పార్టీలకు కూడా డిజిటల్‌ చెల్లింపులే ఉండాలి! | Cash donations received by political parties capped at Rs 2,000 | Sakshi
Sakshi News home page

పార్టీలకు కూడా డిజిటల్‌ చెల్లింపులే ఉండాలి!

Published Thu, Feb 2 2017 3:48 PM | Last Updated on Fri, Sep 28 2018 3:31 PM

పార్టీలకు కూడా డిజిటల్‌ చెల్లింపులే ఉండాలి! - Sakshi

పార్టీలకు కూడా డిజిటల్‌ చెల్లింపులే ఉండాలి!

న్యూఢిల్లీ: రాజకీయ పార్టీలకు ఇచ్చే విరాళాల్లో నల్లడబ్బును అరికట్టేందుకు రెండు వేల రూపాయలకు మించిన విరాళాలను స్క్రూటినీ పరిధిలోకి తెస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల ఏమైనా ఫలితం ఉందా? గతంలో స్క్రూటినీ పరిధి 20 వేల రూపాయలు ఉండగా ఇప్పుడు దాన్ని రెండువేల రూపాయలకు కుదించారు. ఎన్నికల కమిషన్‌ చేసిన తాజా సిఫార్సు మేరకు బడ్జెట్‌లో  ఈ సవరణ తీసుకొచ్చారు. గతంలో 20వేల రూపాయలకు పైగా ఇచ్చే విరాళాలను చెక్కులు, డీడీలు, డిజిటల్‌ రూపంలోనే తీసుకోవాల్సి ఉండగా, ఇప్పుడు రెండు వేల రూపాయలకు మించిన విరాళాలను చెక్కులు, డీడీలు, డిజిటల్‌ రూపంలోనే తీసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో  నగదు రూపంలో తీసుకోకూడదు.

రెండు వేల రూపాయలకు మించి ఇచ్చిన విరాళాలు ఆదాయం పన్ను స్క్రూటిని పరిధిలోకి వస్తాయి. అంటే ఆదాయం పన్ను శాఖ అధికారులు అడిగితే ఆ దాతల వివరాలను రాజకీయ పార్టీలు వెల్లడించాల్సి ఉంటుంది. గతంలో 20 వేల రూపాయల పరిమితి విధించినప్పుడు ఎలాంటి ప్రయోజనాలు చేకూరలేదని, ఇప్పుడు రెండు వేల రూపాయల పరిధిని విధించడం వల్ల కూడా ఎలాంటి ప్రయోజనం ఉండదని, నల్లడబ్బు మాత్రమే రాజకీయ పార్టీలకు విరాళంగా వస్తుందని అహ్మదాబాద్‌లోని ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ మాజీ ప్రొఫెసర్‌ జగదీప్‌ ఛోకర్‌ అభిప్రాయపడ్డారు.

గతంలో 19,999 రూపాయలు, అంతకన్నా తక్కువ విరాళాలు తీసుకున్నట్లు రాజకీయ పార్టీలు రసీదులు చూపగా, ఇప్పుడు 1,999 రూపాయలు లేదా అంతకన్నా తక్కువ విరాళాలను ఒకరి నుంచి లేదా ఒక కంపెనీ నుంచి తీసుకున్నట్లు చూపిస్తాయని, ఇక్కడ రసీదులు పెరుగుతాయి తప్ప, నల్లడబ్బును అరికట్టేందుకు ప్రభుత్వ నిర్ణయం ఏ మాత్రం ఉపయోగపడదని ఛోకర్‌ అన్నారు. గతంలోను రాజకీయ పార్టీలకు వచ్చిన విరాళాల్లో 70 శాతం నిధులు గుర్తుతెలియని దాతల నుంచే రాగా, 20 వేల రూపాయలకు మించి నగదు రూపంలో విరాళాలు చెల్లించకూడదని నిబంధన తీసుకొచ్చిన తర్వాత కూడా ఆ 70 శాతం నిధుల్లో పెద్ద తేడా ఏమీ కనిపించలేదని, కాకపోతే రసీదుల సంఖ్య భారీగా పెరిగాయని, ఇప్పుడు అదే సంఖ్య మరో పదింతలు పెరిగే అవకాశం ఉందని ఛోకర్‌ తెలిపారు. నగదు విరాళాలు మొత్తం సొమ్ముపై లేదా నగదు విరాళాలు ఇచ్చే దాతల సంఖ్యపై ఎలాంటి పరిమితులు లేనందున ఈ నిర్ణయం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని ప్రముఖ సామాజిక శాస్త్రవేత్త యోగేంద్ర యాదవ్‌ అభిప్రాయపడ్డారు.

దేశ ప్రజలంతా డిజిటల్‌ చెల్లింపులవైపు మళ్లాలని చెబుతున్న ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం రాజకీయ పార్టీలు నగదు రూపంలో విరాళాలు స్వీకరించేందుకు ఎందుకు అనుమతిస్తోందని ప్రముఖ న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌ ప్రశ్నించారు. అవినీతిని, నల్లడబ్బును అరికట్టేందుకు అన్ని విరాళాలను రాజకీయ పార్టీలు డిజిటల్‌ రూపంలోనే తీసుకోవాలనే నిబంధనను ఎందుకు తీసుకరావడం లేదని ఆయన అన్నారు. రాజకీయ పార్టీలకు ఇకముందు బాండుల రూపంలో విరాళాలు చెల్లించే విధంగా త్వరలో ఓ స్కీమ్‌ను తీసుకొస్తామని కూడా తన బడ్జెట్‌ ప్రసంగం సందర్భంగా ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ వెల్లడించారు. స్కీమ్‌ వివరాలు పూర్తిగా వెల్లడించకపోయినా ఈ బాండ్‌లను భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ జారీ చేస్తుందని చెప్పారు. బాండులు ఎవరు తీసుకున్నారో తెలుసుకోవచ్చు, వాటిని ఎవరు మార్చుకున్నారో తెలసుకోవచ్చు. ఈ విషయంలో ప్రభుత్వం పారదర్శకతను కోరుకుంటున్నట్లు కనిపిస్తోంది. అలాంటి బాండులను ఆర్బీఐ మాత్రమే జారీ చేస్తుందికనుక అధికారంలో ఉన్న పార్టీకే ఆ వివరాలను తెలసుకునే అవకాశం ఉంటుందని, ఇది ఎంత వరకు సమంజసమని మాజీ ప్రొఫెసర్‌ ఛోకర్‌ ప్రశ్నించారు.

రాజకీయ పార్టీల విరాళాల విషయంలో బీజేపీ ప్రభుత్వం నిజంగా పారదర్శకతను కోరుకుంటున్నట్లయితే రాజకీయ పార్టీలను ఆర్టీఐ పరిధిలోకి తీసుకురావాలంటూ గత మూడేళ్లగా సుప్రీం కోర్టులో కొనసాగుతున్న కేసు పట్ల సానుకూలంగా స్పందించాలి. ఆర్టీఐ పరిధిలోకి రాజకీయ పార్టీలను తీసుకురావడాన్ని వ్యతిరేకిస్తూ గత ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్‌ను మార్చాలి. ఆర్టీఐ పరిధిలోకి రాజకీయ పార్టీలను తీసుకురావాలని కేంద్ర సమాచార కమిషన్‌ మూడేళ్లకు ముందే నిర్ణయించిన విషయం తెల్సిందే.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement