
ఔను! మన సిన్మాల్నే వాళ్లు కాపీ కొడుతున్నారు!
మన సినిమాలు చాలావరకు హాలీవుడ్ సినిమాల్ని కాపీ కొట్టినట్టు ఉంటాయి. హాలీవుడ్, కొరియా చిత్రాల్లోని పోరాట దృశ్యాలను, సెట్టింగ్స్, ఎమోషన్స్ ను యథాతథంగా దిగమతి చేసుకోవడంలో మనోళ్లు దిట్టలు.. ఇది మన సినిమాలపై చాలామందికి ఉన్న అభిప్రాయం. కానీ ఇంకా మీరు అదే అభిప్రాయంలో ఉంటే పప్పులో కాలేసినట్టే..
ఎందుకంటే ఇప్పుడు బాలీవుడ్ సినిమాలు కూడా హాలీవుడ్ చిత్రాలకు ప్రేరణగా నిలుస్తున్నాయి. అంతర్జాతీయంగా ప్రశంసలందుకుంటున్న మన సినిమాలను ఏకంగా హాలీవుడ్ దర్శక నిర్మాతలు కాపీ కొడుతున్నారు.
ఉదాహరణకు నసీరుద్దీన్ షా హీరోగా తెరకెక్కిన ‘ఏ వెడ్నెస్ డే’ సినిమా హాలీవుడ్‌లో ‘కామన్ మ్యాన్’గా రీమేక్ అయింది. ఇందులో ప్రధాన పాత్రను బేన్ కింగ్‌స్లే పోషించాడు. షారుక్ ఖాన్ ‘డర్’ సినిమా ప్రేరణగా హాలీవుడ్‌లో ‘ఫియర్’ చిత్రాన్ని రూపొందించారు. ‘జబ్ వుయ్ మెట్’ సినిమా ఆధారంగా హాలీవుడ్‌లో ‘ఏ లీప్ ఇయర్’ సినిమా వచ్చింది. ఇలా చెప్పుకుంటూ పోతే మన సినిమాలు అంతర్జాతీయంగా మంచి ప్రభావాన్నే చూపుతున్నాయి.
తాజాగా కెనడాకు చెందిన బ్రదర్-సిస్టర్ నిర్మాణ సంస్థ ఓ ఆడియో ట్రాక్ కవర్ కోసం మన సినిమా పోస్టర్‌ను అడ్డంగా కాపీ కొట్టింది. ఈ సంస్థ విడుదల చేసిన తాజా ట్రాక్ ‘ఎక్స్‌వైజెడ్’ కవర్ యథాతథంగా బాలీవుడ్ సినిమా ‘కుచ్ కుచ్ హోతా హై’ పోస్టర్‌ను పోలి ఉండటం గమనార్హం. పోస్టర్‌నే కాదు ఆ సినిమా థీమ్‌ను కూడా ఈ నేచర్ ట్రాక్‌లో వాడుకున్నారు. ఇందులో కనిపించే లుక్, టెస్ టెన్సీసన్ కూడా అచ్చం ‘కుచ్ కుచ్ హోతా హై’ లో షారుక్, కాజోల్ పాత్రల్లాగే ఉండటం నెటిజన్లు గుర్తించి.. దీనిపై పోస్టులు చేస్తున్నారు. మా సినిమా థీమ్‌లనే కాదు.. పోస్టర్లను కూడా కాపీ కొడతారా? వారు ప్రశ్నిస్తున్నారు.