కేదార్‌నాథ్ యాత్రకు బ్రేక్! | Break to Kedarnath Yatra! | Sakshi
Sakshi News home page

కేదార్‌నాథ్ యాత్రకు బ్రేక్!

Published Sun, May 11 2014 8:56 PM | Last Updated on Sat, Sep 2 2017 7:14 AM

కేదార్‌నాథ్ దేవాలయం (ఫైల్ ఫొటో)

కేదార్‌నాథ్ దేవాలయం (ఫైల్ ఫొటో)

 డెహ్రాడూన్: చార్‌ధామ్ యాత్రలో ఒకటైన కేదార్‌నాథ్ యాత్రకు అవాంతరాలు ఏర్పడ్డాయి. హిమాలయ పర్వత సానువుల్లో ఉన్న ఈ ఆలయం వద్ద, పరిసర ప్రాంతాల్లో తాజాగా మంచు కురవడంతో యాత్ర నిలిచిపోయింది. కేదార్‌నాథ్ వ్యాలీ అంతటా ఆదివారం ఉదయం మంచు కురిసిందని, దాంతో యాత్ర నిలిపివేసినట్లు రుద్రప్రయాగ ఎస్పీ బరీందర్‌జిత్ సింగ్ తెలిపారు.

యాత్రీకులను సోన్‌ప్రయాగ వద్దే ఆగిపోయి, వాతావరణ పరిస్థితులు మెరుగుపడే వరకు వేచి ఉండాలని కోరినట్లు ఆయన చెప్పారు. ఆరు నెలల శీతాకాలం విరామం తర్వాత కేదార్‌నాథ్ ఆలయాన్ని ఈ నెల 4న తిరిగి భక్తుల కోసం తెరిచిన విషయం తెలిసిందే. ఈ నెల 13 వరకు చార్‌ధామ్ (కేదార్‌నాథ్, బద్రీనాథ్, గంగోత్రి, యమునోత్రి) యాత్రా మార్గంలో, హిమాలయాల్లోని 3,500 మీటర్ల ఎత్తయిన ప్రాంతాల్లో ఉరుములతో కూడిన ఓ మోస్తరు జల్లులు పడతాయని వాతావరణ శాఖ స్థానిక కార్యాలయం అంచనా వేస్తోంది.
 మరోవైపు ఆలయ ప్రధాన పూజారి భీమశంకర్‌లింగ కూడా వారం రోజుల పాటు యాత్రను వాయిదా వేసుకోవాలని భక్తులకు సూచించారు. రోడ్ల పరిస్థితి బాగోలేకపోవడంతో యాత్రను కొనసాగించడం ప్రమాదకరమని చెప్పారు.  ప్రభుత్వం రోడ్ల మరమ్మతు, నిర్మాణ పనులను చేపట్టినా అవి ఇంకా పూర్తి కాలేదన్నారు.

ప్రముఖ హిందుస్థానీ గాయకుడు పండిట్ జస్‌రాజ్ ఆదివారం మందిరం వద్ద తన ప్రదర్శన ఇవ్వాల్సి ఉంది. అయితే, వాతావరణం అనుకూలించకపోవడంతో ఆయన డెహ్రాడూన్‌లోనే ఉండిపోయారు. గతేడాది చార్‌ధామ్ యాత్రా సమయంలో భారీ వర్షాలకు వరదలు ముంచెత్తడంతో సుమారు 5వేల మంది భక్తులు జలసమాధి అయిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement