
ఎన్నికల తర్వాత కొత్త కొలువుల జోరు
ముంబై: వచ్చే సార్వత్రిక ఎన్నికల తర్వాత దేశంలో కొత్త ఉద్యోగాల జోరు పెరుగుతుందని నిపుణులంటున్నారు. ఈ ఏడాది కొత్త ఉద్యోగాలివ్వడంలో కంపెనీలు అనేక సమస్యలు ఎదుర్కొన్నాయని, అయితే వచ్చే ఏడాది జూన్‌కల్లా ఎన్నికలు పూర్తయ్యేసరికి హైరింగ్ జోరు పెరుగుతుందని వివిధ మానవ వనరుల సేవలందించే కంపెనీలంటున్నాయి. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరవాత హైరింగ్ ఊపందుకుంటుందని ప్రముఖ రిక్రూట్‌మెంట్ కన్సల్టెన్సీ సంస్థ, మైకేల్ పేజ్ ఇండియా డెరైక్టర్ నీలయ్ ఖండేల్‌వాల్ చెప్పారు. ఈ ఏడాది మూడో త్రైమాసికంలో కొత్త ఉద్యోగాలు తగ్గాయని పేర్కొన్నారు.
కలసి వస్తోన్న అమెరికా రికవరీ
ఏ రంగంలో కూడా ఉద్యోగాల కోత, కొత్త ఉద్యోగాలు నిలిపేయడం వంటి అంశాలు చోటు చేసుకోలేదని టాలెంట్ స్ప్రింట్ సీఈవో, ఎండీ శంతన్‌ను పాల్ చెపారు. రిటైల్, ఆతిధ్య, విద్య, ఆరోగ్య సంరక్షణ రంగాల్లో హైరింగ్ ఓ మోస్తరుగా ఉందని పేర్కొన్నారు. ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్, క్యాపిటల్ మార్కెట్లు, బీమా, మౌలిక, రియల్టీ, నిర్మాణ రంగాల్లో హైరింగ్ తగ్గిందని వివరించారు. అమెరికా ఆర్థిక వ్యవస్థ పుంజుకున్న సూచనలు కనిపిస్తుండటంతో ఎగుమతులకు సంబంధించిన అన్ని రంగాల్లో హైరింగ్ పుంజుకోవచ్చని పేర్కొన్నారు. కరెంట్ అకౌంట్ లోటు, ద్రవ్యోల్బణం వంటి అంశాల్లో మెరుగుదల ఉంటే, 6-12 నెలల్లో దేశీయంగా అన్ని రంగాల్లోనూ హైరింగ్ జోరు పెరుగుతుందని వివరించారు. ఆర్థిక వ్యవస్థ వృద్ధి మందగమనం, వినియోగదారులు కొనుగోళ్లు తగ్గడం, మార్కెటింగ్ కార్యకలాపాలు జోరుగా లేకపోవడం వంటి కారణాల వల్ల ఆటో మొబైల్ రంగంలో హైరింగ్ తగ్గిందని గ్లోబల్‌హంట్ ఎండీ సునీల్ గోయెల్ చెప్పారు.
2 లక్షల ఉద్యోగాల కోత
ఆర్థిక వృద్ధి మందగమనం కారణంగా గత 8-10 నెలల్లో సంఘటిత రంగాల్లో 2 లక్షల ఉద్యోగాలు పోయాయని ర్యాండ్‌స్టడ్ ఇండియా సీఈవో మూర్తి కె. ఉప్పలూరి చెప్పారు. అయితే అధ్వాన పరిస్థితులు ముగిశాయని, రానున్న నెలల్లో వ్యాపారం పుంజుకునే అవకాశాలున్నాయని వివరించారు.
ఆర్ అండ్ డీలో 2 లక్షల ఉద్యోగాలు
ఐదేళ్లలో పరిశోధన, అభివృద్ధి రంగంలో 2 లక్షల కొత్త ఉద్యోగాలు వచ్చే అవకాశాలున్నాయని అంతర్జాతీయ మేనేజ్‌మెంట్ కన్సల్టింగ్ సంస్థ జిన్నోవ్ పేర్కొంది. అంతర్జాతీయ అగ్రశ్రేణి 500 కంపెనీల్లో 228 వరకూ భారత్‌లో కార్యకలాపాలు నిర్వహించడమే దీనికి కారణమని వివరించింది.
4
రూ. 34,647 కోట్ల ప్రాజెక్టులకు ఫాస్ట్‌ట్రాక్‌లో అనుమతి
న్యూఢిల్లీ: ఆర్థిక వ్యవస్థను గాడిలోపెట్టే చర్యల్లో భాగంగా ప్రభుత్వం రూ. 34,647 కోట్ల విలువైన ప్రాజెక్టులకు చకచకా అనుమతులు మంజూరుచేసేలా నడుంబిగించింది. విద్యుత్ రంగంలో రూ. 26,700 కోట్ల విలువైన, పెట్రోలియం-సహజవాయువు రంగాల్లో రూ. 7,947 కోట్ల విలువైన ప్రాజెక్టులకు పలురకాల క్లియరెన్సులను ఫాస్ట్‌ట్రాక్‌లో పూర్తయ్యేలా చర్యలు తీసుకుంది. ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని పెట్టుబడులపై ఏర్పాటైన క్యాబినెట్ కమిటీ(సీసీఐ) వీటికి ఆమోదముద్రవేసినట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.
కొన్నింటికి ఆమోదముద్ర, మరికొన్ని ప్రాజెక్టులకు తక్షణం పర్యావరణ ఇతరత్రా అనుమతులు లభించేలా తగిన నిర్దేశాన్ని సీసీఐ చేసినట్లు ఆయా వర్గాలు వెల్లడించాయి. విశాఖపట్నంలో ప్రతిపాదిత హిందూజా నేషనల్ పవర్ కార్పొరేషన్ విద్యుత్ ప్రాజెక్టు, పశ్చిమ బెంగాల్‌లో సాగర్ సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్టులు కూడా ఈ జాబితాలో ఉన్నాయి.