
‘నల్ల’పప్పుపై ఉక్కుపాదం
కొండెక్కిన పప్పుధాన్యాల ధరలపై కేంద్ర కేబినెట్ సమీక్ష
పరిస్థితి సమీక్షించాలని మంత్రుల బృందానికి ఆదేశం
♦ దేశవ్యాప్తంగా 36 వేల టన్నుల పప్పుదినుసుల స్వాధీనం
♦ 10 రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున దాడులు: ఆర్థిక జైట్లీ వెల్లడి
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళన రేకెత్తిస్తున్న పప్పుదినుసుల ధరలపై కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో కేబినెట్ బుధవారం సమావేశమై ధరలను సమీక్షించింది. ధరల పరిస్థితిని అత్యవసరంగా సమీక్షించాలని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నేతృత్వంలోని మంత్రుల బృందాన్ని ఆదేశించింది. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ఎం.వెంకయ్య నాయుడు, రవాణా మంత్రి నితిన్ గడ్కారీ, వాణిజ్య మంత్రి నిర్మలాసీతారామన్‌లు సభ్యులుగా ఉన్న ఈ బృందం వెంటనే సమావేశమై దేశవ్యాప్తంగా పప్పుదినుసుల ధరల పరిస్థితిపై యుద్ధప్రాతిపదికన సమీక్షించింది.
అంతకుముందు కేబినెట్ సమావేశంలో మహారాష్ట్రలో 276 ప్రాంతాల్లో దాడులు నిర్వహించి 23వేల టన్నుల పప్పుదినుసులను స్వాధీనం చేసుకోవటంపై చర్చ జరిగింది. ఈ దాడుల వల్ల కొన్ని దినుసుల ధరలు తగ్గుముఖం పడుతున్నట్లు కేబినెట్ దృష్టికి తీసుకువచ్చింఒదని అధికార వర్గాలు తెలిపాయి. కాగా, దేశవ్యాప్తంగా వ్యాపారులు అక్రమంగా నిల్వ చేసిన 36 వేల టన్నుల పప్పు దినుసులను స్వాధీనం చేసుకున్నట్లు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మంత్రుల బృందం భేటీ తర్వాత విలేకర్లకు తెలిపారు. ‘నల్లబజారులో పప్పు ధాన్యాలను వెలికితీయడంలో రాష్ట్రాలు పూర్తిస్థాయిలో కృషి చేయటం లేదు.
ఇప్పటి వరకు 5 వేల టన్నుల పప్పు దినుసులను దిగుమతి చేసుకుని వివిధ రాష్ట్రాలకు పంపిణీ చేశాం. మరో మూడు వేల టన్నులను దిగుమతి చేసుకుంటున్నాం. దేశ రాజధాని ఢిల్లీలో.. కేంద్రీయ భండార్, సఫల్‌కు చెందిన 500 విక్రయ కేంద్రాల ద్వారా కిలో కందిపప్పును రూ.120కే అమ్ముతున్నాం. పప్పు దినుసులను నల్లబజారులో అమ్మేవారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. దాడులు ఇకపైనా కొనసాగుతాయి. రెండుమూడు రోజుల్లో ధరలు తగ్గుముఖం పడతాయి. దిగుమతి అయిన పప్పుదినుసులను తమిళనాడు తీసుకుంటోంది. ఆంధ్రప్రదేశ్ ఆ రాష్ట్ర రాజధాని శంకుస్థాపన తరువాత తీసుకుంటుంది’ అని వివరించారు.