాదించే కుటుంబాలు పెరుగుతున్న నేపథ్యంలో... జాయింట్ టర్మ్ పాలసీలిపుడు ప్రాధాన్యాన్ని సంతరించుకుంటున్నాయి. వీటిపై సాక్షి ప్రాఫిట్ ప్లస్ అందిస్తున్న ప్రత్యేక కథనమిది..
 
ముఖ్యాంశాలు... ప్రయోజనాలు

 
కొన్ని సంస్థలు తొలి క్లెయిమ్ ఆధారంగా కవరేజీ మొత్తాన్ని చెల్లిస్తున్నాయి. అంటే పాలసీదారులిద్దరిలో ఎవరో ఒకరు మరణించిన సందర్భంలో కవరేజీ మొత్తాన్ని మిగిలిన వారికి అందిస్తాయి. అంటే తొలి క్లెయిమ్ ఆధారంగా ఇవి కవరేజీ మొత్తాన్ని చెల్లిస్తాయి. అప్పటితో పాలసీ ముగిసిపోతుంది కూడా. ఒకవేళ ఒకే సందర్భంలో ఇద్దరూ మరణిస్తే... ఆ మొత్తం నామినీకి వెళుతుంది. అప్పటితో పాలసీ ముగిసిపోతుంది.

పాలసీ ఒకటే అయినా కొన్ని సంస్థలు ఇద్దరికీ విడివిడి మొత్తాన్ని కవరేజీగా అందిస్తున్నాయి. భార్యాభర్తల్లో ఒకరు మరణించినపుడు మిగిలిన వారికి కవరేజీలో కొంత మొత్తాన్ని చెల్లిస్తాయి. రెండో వ్యక్తి మరణించేదాకా పాలసీ కొనసాగుతుంది. పాలసీ గడువు ముగిసేలోగా రెండో వ్యక్తి కూడా మరణిస్తే అప్పుడు ఆ మొత్తాన్ని నామినీకి అందజేస్తారు.

కొన్ని సంస్థలు అదనపు ప్రయోజనాల్ని కూడా అందిస్తున్నాయి. పాలసీ గడువులోపు ఇద్దరిలో ఏ ఒక్కరు మరణించినా మిగిలిన వారికి కొన్నాళ్ల పాటు (కొన్ని సంస్థలు దీన్ని 60 నెలలుగా నిర్ణయించాయి) నెలకు కొంత చొప్పున స్థిర మొత్తాన్ని అందజేస్తున్నాయి. ఈ మొత్తం ఏక మొత్తంగా చెల్లించే కవరేజీకి అదనం.

కొన్ని బీమా కంపెనీలు ఈ జాయింట్ టర్మ్ పాలసీకి కొంత అదనపు ప్రీమియంతో క్రిటికల్ ఇల్‌నెస్ రైడర్‌ను కూడా అందజేస్తున్నాయి. ఇటీవలే పాలసీని ఆవిష్కరించిన కొన్ని సంస్థలైతే ఇన్‌బిల్ట్ ప్రమాద బీమాను, ఇన్‌బిల్ట్ టెర్మినల్ ఇల్‌నెస్ ప్రయోజనాన్ని అందిస్తున్నాయి. బాగా ముదిరిపోయిన లేక నయం చేయటానికి వీలుకాని వైద్యపరమైన పరిస్థితినే టెర్మినల్ ఇల్‌నె స్‌గా పరిగణిస్తారు. వీటన్నిటితో పాటు ఈ పాలసీలకు చెల్లించే ప్రీమియానికి ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80సీ, సెక్షన్ 10(10డీ) కింద పన్ను మినహాయింపులు వర్తిస్తాయి.
 
విడివిడిగా తీసుకునే టర్మ్ పాలసీలకు..
జాయింట్ టర్మ్ పాలసీలకు  ఉండే తేడాలివీ
 
ఇద్దరికీ ఒకేరకమైన నియమ నిబంధనలతో ఈ పాలసీ వర్తిస్తుంది. విడివిడిగా తీసుకుంటే ఇద్దరికీ వేరువేరు నిబంధనలు వర్తించే అవకాశం ఉంది. {పత్యేకంగా పేర్కొంటే తప్ప సహజంగా జాయింట్ పాలసీల్లో ఒకే కవరేజీ వర్తిస్తుంది. ఒకవేళ పాలసీదారులిద్దరూ ఒకేసారి ప్రమాదంలో మరణిస్తే... ఒకరికి చెల్లించే మొత్తాన్ని మాత్రమే నామినీకిస్తారు. అదే విడివిడి పాలసీలైతే ఇద్దరి కవరేజీలూ వస్తాయి. ఒకరు మరణించాక పాలసీ ముగిసిపోతుంది కనక మిగిలినవారికి ఎలాంటి కవరేజీ ఉండదు. ఆ వయసులో కొత్త పాలసీ తీసుకోవాలంటే చాలా ఖరీదు. దాంతో మిగిలిన జీవితాంతం కవరేజీ లేకుండానే ఉండాలి.చాలా సందర్భాల్లో విడివిడి పాలసీలకన్నా జాయింట్ టర్మ్ పాలసీ ప్రీమియం చాలా తక్కువ. పలు కంపెనీలు ఈ మేరకు ప్రొడక్టులను విక్రయిస్తున్నాయి.   భార్యాభర్తలు విడాకులు తీసుకుని విడిపోయిన సందర్భంలో పాలసీ నుంచి ఒకరిని తప్పించటం సాధ్యం కాదు. అయితే కొనసాగించటం, లేకపోతే వదిలేయటం చేయాల్సిందే.
 
ఎవరికి అవసరం?

భార్యాభర్తలిద్దరూ సంపాదించే కుటుంబాలు వేగంగా పెరుగుతున్నాయి. ‘‘ఈ కుటుంబాల్లో... తమ జీవన విధానానికి, రుణాలకు, ఇంటి ఖర్చులకు అవసరమైన మొత్తాన్ని ఇద్దరూ ఇస్తుంటారు. ఇలాంటి కుటుంబాల్లో ఏ ఒక్కరు మరణించినా, లేక దెబ్బతిన్నా ఆర్థికంగా వారికి కోలుకోలేని దెబ్బ తగులుతుంది. ఇలాంటి కుటుంబాలకు ఈ కవరేజీ చాలా అవసరం’’ అని బజాజ్ అలయంజ్ జనరల్ ఇన్సూరెన్స్‌లో హెల్త్ ఇన్సూరెన్స్ హెడ్‌గా వ్యవహరిస్తున్న సురేష్ సుగతన్ వ్యాఖ్యానించారు. నిపుణుల సూచనల ప్రకారం... యువ జంటలకు జాయింట్ టర్మ్ పాలసీ అవసరం. ప్రత్యేకించి పిల్లలు చిన్నగా ఉండి, రుణాలు ఎక్కువగా ఉన్నవారికి మరింత అవసరం. ఎందుకంటే వీరికి ఏమైనా జరిగిన పక్షంలో ఆ కుటుంబానికి తగిలే దెబ్బ మామూలుది కాదు. దాంతో పోలిస్తే పాలసీకి చెల్లించే ప్రీమియం చాలా తక్కువనే చెప్పాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement