మరింత బలోపేతంగా బ్రిక్స్
అంతర్జాతీయ ఎజెండాను తీర్చిదిద్దడంలో కీలక పాత్ర
హాంగ్జౌ: అంతర్జాతీయంగా తన వాణిని బలంగా వినిపించే శక్తిగా బ్రిక్స్(బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా) సమాఖ్య ఎదిగిందని మోదీ వ్యాఖ్యానించారు. అంతర్జాతీయ ఎజెండాను తీర్చిదిద్దడంలో బ్రిక్స్ కీలక పాత్ర పోషిస్తోందని, అభివృద్ధి చెందుతున్న దేశాలు తమ లక్ష్యాలను సాధించేందుకు వీలుగా సహాయం అందిస్తోందని చెప్పారు. జీ20 సదస్సుకు ముందుగా బ్రిక్స్ దేశాల అధినేతల సమావేశంలో మోదీ ప్రసంగించారు. ఈ సమావేశంలో బ్రెజిల్ అధ్యక్షుడు మైఖెల్ తీమెర్, రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు జాకబ్ జుమా పాల్గొన్నారు. వీరితో మోదీ ద్వైపాక్షికంగానూ చర్చలు జరిపారు. ‘దక్షిణ ఆసియా లేదా ప్రపంచంలో ఎక్కడైనా సరే ఉగ్రవాదులకు బ్యాంకులు, ఆయుధాల తయారీ పరిశ్రమలు లేవు.
కానీ ఎవరో వారికి నిధులు, ఆయుధాలు సరఫరా చేస్తున్నారనేది స్పష్టం. అందువల్ల బ్రిక్స్ దేశాలు సంయుక్తంగా ఉగ్రవాదం కట్టడికి చర్యలు తీసుకోవాలి. ఉగ్రవాదులపైనే కాక వారికి సహాయ సహకారాలు అందిస్తున్న వారిని కూడా గుర్తించి చర్యలు తీసుకోవాలి’ అని మోదీ సూచించారు. చైనాకు మిత్రదేశమైన పాకిస్థాన్‌ను ఉద్దేశించే మోదీ ఈ వ్యాఖ్యలు చేసినట్టు స్పష్టమవుతోంది. స్థిరత్వానికి ఉగ్రవాదం అవరోధంగా మారిందని, ఇది మానవాళికి ముప్పుగా పరిణమించిందని అన్నారు. సామాజిక మాద్యమాల ద్వారా ఉగ్రవాద భావజాల వ్యాప్తి విస్తృతమవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం బ్రిక్స్ దేశాధినేతలు ఓ సంయుక్త ప్రకటన విడుదల చేశారు. ప్రపంచ శాంతికి, భద్రతకు విఘాతం కలిగిస్తున్న ఉగ్రవాదాన్ని వారు తీవ్రంగా ఖండించారు.