కారుతో ఢీకొట్టి.. వేట కొడవళ్లతో నరికి... | brother was killed cruelly | Sakshi
Sakshi News home page

కారుతో ఢీకొట్టి.. వేట కొడవళ్లతో నరికి...

Published Tue, Jun 6 2017 10:24 AM | Last Updated on Sat, Aug 11 2018 8:48 PM

కారుతో ఢీకొట్టి.. వేట కొడవళ్లతో నరికి... - Sakshi

కారుతో ఢీకొట్టి.. వేట కొడవళ్లతో నరికి...

ఆస్తి కోసం... కాలయముడైన తమ్ముడు!
 
ప్రొద్దుటూరు క్రైం: ఆస్తి కోసం తమ్ముడే కాలయముడయ్యాడు... అన్నను వేటాడి వెంటాడి నరికి చంపాడు... వదిన, అన్న పిల్లల శోకానికి కారకుడయ్యాడు.. చివరకు అతను కూడా జైలు పాలయ్యాడు. పెద్దలు సంపాదించిన ఆస్తి అన్నదమ్ముల మధ్య వైరాన్ని పెంచి.. ప్రాణం మీదికి తెచ్చింది. మండల పరిధిలోని కానపల్లె రహదారిలో సోమవారం ఆకుల శ్రీనివాసులరెడ్డి (40)ని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. బైకుపై వెళ్తున్న అతన్ని కారుతో ఢీకొట్టి వేట కొడవళ్లతో నరికి చంపారు. పోలీసులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. 
 
నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలం కొండారెడ్డిపల్లెకు చెందిన ఆకుల శ్రీనివాసులరెడ్డికి వెంకటసుబ్బారెడ్డి, కృష్ణారెడ్డి అనే ఇద్దరు తమ్ముళ్లు ఉన్నారు. వారికి బెంగళూరుతోపాటు స్వగ్రామంలో పెద్ద ఎత్తున ఆస్తులు ఉన్నాయి. 12 ఏళ్ల క్రితం అతనికి ప్రొద్దుటూరు మండలంలోని కానపల్లె గ్రామానికి చెందిన వనతేజతో వివాహం అయింది. వారికి అజయ్, మనోజ్‌ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొన్నేళ్ల క్రితం వనతేజ తల్లి చనిపోవడంతో కానపల్లెకు వచ్చి స్థిరపడ్డారు. పట్టణంలోని మైదుకూరు రోడ్డులో ఉన్న ఆరవేటి «థియేటర్‌ కాంప్లెక్స్‌లో మీ సేవా కేంద్రాన్ని శ్రీనివాసులరెడ్డి నిర్వహిస్తున్నాడు. అతని సోదరుడు కృష్ణారెడ్డి వనతేజ చెల్లెలినే పెళ్లి చేసుకొని.. ఉదయగిరిలో మీ సేవా కేంద్రాన్ని నడిపాడు.
 
ఆస్తి కోసం తరుచూ గొడవలు:
ఆస్తి కోసం తరుచూ అన్నదమ్ముల మధ్య గొడవలు జరుగుతున్నట్లు బంధువులు చెబుతున్నారు. శ్రీనివాసులరెడ్డి తమ్ముడు వెంకటసుబ్బారెడ్డి కొన్ని నెలల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. అతను మృతి చెందాక కృష్ణారెడ్డి, శ్రీనివాసులరెడ్డి మధ్య ఆస్తి తగాదాలు మరింత పెరిగాయి. ఘర్షణలకు సంబంధించి నెల్లూరులోని వరికుంటపాడు పోలీస్‌స్టేషన్‌లో నాలుగు కేసులు ఉన్నాయి. తరుచూ గొడవలు జరుగుతుండటంతో శ్రీనివాసులరెడ్డి కానపల్లెకు వచ్చి స్థిరపడ్డాడు. 
 
8 నెలల క్రితం కృష్ణారెడ్డిపై దాడి
8 నెలల క్రితం కృష్ణారెడ్డిపై అన్న దాడి చేశాడు. పడుకొని ఉన్న అతన్ని వాహనంలో తీసుకొని వెళ్లి విచక్షణా రహితంగా కొట్టి, తీవ్రంగా గాయపరచినట్లు పోలీసులు తెలిపారు. అప్పటినుంచి అతను మీ సేవా కేంద్రాన్ని మూసివేసి శ్రీనివాసులరెడ్డిని చంపడానికి కృష్ణారెడ్డి వ్యూహం పన్నినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో కిరాయి హంతకులతో కలసి అతను పలుమార్లు ప్రొద్దుటూరుకు వచ్చి శ్రీనివాసులరెడ్డి నిర్వహిస్తున్న మీ సేవా కేంద్రం, అతను ఇంటికి వెళ్లే దారుల వద్ద రెక్కీ నిర్వహించినట్లు సమాచారం. 
కారుతో ఢీకొట్టి.. వేట కొడవళ్లతో నరికి..
మీసేవా కేంద్రం నుంచి శ్రీనివాసులరెడ్డి సోమవారం మధ్యాహ్నం భోజనానికి బైక్‌పై కానపల్లె గ్రామానికి బయలుదేరాడు. అతని కోసం కాపు కాచిన నలుగురు దుండగులు ఏపీ26 ఎన్‌ 7007 నంబర్‌ ఇండికా కారులో వెంబడించారు. కానపల్లె సమీపంలోని దర్గా వద్దకు వెళ్లగానే వెనుక వైపు నుంచి కారుతో ఢీ కొట్టారు. దీంతో అతను కింద పడిపోయాడు. ప్రమాదం జరిగిందేమోనని అతనికి సాయపడేందుకు పొలంలో పని చేస్తున్న కూలీలు పరుగెత్తుకుంటూ రోడ్డు వైపు వచ్చారు. ఈ లోపే ముసుగులు ధరించిన నలుగురు దుండగులు కారులోంచి దిగి శ్రీనివాసురెడ్డిని వేట కొడవళ్లతో దారుణంగా నరికారు. దీంతో కూలీలు భయంతో పరుగులు తీశారు. తీవ్రంగా గాయపడిన అతన్ని వెంటనే చికిత్స నిమిత్తం జిల్లా ప్రభుత్వాసుపత్రికి అక్కడివారు తరలించారు. అయితే వైద్యులు పరీక్షించే లోపే అతను మృతి చెందాడు. విషయం తెలియడంతో భార్య వనతేజ, పిల్లలు ఆస్పత్రికి చేరుకొని భోరున విలపించారు. రూరల్‌ సీఐ ఓబులేసు, వన్‌టౌన్‌ సీఐ వెంకటశివారెడ్డి, అర్బన్‌ సీఐ సదాశివయ్య, ఎస్‌ఐ చంద్రశేఖర్‌ సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించి, స్థానికులను విచారించారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. 
 
పోలీసుల అదపులో నిందితులు
శ్రీనివాసులరెడ్డిని హత్య చేసిన నిందితులు మైదుకూరు వైపు పారిపోయారని సమాచారం తెలియడంతో పోలీసులు అన్ని మార్గాల్లో తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో రాజంపేట సమీపంలోని బోయినపల్లె వద్ద ముగ్గురు నిందితులను రాజంపేట డీఎస్పీ అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. వారు ప్రయాణిస్తున్న కారును కూడా స్వాధీనం చేసుకున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement