
ప్రధాని నివాసంలో పిల్లి లొల్లి!
లండన్: బ్రిటన్ ప్రధానమంత్రి పదవి నుంచి దిగిపోయిన డేవిడ్ కామెరాన్ పెట్టేబెడా సర్దుకొని అధికారిక నివాసాన్ని వీడారు. కానీ, ఆయనతోపాటు డౌనింగ్ స్ట్రీట్ లోని ప్రధాని నివాసానికి వచ్చిన పిల్లి ల్యారీ మాత్రం అక్కడే తిష్టవేయబోతున్నది. కామెరాన్ వెళ్లిపోతున్న నేపథ్యంలో ఆయనతోపాటు ఈ పిల్లిని కూడా బయటకు పంపిస్తారని మొదట భావించారు.
అయితే, ఈ పిల్లిని బయటకు పంపించడం లేదని తాజాగా ప్రధాని కార్యాలయం అధికారులు స్పష్టం చేశారు. కొత్త ప్రధానిగా థెరిసా మే హయాంలోనూ 'చీఫ్ మౌసర్'గా ల్యారీ సేవలందింబోతున్నదని వెల్లడించారు.
డౌనింగ్ స్ట్రీట్ లోని క్యాబినెట్ కార్యాలయం ఉన్న నంబర్ 10 వద్ద తోక ఊపుకుంటూ కనిపిస్తూ ల్యారీ టీవీల్లో, మీడియాలో బాగా ఫేమస్ అయింది. నంబర్ 10 బ్లాకులో నల్ల ఎలుకల బెడద ఎక్కువగా ఉండటం, లైవ్ టీవీ కార్యక్రమం వస్తున్న సమయంలోనూ బ్యాక్ గ్రౌండ్ లో ఎలుకలు తమ పని తాము చేస్తూ చికాకు పరుస్తుండటంతో 2011లో లండన్ లోని కుక్కలు, పిల్లుల సంరక్షణ సంస్థ నుంచి ల్యారీ అనే పిల్లిని తీసుకొచ్చారు. ఇది అనతికాలంలోనే ఎలుకలను పట్టడంలో తన కర్తవ్యాన్ని గొప్పగా నిర్వహించింది. ప్రధాని నివాసం సహా నంబర్ 10 బ్లాకులో ఎలుకలను తరిమికొట్టింది.
దీని సేవలను మెచ్చుకుంటూ తొలిసారి దీనికి సివిల్ సర్వెంట్ క్యాట్ గా గుర్తింపు ఇచ్చి.. 'చీఫ్ మౌసర్'గా కామెరాన్ హయాంలో నియమించారు. కామెరాన్ ప్రధాని పదవి నుంచి దిగిపోవడంతో ఆయన హయాంలో 'చీఫ్ మౌసర్'గా నియామకమైన ఈ పిల్లి ఉద్యోగం కూడా ఊడుతుందని అనుకున్నప్పటికీ దీని సేవలను థెరిసా హయాంలో కూడా వినియోగించుకోవాలని అధికారులు నిర్ణయించారు. దీంతో డౌన్ స్ట్రీట్ లో అధికారిక నివాసాల్లో ఇకముందు కూడా తన దర్జాను ఒలుకబోస్తూ ఈ పిల్లి విధుల నిర్వహించనుంది.