కుప్పకూలిన బీఎస్‌ఎఫ్ విమానం
* ఇద్దరు పైలట్లు సహా 10 మంది సిబ్బంది దుర్మరణం
* శివార్లలో ప్రమాదం
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో మంగళవారం ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. సరిహద్దు భద్రతా దళానికి(బీఎస్‌ఎఫ్) చెంది న 11 సీట్ల విమానం ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి టేకాఫ్ తీసుకున్న 3 నిమిషాలకే నగర శివార్లలోని ద్వారక సమీపంలో కుప్పకూలింది. విమానంలోని ఇద్దరు పైలట్లతోపాటు ఎనిమిది మంది సాంకేతిక సిబ్బంది దుర్మరణం చెందారు. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్(ఏటీసీ), డెరైక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) అధికారుల కథనం ప్రకారం...
బీచ్‌క్రాఫ్ట్ సూపర్‌కింగ్ రకానికి చెందిన జంట ఇంజన్ల విమానం జార్ఖండ్ రాజధాని రాంచీ వెళ్లేందుకు ఉదయం 9:37 గంటలకు ఎయిర్‌పోర్టు నుంచి టేకాఫ్ తీసుకుంది. అయితే విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో వెంటనే ఎయిర్‌పోర్టుకు వెనక్కి మళ్లే ప్రయత్నంలో అదుపుతప్పింది. ఓ చెట్టును, ఎయిర్‌పోర్టు సరిహద్దు గోడను ఢీకొని మంటలు ఎగజిమ్ముతూ అక్కడున్న మురుగునీటి శుద్ధి ప్లాంటు ఆవరణలో 9:40 గంటలకు కుప్పకూలింది. వెంటనే 15 ఫైరింజన్లు ఘటనాస్థలికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చాయి.
ఈ ప్రమాదంపై పౌర విమానయానశాఖ విచారణకు ఆదేశించింది. రాంచీలో సాంకేతిక కారణాలతో నిలిచిపోయిన ఎంఐ-17 వీ5 హెలికాప్టర్‌కు మరమ్మతుల కోసం సాంకేతిక సిబ్బందిని విమానంలో తరలిస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. బీఎస్‌ఎఫ్ అవసరాల కోసం 1995లో కొన్న ఈ విమానానికి కెనడాలోని దీని తయారీ ఫ్యాక్టరీలో 6 నెలల కిందట ఇంజన్ ఓవర్‌హాలింగ్ జరిగింది.
మృతుల్లో.. చీఫ్ పైలట్, బీఎస్‌ఎఫ్ డిప్యూటీ కమాండెంట్ భగవతి ప్రసాద్ భట్, కో పైలట్, సశస్త్ర సీమా బల్ (ఎస్‌ఎస్‌బీ) అధికారి రాజేశ్ శివ్‌రేన్, డిప్యూటీ కమాండెంట్ డి. కుమార్, ఇన్‌స్పెక్టర్లు రాఘవేంద్ర కుమార్ యాదవ్, ఎస్.ఎన్. శర్మ, ఎస్‌ఐలు రవీంద్ర కుమార్, సురేంద్ర సింగ్, సి.ఎల్. శర్మ, ఏఎస్‌ఐ డి.పి. చౌహాన్, కానిస్టేబుల్ కె.ఆర్. రావత్ ఉన్నారు. ప్రధాని మోదీ, హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ తీవ్ర వి చారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగా ఢ సానుభూతి తెలిపారు. రాజ్‌నాథ్ ఘటనాస్థలికి చేరుకొని పరిస్థితిని సమీక్షించి ప్రధానికి ప్రమాద వివరాలను తెలియజేశారు.