బృహదు శిలాయుగం నాటి సమాధులు లభ్యం
లింగాలఘణపురం(వరంగల్ జిల్లా): వరంగల్ జిల్లా లింగాలఘణపురం మండలం కళ్లెం ప్రాంతంలో బృహత్ శిలాయుగం నాటి సమాధులు ఉన్నాయని చరిత్ర పరిశోధకుడు రత్నాకర్‌రెడ్డి, పురావస్తుశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ఎన్.సాగర్ తెలిపారు. మంగళవారం వారు సమాధులను పరిశీలించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఈ ప్రాంతంలో సుమారు 100కు పైగా సమాధులు ఉన్నాయని.. వాటిలో కొన్ని ధ్వంసమయ్యాయని అన్నారు. క్రీస్తు పూర్వం 1000 ఏళ్ల క్రితం నాటివిగా భావిస్తున్నట్లు వెల్లడించారు. సమాధుల ఏర్పాటుకు గుర్తుగా బెహరాన్‌లు (ఎత్తైన రాతి స్తంభాలు) కూడా నాలుగు ఉన్నాయని వివరించారు.
ఆనాటి సమాధులను పరిరక్షించేందుకు ఉన్నతాధికారులకు నివేదిక సమర్పిస్తానని తెలిపారు. కళ్లెం పరిసరాల్లో రెండు శాసనాలు కూడా ఉన్నాయని, వాటిని విశధీకరించాలని కోరారు. తన వద్ద రాతితో తయారైన గొడ్డలి, బ్లేడు, వినాయకవిగ్రహం, గొర్రెపొటేలు విగ్రహం, మట్టి పాత్రలు ఉన్నాయని పరిశోధకుడు రత్నాకర్‌రెడ్డి చెప్పారు. ఈ ప్రాంతంలో తవ్వకాలు చేపడితే ఎంతో చరిత్ర బయట పడుతుందని ఇటీవల మంత్రి కేటీఆర్ తన వద్దనున్న మట్టి పాత్రను కూడా బహూకరించినట్లు వివరించారు.