షేర్లు కొంటున్నారా? | Buying shares? | Sakshi
Sakshi News home page

షేర్లు కొంటున్నారా?

Published Sun, Feb 15 2015 12:43 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

షేర్లు కొంటున్నారా? - Sakshi

షేర్లు కొంటున్నారా?

బడ్జెట్ ర్యాలీ మొదలైందంటున్న మార్కెట్ నిపుణులు   
‘మేకిన్ ఇండియా’ రంగాలే నయమంటూ సూచన
ఇన్‌ఫ్రా, పవర్, హౌసింగ్ ఫైనాన్స్ రంగాల సిఫారసు
పన్ను శ్లాబులు పెంచితే వినియోగ వస్తువులకూ డిమాండ్
ఇన్వెస్ట్ చేస్తే రెండుమూడేళ్ల దృష్టితోనే చేయాలి
అలా చేసేవారికి ఇప్పటికీ మార్కెట్లో విలువుంది
స్వల్పకాలిక పరిణామాలను పట్టించుకోవద్దు
మార్కెట్ పడినప్పుడల్లా కొనుగోలు చేయటం ఉత్తమం

 
నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర్నుంచి... ఆ మాటకొస్తే మోదీని బీజేపీ ప్రధాని అభ్యర్థిగా ప్రకటించినప్పటి నుంచి
 స్టాక్ మార్కెట్లలో ర్యాలీ మొదలయ్యింది. ఆ ర్యాలీ కొనసాగుతూనే ఉంది. చివరకు బీఎస్‌ఈ సూచీ సెన్సెక్స్ 29,000 మార్క్‌ను దాటేసింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 9000 పాయింట్లకు అత్యంత చేరువలో ఉంది. ఇక మోదీ ప్రభుత్వం పగ్గాలు చేపట్టాక ఈ నెల 28న ప్రవేశపెడుతున్న పూర్తిస్థాయి బడ్జెట్‌పై కూడా భారీ అంచనాలే ఉన్నాయి. ఫలితంగా మార్కెట్లలో బడ్జెట్ ర్యాలీ కూడా మొదలైంది. ఒకపక్క ప్రతికూల వార్తలు వస్తున్నా గత నాలుగు రోజుల్లో సెన్సెక్స్ 800 పాయింట్లు పైగా పెరిగింది. అంతర్జాతీయంగా దారుణంగా పడిపోయిన ముడి చమురు

ధరలు మళ్లీ పెరుగుతున్నా... ఢిల్లీ ఎన్నికల్లో ఫలితాలు భిన్నంగా వచ్చినా... సూచీలు పరుగులు తీస్తూనే ఉన్నాయి. మరి ఇలాంటి సమయంలో మదుపరులు ఏం చేయాలి? ఇప్పటికే మార్కెట్లో ఇన్వెస్ట్ చేసినవారు వైదొలగాలా..? లేక కొనసాగాలా? కొత్తగా ఇన్వెస్ట్ చేయాలనుకున్నవారు ఇప్పుడే పెట్టుబడి పెట్టొచ్చా...? లేక వేచిచూడాలా? ఈ సమయం ఎవరికి అనుకూలం... ఎవరికి ప్రతికూలం? ఇవన్నీ ఇన్వెస్టర్లకు  వివరంగా తెలియజేయటానికి పలువురు మార్కెట్ నిపుణులను ‘సాక్షి పర్సనల్ ఫైనాన్స్ ప్రతినిధి’ సంప్రతించారు. వారు ఏం చెప్పారు...  దాని ప్రకారం ఏఏ రంగాలు బాగుంటాయన్నదే ఈ వారం ప్రాఫిట్ ప్రధాన కథనం...
 
 మేకిన్ ఇండియా షేర్లపై దృష్టి...

దీన్ని ప్రీబడ్జెట్ ర్యాలీగానే భావించవచ్చు. అంతర్జాతీయంగా రష్యా, ఉక్రెయిన్, గ్రీస్ సంక్షోభాలు సద్దుమణిగాయి కనక వారం రోజుల కరెక్షన్‌కు అడ్డుకట్ట పడింది. ఆయిల్ ధరలు పెరుగుతున్నా... మార్కెట్లు పెరగడానికి కారణం బడ్జెట్‌పై అంచనాలు అధికంగా ఉండటమే. బడ్జెట్‌లోపే సూచీలు కొత్త శిఖరాలను దాటే అవకాశాలు కనిపిస్తున్నాయి. సబ్సిడీలను తగ్గిస్తూ వృద్ధిని ప్రోత్సహించేలా సంస్కరణల బడ్జెట్ రావచ్చని మార్కెట్ అంచనా వేస్తోంది. ముఖ్యంగా మేకిన్ ఇండియాని ప్రోత్సహించే విధంగా ఉండొచ్చు. అంటే ముడి పదార్థాలను ఎగుమతి చేయటం కంటే... ఇక్కడ వాటికి విలువ జోడించి ఎగుమతి చేసే కంపెనీలకు మరిన్ని ప్రోత్సాహకాలు ఇచ్చే అవకాశం ఉంది. కొత్త ఉద్యోగాలు కల్పించే విధంగా పరిశ్రమలకు ప్రోత్సాహకాలుంటాయని అంచనా వేస్తున్నారు. ఈ కోణంలో చూసినపుడు ఇన్‌ఫ్రా, ఇరిగేషన్, హౌసింగ్ ఫైనాన్స్, డిఫెన్స్ తయారీ రంగాలకు చెందిన షేర్లు పెరిగే అవకాశముంది. అలాగే వ్యక్తిగత ఆదాయ పన్నుల శ్లాబులు పెంచడం లేదా  పన్ను మినహాయింపుల పరిమితి పెంచితే వినియోగ రంగానికి చెందిన షేర్లు కూడా పెరుగుతాయి. అలా కాకుండా ప్రజాకర్షక బడ్జెట్‌ను ప్రవేశపెట్టినా, వృద్ధిరేటుకు ఊతమిచ్చే విధంగా లేకపోయినా  మార్కెట్లు పతనమయ్యే అవకాశముంది.    
 - సతీష్ కంతేటి, జేఎండీ, జెన్‌మనీ.
 
 ఇన్‌ఫ్రాకి ఊతం

దేశ ఆర్థిక వ్యవస్థలో వినియోగం పెంచే విధంగా ఈ బడ్జెట్‌లో పలు చర్యలు ఉంటాయని అంచనా వేస్తున్నాం. వృద్ధిరేటుకు ఊతమిచ్చే కీలకమైన ఇన్‌ఫ్రా రంగానికి చెందిన రోడ్లు, విద్యుత్, రైల్వే, పోర్టుల అభివృద్ధికి కేటాయింపులు పెంచే అవకాశాలు ఎక్కువ. అలాగే మానవ వనరుల నైపుణ్యం పెంచే విధంగా స్కిల్ డెవలప్‌మెంట్‌పై దృష్టిపెట్టొచ్చు. తయారీ రంగానికి చెందిన కొత్త యూనిట్లను త్వరితగతిన ఏర్పాటు చేసేలా పన్ను రాయితీలను ప్రకటించడం ద్వారా కొత్త పెట్టుబడులను ఆకర్షించే ప్రయత్నం చేయొచ్చు. అలాగే మధ్యతరగతి ప్రజలను ఆకర్షించడానికి వ్యక్తిగత ఆదాయ పన్నుల శ్లాబులు, మినహాయింపుల్లో ఊరటనివ్వడం ద్వారా వారి జేబుల్లో కొంత మొత్తం మిగిలే విధంగా చేస్తారు. దీంతో దేశంలో వినిమయ శక్తి పెరుగుతుంది. ద్రవ్యలోటును అరికట్టడానికి ప్రాధాన్యం ఇస్తూనే ప్రభుత్వ వ్యయ కేటాయింపులు ఎక్కువగా ఉంటాయి. దీంతో ఈ ర్యాలీలో ఇన్‌ఫ్రా, తయారీ, వినిమయ రంగాలు కీలకపాత్ర పోషించే వీలుంది. - బదరీష్ కుల్‌హల్లి, ఫిక్స్‌డ్ ఇన్‌కమ్ హెడ్, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్.
 
 ప్రోత్సాహక బడ్జెట్

రష్యా, ఉక్రెయిన్‌లు కాల్పుల విరమణ ప్రకటించడం, ఈ వారం చివర్లో ఎస్‌బీఐ, ఎంఅండ్‌ఎం అంచనాలను మించి ఫలితాలను ఇవ్వడంతో మార్కెట్లో ప్రీ బడ్జెట్ ర్యాలీకి పునాది పడింది. ఇదే సమయంలో ద్రవ్యోల్బణం కూడా మార్కెట్ అంచనాల కంటే తగ్గడం సానుకూలం. ఇన్ని సానుకూలాంశాల మధ్య మోదీ ఆకాంక్షిస్తున్న వృద్ధిని ప్రోత్సహించే విధంగా సంస్కరణల బడ్జెట్ ఉంటుందని మార్కెట్ గట్టిగా నమ్ముతోంది. ముఖ్యంగా మేకిన్ ఇండియా థీమ్‌కు అనుగుణంగా ఇన్‌ఫ్రా రంగాన్ని ప్రోత్సహించే విధంగా ఈ బడ్జెట్‌లో పలు చర్యలు ఉండే అవకాశం ఉంది. వృద్ధికి ప్రతిబంధకమైన పన్ను విధింపులు ఉండే అవకాశం లేదు. ద్రవ్యలోటును అరికట్టే విధంగా ఆర్థిక మంత్రి చర్యలు ఉంటాయి. ఈ బడ్జెట్‌పై ఇన్‌ఫ్రా రంగం భారీగా ఆశలు పెట్టుకుంది.
 - దీపేన్ షా, రీసెర్చ్ హెడ్, కోటక్ సెక్యూరిటీస్
 
 నూతన శిఖరాలు ఖాయం

ఇది బడ్జెట్ ర్యాలీనే... ఈ ర్యాలీలో సూచీలు నూతన శిఖరాలు నమోదు చేస్తాయని అంచనా వేస్తున్నాం. మేకిన్ ఇండియాకి అనుగుణంగా తయారీ రంగానికి ఈ బడ్జెట్‌లో పెద్ద పీట వేసే వేసే అవకాశం ఉంది. దీంతో తయారీ రంగానికి చెందిన షేర్లపై దృష్టిపెట్టచ్చు.        - సి.పార్థసారథి, కార్వీగ్రూపు చైర్మన్.
 
దీర్ఘకాల దృష్టితో ఇన్వెస్ట్ చేయొచ్చు...
 
ప్రస్తుతం ఇన్వెస్ట్ చేయొచ్చా? లేక వేచిచూడాలా? ఇప్పటికే ఇన్వెస్ట్ చేసినవారు వైదొలగాలా లేక కొనసాగాలా అన్న ప్రశ్నలకు దాదాపు నిపుణులంతా ఒకే సమాధానం  చెప్పారు. భారత మార్కెట్ల పట్ల విదేశీ సంస్థాగత మదుపరులు సానుకూల దృక్పథంతో ఉన్నారని, ఎఫ్‌ఐఐల ఇన్వెస్ట్‌మెంట్లు భారీగా కొనసాగుతాయని స్పష్టంచేశారు. అందుకని ఇన్వెస్టర్లెవరూ కంగారు పడి వైదొలగాల్సిన అవసరం లేదని, కొత్తవారైతే మార్కెట్ పడినప్పుడల్లా పెట్టుబడి పెట్టడానికి దాన్నొక అవకాశంగా భావించాలని చెప్పారు. మార్కెట్లో పెట్టుబడి పెట్టేవారు బడ్జెట్ వంటి చిన్న చిన్న ఈవెంట్లను దృష్టిలో పెట్టుకుని పెట్టుబడి చేయకూడదని, రెండుమూడేళ్లు కొనసాగేలా దీర్ఘకాలిక దృష్టితో ఇన్వెస్ట్ చేయాలని, అప్పుడే ఆశించినదానికన్నా అధిక లాభాలు అందుకోవచ్చని వారు చెప్పారు. అలా పెట్టుబడి పెట్టేవారికి ఈ దశలో కూడా మార్కెట్లలో మంచి విలువ ఉందన్నారు.    - సాక్షి పర్సనల్  ఫైనాన్స్ విభాగం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement