శాస్త్రోక్తంగా ధ్వజారోహణం
సాక్షి, తిరుమల: తిరుమలలో శ్రీవెంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగవైభవంగా ప్రారంభమయ్యాయి. శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభానికి సూచికగా ఆలయంలో బుధవారం ధ్వజారోహణం శాస్త్రోక్తంగా నిర్వహించి.. ముక్కోటి దేవతలకు ఆహ్వానం పలికారు. సాయంత్రం 5 నుంచి 5.30 గంటల మధ్య మీన లగ్నంలో వైఖానస ఆగమోక్తంగా పవిత్ర గరుడ పతాకాన్ని (ధ్వజపటం) బంగారు ధ్వజస్తంభ శిఖరాగ్రానికి ఆవిష్కరించి అర్చకులు బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టారు.
ధ్వజారోహణానికి ముందు తిరుచ్చివాహనంపై శ్రీదేవి, భూదేవి సమేతుడైన మలయప్ప పరివార దేవతలైన అనంతుడు (ఆదిశేషుడు), గరుత్మంతుడు, విశ్వక్సేనుడు, గరుడధ్వజం, సుదర్శన చక్రతాళ్వార్‌తో కలసి ఆలయ పురవీధుల్లో ఊరేగారు. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తిరుమలేశునికి పట్టువస్త్రాలు సమర్పించారు. రాత్రి 8 గంటలకు సీఎం ఆలయం ఎదురుగా ఉన్న బేడి ఆంజనేయస్వామి ఆలయానికి ఆయన చేరుకున్నారు.
ప్రధాన అర్చకుడు ఏవీ రమణదీక్షితులు సీఎంకు తలపాగా చుట్టారు. తర్వాత వెండిపళ్లెంలో పట్టువస్త్రాలు ప్రదర్శనగా మహద్వారం నుంచి ఆలయంలోకి తీసుకెళ్లి స్వామివారికి సీఎం సమర్పించారు. అనంతరం ఆలయం వెలుపల ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సరిగ్గా 12 ఏళ్ల క్రితం అలిపిరి వద్ద మావోయిస్టులు తనపై 24 క్లెమోర్‌మైన్లతో దాడికి తెగబడ్డారని, ఆ సంఘటన నుంచి సాక్షాత్తు శ్రీనివాసుడే తనను రక్షించారని చంద్రబాబు అన్నారు.