చరిత్ర సృష్టించిన బీఎస్ఈ
చరిత్ర సృష్టించిన బీఎస్ఈ
Published Fri, Feb 3 2017 11:13 AM | Last Updated on Tue, Sep 5 2017 2:49 AM
న్యూఢిల్లీ : ఆసియాలోనే అత్యంత పురాతన ఎక్స్చేంజ్, దేశంలోనే రెండో అతిపెద్ద స్టాక్ ఎక్స్చేంజ్ బీఎస్ఈ శుక్రవారం చరిత్ర సృష్టించింది. తన ప్రత్యర్థి ఎన్ఎస్ఈలో బ్లాక్బస్టర్ హిట్తో లిస్టు అయింది. ఇష్యూ ధర రూ.806కు 34.62 శాతం ప్రీమియంతో షేర్లు రూ.1,085కు జంప్ అయ్యాయి. భారత్లో లిస్టవుతున్న మొట్టమొదటి స్టాక్ ఎక్స్చేంజ్ ఇదే. 5-15 శాతం ప్రీమియంతో బీఎస్ఈ స్టాక్ లిస్టవుతుందని విశ్లేషకులు అంచనావేశారు. జనవరి 23న మొట్టమొదటిసారి ఐపీఓకు వచ్చిన బీఎస్ఈకి మూడు రోజుల బిడ్డింగ్లో ఆఖరి రోజు బంపర్ డిమాండ్ వచ్చిన సంగతి తెలిసిందే. 51 రెట్ల సబ్స్క్రిప్షన్తో అదరగొట్టేసింది.
అదేమాదిరి ఇప్పుడు కూడా బ్లాక్బస్టర్ హిట్తో మార్కెట్లో లిస్టు అయింది. అన్ని సెగ్మెంట్లో బీఎస్ఈకి 1,440 యునిక్ మెంబర్లున్నారు. ఆసియాలో పురాతనమైన ఎక్స్చేంజ్ అయిన బీఎస్ఈ 1875 జూలై 9న ఏర్పాటైంది. 2016 జూలై 30కు ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఎక్స్చేంజ్ల్లో ఒకటిగా నిలిచింది. మార్కెట్ క్యాపిటలైజేషన్ ప్రకారం ఇది ప్రపంచంలో 11వ అతిపెద్ద ఎక్స్చేంజ్. లిస్టెడ్ కంపెనీలతో దీని మార్కెట్ క్యాపిటలైజేషన్ 1.52 ట్రిలియన్ డాలర్లు.
Advertisement
Advertisement