
ముద్దుతో కేన్సర్
స్త్రీ, పురుషులు పరస్పరం పెదవులపై ముద్దు పెట్టుకోవడం వల్ల తల, మెడ కేన్సర్లు వచ్చే ప్రమాదం దాదాపు 70 శాతం ఉందని...
సిడ్నీ: స్త్రీ, పురుషులు పరస్పరం పెదవులపై ముద్దు పెట్టుకోవడం వల్ల తల, మెడ కేన్సర్లు వచ్చే ప్రమాదం దాదాపు 70 శాతం ఉందని ఆస్ట్రేలియాలోని రాయల్ డార్విన్ హాస్పటల్‌లో హెడ్ అండ్ నెక్ సర్జరీ విభాగానికి అధిపతిగా పనిచేస్తున్న ప్రముఖ డాక్టర్ మహిబాన్ థామస్ వెల్లడించారు. ఈ కేన్సర్లకు కారణమయ్యే ‘హ్యూమన్ పాపిల్లోమా వైరస్ (హెచ్‌పీవీ)’ ముద్దు ద్వారా ఒకరి నుంచి ఒకరికి సంక్రమిస్తుందని ఆయన తెలిపారు.
సాధారణ వ్యక్తులతో పోలిస్తే ఈ వైరస్ సోకిన వారికి కేన్సర్ వచ్చే ప్రమాదం 250 సార్లు ఎక్కువని ఆయన వివరించారు. పొగతాగడం, మద్యపానం సేవించిన వారికి తల, మెడ కేన్సర్‌లు ఎక్కువ వస్తాయన్నది వైద్య వర్గాల్లో ఇప్పటి వరకున్న విశ్వాసమని, కానీ ముద్దు ద్వారా సంక్రమించే పాపిల్లోమా వైరస్ వల్ల కేన్సర్ సంక్రమించే అవకాశాలే ఎక్కువని తాజా అధ్యయనాల్లో తేలినట్లు ఆయన చెప్పారు.
తల, మెడ కేన్సర్ల అంతర్జాతీయ దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం నాడిక్కడ ఏర్పాటు చేసిన ఓ సదస్సులో థామస్ తాజా వివరాలను వెల్లడించారు. స్త్రీ, పురుషులనే తేడా లేకుండా ఇద్దరిలో సమానంగా తల, మెడ కేన్సర్లు వచ్చే అవకాశం ఉందని ఆయన చెప్పారు. వంద రకాల వైరస్‌లలో మొత్తం ఎనిమిది రకాల వైరస్‌లే ఇలాంటి కేన్సర్లకు కారణమవుతున్నాయని, ముద్దు ద్వారా సంక్రమించే పాపిల్లోమా వైరస్ వల్ల కేన్సర్ ప్రమాదం మరింత ఎక్కువని అన్నారు. ముఖ్యంగా ఫ్రెంచ్ కిస్సింగ్ (గాఢ సుదీర్ఘ చుంబనం) వల్ల ఈ వైరస్ ఒకరి నుంచి ఒకరికి సోకే అవకాశం ఎక్కువగా ఉందని ఆయన వివరించారు.
ఆస్ట్రేలియాలో ఏటా దాదాపు నాలుగువేల మంది పొగ తాగడం, మద్యం సేవించడం వల్ల తల, మెడ కేన్సర్లకు గురవుతుంటే ముద్దు ద్వారా కేన్సర్ సోకుతున్న వారి సంఖ్య ఎక్కువగా ఉందని ఆయన థామస్ తెలిపారు. అందుకే ఇప్పుడు ఆస్ట్రేలియాలో 13వ ఏటనే పిల్లలకు హెచ్‌పీవీ వాక్సినేషన్ ఇవ్వడం తప్పనిసరైందని చెప్పారు. అమెరికాలో తల, మెడ కేన్సర్లు వస్తున్న వారిలో 70 శాతం మందికి హెచ్‌పీవీ వల్లనే వైరస్ వస్తున్నట్టు తేలిందని ఆయన వివరించారు.