డబ్బులు పోయి కేసులు వచ్చె..
‘డబ్బు పాయే... బదనాం’ మిగిలే అని తెలంగాణ టీడీపీ తమ్ముళ్లు తెగ మథనపడిపోతున్నారు. ‘ఒకటి కాదు, రెండు కాదు, పైపై లెక్కలు చూస్తేనే అయిదారు కోట్లు పార్టీ ఎమ్మెల్యేల చేతుల్లో పోస్తిమి. ఓట్లు రాలుడేమోగానీ, కేసులు మాత్రం మీదపడే’ అని ఓ తెలుగు తమ్ముడు వాపోయాడు. మండలి ఎన్నికల్లో రాదని తెలిసినా గెలుపు కోసం గెంతులేసిన టీటీడీపీ ఎమ్మెల్యేలు కేసుల్లో జైలుకు వెళ్లారు. ఎన్నికల్లో గట్టెక్కేందుకు మాటా ముచ్చట జరిగిన కొందరు ఇతర పార్టీ ఎమ్మెల్యేల చేతుల్లో డబ్బులు పోశారు.
అనామతు లెక్కలు చూస్తేనే కళ్లు బైర్లు కమ్ముతున్నయ్ తమ్ముళ్లకు. ఒకరికి కోటి రూపాయలు, ఇంకో ఇద్దరికి చెరో అరకోటి, మరో జిల్లాలో ఇద్దరు సభ్యులకు ఒక్కొక్కరికి అరకోటి చొప్పున పంచారు. రాజధాని పొరుగునే ఉన్న జిల్లాలో ఇంకో అరకోటి. ఇలా లెక్కలు గడుతున్న తెలుగు తమ్ముళ్లు ఈ డబ్బును మళ్లీ వెనక్కి ఎట్టా రాబట్టుకోవాలా అని తలలు బద్దలు కొట్టుకుంటున్నారు. ‘గోడకు వేసిన సున్నం, రాజకీయ నాయకుని జేబులోకి పోయిన రూపాయి మళ్లీ వెనక్కి వస్తయా? వదిలించుకున్న చేతి చమురు మళ్లీ అంటుకుంటదా?’ అని కొందరు చమత్కరిస్తున్నారు.