సమగ్ర అవగాహనతోనే విజయం | Can wiin with Comprehensive understanding in Group-1 exam | Sakshi
Sakshi News home page

సమగ్ర అవగాహనతోనే విజయం

Published Thu, Sep 24 2015 2:23 AM | Last Updated on Sun, Sep 3 2017 9:51 AM

సమగ్ర అవగాహనతోనే విజయం

సమగ్ర అవగాహనతోనే విజయం

* సిలబస్‌పై ఆందోళన అక్కర్లేదు
* ప్రణాళికాబద్ధంగా చదివితే చాలు
* మార్కెట్‌లో అనేక పుస్తకాలున్నాయ్
* ఎంపికలో జాగ్రత్త పడితే చాలు
* గ్రూప్-1 సిలబస్ సబ్ కమిటీ చైర్మన్ ప్రొ. కోదండరాం
* ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ

 
 సాక్షి, హైదరాబాద్: ‘‘నూతన తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తును తీర్చిదిద్దడంలో కీలకంగా వ్యవహరించాల్సింది, ప్రజల ఆకాంక్షలను అర్థం చేసుకుని వారికి సేవలందించాల్సింది కొత్తగా ప్రభుత్వోద్యోగాలు చేపట్టేవారే. అందుకే వారికి జాతీయాంశాలతో పాటు స్థానికాంశాలపైనా సమగ్ర అవగాహన తప్పనిసరి. కాబట్టే టీఎస్‌పీఎస్సీ పోటీ పరీక్షల్లో అంతర్జాతీయ, జాతీయాంశాలతోపాటు తెలంగాణపై ప్రత్యేకంగా ప్రశ్నలు అడిగేలా సిలబస్‌ను రూపొందించాం’’ అని టీఎస్‌పీఎస్సీ సిలబస్ కమిటీ సభ్యుడు, గ్రూప్-1 సిలబస్ సబ్ కమిటీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన ఆయన... వివిధ పోటీ పరీక్షలకు సన్నద్ధతపై ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ప్రధానంగా గ్రూప్-1, 2, 3 తదితర పరీక్షలకు ఎలా సిద్ధం కావాలి, ఉద్యమ చరిత్ర, తెలంగాణ ఆవిర్భావం తదితరాలపై ప్రవేశపెట్టిన ప్రత్యేక పేపర్లకు ఎలా సిద్ధం కావాలన్న అంశాలపై ఇలా వివరించారు...
 
 కొత్త రాష్ట్రంలో ఉద్యోగంలోకి వచ్చే వారికి ఇక్కడి చరిత్ర, సామాజికాంశాలపైనా, రాజ్యాంగంపైనా స్థూల అవగాహన ఉండాలి. గ్రూప్-1ను తీసుకుంటే జనరల్ ఎస్సేకు ప్రిపేరయ్యే వారు చరిత్ర, భౌగోళిక శాస్త్రం, సంస్కృతి, భారత సమాజం, రాజ్యాంగం, ఆర్థిక వ్యవస్థ, సైన్స్ అండ్ టెక్నాలజీ వంటివన్నీ చదువుకుంటే ఎస్సేతోపాటు ఇతర సబ్జెక్టులకూ బాగా సిద్ధం కావచ్చు. ఏ పోటీ పరీక్ష తీసుకున్నా దేశ, రాష్ట్ర చరిత్ర, భౌగోళిక పరిస్థితులు, శాస్త్ర సాంకేతిక పురోభివృద్ధిలో అభ్యర్థి అవగాహనపై ప్రశ్నిస్తున్నారు. అదే గ్రూప్-2లో అయితే భౌగోళిక, సైన్స్ అండ్ టెక్నాలజీ అంశాలు తక్కువ.
 
 90 శాతం రైతులు రుణభారంలోనే
 ‘ఆర్థిక వ్యవస్థ, అభివృద్ధి’ పేపర్‌పైనే అభ్యర్థులు కొంత టెన్షన్ పడతారు. కానీ ఎకనామిక్స్ సబ్జెక్టుపై అభ్యర్థుల నుంచి లోతైన అవగాహన కోరుకోవడం లేదు. దేశ ఆర్థిక  వ్యవస్థ, స్వరూప స్వభావాలే అడుగుతారు. తెలంగాణలో నూటికి 60 మంది రైతులే. భూ సంస్కరణలు అమలై  వ్యవసాయ రంగంలో మార్పులు సాధించుకున్న తర్వాతి పరిస్థితులేమిటన్నది అడుగుతారు. ప్రస్తుతం తెలంగాణలో నూటికి 80 శాతం చిన్న రైతులే. వారిలోనూ 90 శాతం మందిపై రుణభారముంది. ఒక్కొక్కరిపై సగటున రూ.95 వేల రుణభారముంది. విదేశాల్లో ఇది గరిష్టంగా రూ.45 వేలే ఉంది. మన వ్యవసాయ పరిస్థితులు, అంటే ఎక్కువగా బోర్లపై ఆధారపడటం వంటివే ఇందుకు కారణం.
 
 పట్టణీకరణ
 పట్టణ జనాభా ఇటీవల పెరుగుతోంది గనుక పట్టణీకరణ లక్షణాలేమిటన్నది తెలుసుకోవాలి. మన దగ్గర హైదరాబాద్ ప్రధాన నగరం. మిగితావి చిన్న నగరాలు. పట్టణీకరణతోపాటు పారిశ్రామిక ప్రగతి, అందులో ఉపాధి వాటా చూడాలి. వ్యవసాయ, పారిశ్రామిక రంగాల కంటే మన దేశంలో సేవా రంగంలో ఎక్కువ మంది పనిచేస్తుండటం విచిత్రం. తెలంగాణలో ఉద్యోగంలో చేరాలనుకునే వారికి ఇలాంటి ప్రధానాంశాలపై అవగాహన ఉండి తీరాలి. మన ఆర్థిక ప్రగతికి ప్రధానమైన వ్యవసాయ పరిస్థితిపై అవగాహన ఉండాలి. స్థూలంగా ఆయా రంగాలపై అవగాహన కావాలి. అలాగని దీనిపై గందరగోళం, టెన్షన్ అక్కర్లేదు. ప్రిపరేషన్ నిజానికి చాలా ఈజీ. ప్రామాణిక గ్రంథాలు దొరక్కపోయినా.. గ్రహించాల్సిందేమిటంటే చదివే ఇతర సబ్జెక్టుల్లో ఇవన్నీ కలిసే ఉంటాయి.
 
 ముల్కీ ఉద్యమం ఆలంబనగా
 తెలంగాణ అస్తిత్వ రూపకల్పన ముల్కీ ఉద్యమం ఆలంబనగా, దానిచుట్టూ అల్లుకొని సాగింది. 1952లో వచ్చిన ఉద్యమం దీనికి పరాకాష్ట. ఈ ముల్కీ ఉద్యమం ద్వారా తెలంగాణ వారు రెండు చెప్పారు. మేం వేరు. బయటి వారు రావచ్చు, బతుకవచ్చు. కానీ పెత్తనం చేయడానికి వీల్లేదు. రెండోది... మా సంస్కృతి ప్రత్యేకమైనది. అది వాణిజ్య సంస్కృతి కాదు. మాది సమష్టి తత్వం. ఇక్కడ భిన్న కులాలు, మతాలు, ప్రాంతాల వారు కలిసి జీవించగలరని చెప్పారు. నిజాం కాలంలో దీన్నే గంగా జమునా తెహజీబ్ అన్నారు. సహజీవనం నుంచి పెంపొందిన ఉమ్మడి సంస్కృతి తెలంగాణ జన జీవనానికి పునాది అని చెప్పుకొచ్చారు. ఇదే తెలంగాణ తెలంగాణ అస్తిత్వ రూపకల్పన. ‘ఇతర ప్రాంతాల వారు రావచ్చు. బతుకవచ్చు. అభ్యంతరం లేదు. కానీ మేం వారితో కలువం. ఎందుకంటే వారొస్తే పెత్తనం చేస్తారు’ అన్న ఆందోళన ఉంది. చారిత్రక నేపథ్యం కారణంగా భయాలున్నాయి. అందుకే ఆంధ్రప్రదేశ్ ఏర్పాటును తెలంగాణ అంగీకరించలేదు. ఎట్టి పరిస్థితుల్లో ఆంధ్ర ప్రాంతంతో కలిసేది లేదన్నరు. మా ప్రత్యేకతలు కాపాడుకుంటం, మా రాష్ట్రం మాకు కావాలని డిమాండ్ పెట్టారు.
 
 తెలంగాణ రక్షణలు
 తెలంగాణ ప్రత్యేకతలు, ఆకాంక్షలను గుర్తించి అప్పటి ప్రభుత్వాలు రక్షణలు కల్పించాయి. తెలంగాణ నిధులు తెలంగాణకే ఖర్చు చేయాలి, ముల్కీ నిబంధనలను అమలు చేసి తెలంగాణ ఉద్యోగాలను అక్కడి అభ్యర్థులకే ఇవ్వాలి, విద్యాలయాల్లో స్థానిక రిజర్వేషన్ల అమలును కొనసాగించాలి వంటివి పెట్టారు. కానీ అవేవీ అమలుకు నోచుకోలేదు. దీంతో 60వ దశకమంతా రక్షణల చరిత్ర, అవి అమలవుతాయా, లేదా అన్నదే. ఇవే ఇందులో ప్రత్యేకాంశాలు.
 
 తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసిన వైనం
 ఒక బలమైన ధనిక రైతాంగం ఆంధ్ర ప్రాంతంలో ఎదిగి, ప్రాంతీయ పార్టీల రూపంలో బలం పుంజుకొని తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బకొట్టింది. తెలుగుజాతి నినాదంతో వచ్చిన రాజకీయాలు తెలంగాణ అస్తిత్వానికి స్థానం కల్పించలేకపోయాయి. తెలంగాణ ప్రజల ఆర్థిక అవసరాలను చూడలేక పోయిది. దాంతో 1996లో మళ్లీ తెలంగాణ ఉద్యమం వచ్చింది. కనుక మనం చూడాల్సిందేమిటంటే... 1973 తరువాత జరిగిన పరిణామాల్లో తెలుగుజాతి రూపకల్పనలో తెలంగాణ అస్తిత్వం ఏమైపోయింది? తెలంగాణ ప్రజల ఆర్థిక పరిస్థితి ఏమైంది?
 
 మలి దశ ఉద్యమం
 ఇక తరవాత వచ్చింది మలి దశ ఉద్యమం. 1996 నుంచి 2001 వరకు భావవ్యాప్తి జరిగింది. 2001లో ఒక రాజకీయ వ్యక్తీకరణ దొరికింది. తెలంగాణ ఒక రాజకీయ ఆకాంక్ష సాధన కోసం ఉద్యమించడం ప్రారంభమైంది. తొలి దశలో ఈ ఉద్యమం రాజకీయ ప్రక్రియ చట్టపరిధిలో జరిగింది. యూపీఏ కనీస ఉమ్మడి కార్యక్రమంలోనూ తెలంగాణ ఆకాంక్షను పేర్కొన్నారు. రాష్ట్రపతి ప్రసంగంలోనూ చోటిచ్చారు. తరవాత అన్ని పార్టీల అభిప్రాయం తీసుకొని అందరిని ఒప్పిస్తామన్నారు. దానికి ప్రణబ్, రోశయ్య కమిటీలు వేశారు. కానీ ఏ కమిటీ కూడా సమస్య పరిష్కారానికి పూనుకోలేదు. దాంతో 2009లో మళ్లీ ఉద్యమం వచ్చింది. అప్పుడు భావవ్యాప్తి, ఆందోళన, రాజకీయ ప్రక్రియ మూడు ఏకమై సమ్మిళితంగా ఏకకాలంలో నడిచాయి.
 
 ఆఖరి భాగంలో పునర్‌వ్యవస్థీకరణ చట్టం
 ఆఖరి భాగంలో చదవాల్సింది... తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన ఏపీ పునర్‌వ్యవస్థీకరణ చట్టం గురించి. ఇది చాలా కీలకం. ఏ విభజనచట్టమై నా ఒకేలా ఉంటుంది. అయితే అంగాలుండాలి కదా. కొత్త రాష్ట్రం ఏర్పడితే సరిహద్దులను విభజించి, లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలను పేర్కొని, హైకోర్టు, కార్యనిర్వాహక ఏర్పాటుకు చర్యలు చేపడతారు. రాష్ట్ర విభజనకు, ఉద్యోగుల విభజనకు, కార్పొరేషన్ల విభజన కు నిబంధనలు పొందుపరిచారు. మన దగ్గర ప్రత్యేకాంశం ఏమంటే హైదరాబాద్ కొంతకాలం ఉమ్మడి రాజధానిగా ఉంటుందన్నది, ఇరు రాష్ట్రాలకూ గవర్నర్ ఒక్కరే ఉంటారన్నది. అవసరమైతే హైదరాబాద్‌లో శాంతిభద్రతల్లో ఆయన జోక్యం చేసుకునే వెసలుబాటు ఉంటుంది కూడా. తెలంగాణ చరిత్ర చదివితే ప్రస్తుతమున్న తెలంగాణ ఉద్యమ మూలా లు తెలుస్తాయి. రాష్ట్రావిర్భావం దిశగా ఉద్యమం ప్రయాణించడానికి దారి తీసిన ఆర్థిక పరిస్థితులు మూడోదైన ఆర్థికాభివృద్థి పేపర్లోనూ ఉంటాయి.
 
 మితిమీరిన విశ్వాసం వద్దు
 తెలిసిన విషయాలే కదా అన్న మితిమీరిన విశ్వాసం వద్దు. ఈ అంశాలకు శాస్త్రీయ దృక్పథంతో సమాధానాలు రాయాలి. ఆధారాల్లేకుండా భావోద్వేగాలతో రాస్తే నష్టం జరుగుతుంది.
 
 ప్రత్యేక పేపర్ విషయంలో ఇలా..
 గ్రూప్-1, 2, ఇతర పోటీ పరీక్షల్లో జనరల్‌స్టడీస్‌లో తెలంగాణ ఉద్యమం గురించి ఉంటుం ది. ఈ పేపర్‌లో స్థూలంగా తెలంగాణ అస్తిత్వం దాన్ని నిలబెట్టుకోవడానికి ప్రజలు చేసిన ప్రయత్నం, దాన్ని గుర్తించి, గౌరవిస్తూ ప్రభుత్వం తీసుకున్న చర్యలు తదితరాలు తెలుసుకోవాలి.
 
 అమలుకు నోచని ఒప్పందాలు
తెలంగాణకు అప్పటి ప్రభుత్వాలు కల్పించిన రక్షణలో ప్రధాన అంశాలేమిటి, అవెలా అమలయ్యాయన్నది ముఖ్యం. రక్షణల అమలు కోసం ఏర్పడిందే ప్రాంతీయ రీజనల్ కమిటీ. అదేం చేసిందన్నది ముఖ్యం. రక్షణలు అమలు కానప్పుడు తెలంగాణ ప్రజలేం చేశారన్నది ప్రధానం. 1968 నుంచి రక్షణల అమలుకు ప్రయత్నం మొదలైంది. కానీ అవి అమలు కాకపోవడంతో ఆందోళన మొదలైంది. 1968లో ఉద్యమం వచ్చింది. 1972 వరకు సాగింది. రక్షణలను పటిష్టంగా అమలు చేయాలని, ముల్కీ నియామాలను గట్టిగా అమలు చేయాలని 1972లో కేంద్రం నిర్ణయించింది. రీజనల్ కమిటీ అధికారాలు పెంచింది. దీన్ని వ్యతిరేకిస్తూ, ‘రక్షణలైనా రద్దు చేయండి, రాష్ట్రాన్నయినా విడదీయండి’ అంటూ ఆంధ్రాలో జై ఆంధ్రా ఉద్యమం మొదలైంది. దాంతో కేంద్రం వెనక్కి తగ్గి రక్షణలను రద్దు చేసింది. చివరకు అన్ని ప్రాంతాల్లోనూ వెనకబడిన ప్రాంతాలు ఎక్కడున్నా అభివృద్ధికి సమాన చర్యలు చేపడతామని పేర్కొంది. ఏ ప్రాంత ఉద్యోగాలను ఆ ప్రాంతం వారే పొందే హక్కు కల్పిస్తామని హామీ ఇచ్చింది. కానీ తెలంగాణలో ఈ హామీ అమలు కాలేదు.
 
 ఏ పుస్తకాలు చదవాలంటే..
 జనరల్‌స్టడీస్‌కు ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలు, రాష్ట్ర ప్రభుత్వ పుస్తకాలు. 9, 10 తరగతుల టెక్స్ట్‌బుక్స్. ఇక భారత రాజ్యాం గాన్ని స్థూలంగా అంతా టెన్త్ వరకు చదువుతారు. తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఆవి ర్భావం పేపర్‌కు శ్రీకృష్ణ కమిటీ నివేదికలో చాలా సమాచారముంది. ఇది తెలుగులోనూ దొరుకుతుంది. వట్టికోట ఆళ్వారు స్వామి తెలంగాణం పుస్తకం, సుంకిరెడ్డి నారాయణరెడ్డి తెలంగాణ చరిత్ర, ప్రొఫెసర్ జయశంకర్ రాసిన తెలంగాణ రాష్ట్రం-ఒక డిమాండ్, ఆదిరాజు వెంకటేశ్వరరావు రాసిన ఉద్యమ చరిత్ర-తెలంగాణపోరాటం, గౌతమ్ పింగ్లే రాసిన ఫాల్ అండ్ రైజ్ ఆప్ తెలంగాణ, తెలుగు అకాడమీ పుస్తకాలు, తెలంగాణ చరిత్రపై పరిశోధన చేసిన వి.ప్రకాశ్ వంటివారి పుస్తకాలను ప్రామాణికంగా తీసుకోవచ్చు. తెలంగాణ.ఆర్గ్‌లో చాలా సమాచారం ఉంది.
 
 తెలంగాణ ఉద్యమం సమీకరణ దశ దాటి ఆవిర్భావం దిశగా సాగిన దశపై ప్రొఫెసర్ డి.నర్సింహారెడ్డి ఎడిట్ చేసిన ‘ప్రపంచబ్యాంకు పడగ నీడలో’ పుస్తకం బాగుంటుంది. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన పలు సెమినార్లపై వచ్చిన పుస్తకాలూ ఉపయోగపడతాయి. అయితే ఎంతసేపూ ప్రామాణిక గ్రంథాల కోసమే చూడటం కాకుండా, అవగాహన ఏర్పరచుకోవడం ముఖ్యం. అలాగే గ్రూప్స్ పరీక్షల నిర్వహణ తీరుతెన్నుల్లో వచ్చిన మార్పులపైనా అవగాహన ఉండాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement