గుజరాత్ సీఎంను తొలగించే ధైర్యం లేదా?
గాంధీనగర్: గుజరాత్ అసెంబ్లీకి వచ్చే ఏడాది ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆనందిబెన్ పటేల్‌ను తప్పించాలని, ఆమె స్థానంలో కొత్త ముఖ్యమంత్రిని ఎంపిక చేయాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, పార్టీ అధ్యక్షుడు అమిత్ షా ఎప్పటి నుంచో యోచిస్తున్నారు. పటేళ్ల రిజర్వేషన్ల ఆందోళనను అణచివేయడంలో ఆమె వైఫల్యమే అందుకు కారణం. ఆమె నాయకత్వాన వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు పోటీ పడినట్లయితే పటేళ్లందరూ పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేస్తారన్నది ఇద్దరి నేతల భయం. అయితే పటేళ్ల ఆందోళనకారణంగా సీఎం పదవి నుంచి తప్పిస్తున్నట్లు బహిరంగంగా ప్రకటించే సాహసం బీజేపీ అధిష్టానం చేయలేదు. మరెలా తప్పించాలి?
అందుకు మోదీకి ఓ తరుణోపాయం చిక్కింది. 75 ఏళ్లు వయస్సు మీద పడిన వాళ్లు ఇటు ప్రభుత్వ నాయకత్వానికి, అటు పార్టీ నాయకత్వానికి దూరంగా ఉండాలన్నది మోదీ ఎప్పటి నుంచో చెబుతున్న అభిమతం. ఈ అభిమతం లేదా సాకుతోనే నాడు పార్టీ సీనియర్ నాయకులు అద్వానీ, మురళీ మనోహర్ జోషిలను పార్టీకి, నాయకత్వానికి దూరంగా పెట్టారు. ఏజ్‌బార్‌నే సాకుగా చూపించి ఆనందిబెన్ పటేల్‌ను తప్పించాలని నరేంద్ర మోదీ ఇంతకాలం భావిస్తూ వచ్చారు. దీన్ని సమర్థించుకోవడానికి ఆయనకు ఓ తాజా ఉదాహరణ కూడా ఉంది. 75 ఏళ్లు పైబడిన వారిని మంత్రివర్గం నుంచి తొలగించాల్సిందిగా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు బీజేపీ అధిష్టానం ఆదేశించింది. దాంతో రాష్ట్ర హోం మంత్రి బాబూలాల్ గౌర్ (86)ను, రాష్ట్ర ప్రజా పనుల శాఖ మంత్రి సర్తార్ సింగ్ (76)ను శివరాజ్ సింగ్ కేబినెట్ నుంచి తొలగించారు.
ఇదే సూత్రాన్ని అనుసరిస్తూ నవంబర్‌లో 75వ ఏట అడుగుపెడుతున్న గుజరాత్ సీఎం ఆనందిబెన్‌ను తప్పించాలని అనుకున్నారు. ఈ విషయాన్ని సూచనప్రాయంగా ఆమెను ఢిల్లీకి పిలిపించి మరీ చెప్పారు. ఆమె గత మే నెలలో మోదీని, అమిత్‌షాను కలసుకున్నప్పుడు త్వరలో ఆమెకు ఉద్వాసన తప్పదని మీడియాలో కూడా ఉహాగానాలు చెలరేగాయి. ఇప్పుడు అనుకోకుండా ఆనందిబెన్‌కు ఓ అదృష్టం కలసివచ్చింది. 75 ఏళ్ల అనంతరం కూడా కేంద్ర కేబినెట్‌లో మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి నజ్మా హెప్తుల్లా, సూక్ష్మ, చిన్న, మధ్య తరగతి పరిశ్రమల శాఖ మంత్రి కల్‌రాజ్ మిశ్రాలను మోదీ కేబినెట్‌లో కొనసాగించడమే పటేల్‌కు కలసివచ్చే అదృష్టం.
వాస్తవానికి కేంద్ర కేబినెట్ పునర్వవ్యవస్థీకరణలో భాగంగా 75వ ఏటలో పడిన వీరిద్దరిని తప్పించాలని మోదీ భావించారట. అయితే ఉత్తరప్రదేశ్ బ్రాహ్మణ కులానికి చెందిన వ్యక్తి అవడం వల్లనే కల్‌రాజ్ మిశ్రాను తొలగిస్తే తప్పుడు సంకేతాలు వెళతాయని పార్టీ అధిష్టానం భావించిందని విశ్వసనీయ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. యూపీ అసెంబ్లీకి వచ్చే ఏడాది ఎన్నికలు జరుగనుండడం, ఓటర్లలో 9 శాతం మంది బ్రాహ్మణులు ఉండడం తెల్సిందే. నరేంద్ర మోదీ తన ఏజ్ బార్ నిబంధనను తన కేబినెట్‌కే వర్తింప చేయనప్పుడు ఆనందిబెన్ పటేల్‌కు ఎలా వర్తింప చేస్తారని ఆమెకు విశ్వాసపాత్రుడైనా ఓ మంత్రి వ్యాఖ్యానించారు. ఈ కారణంగా ఆమెను తొలగించే దమ్ము మోదీకి లేదని ఆయన సవాల్ చేశారు.