సోషల్ మీడియాలో పుకార్లు నమ్మొద్దు
సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులే కర్ణాటకలో ఉద్విగ్న పరిస్థితులు నెలకొనడానికి కారణమంటూ వెల్లడైన క్రమంలో, సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లు, తప్పుడు ప్రచారాలను గుడ్డిగా నమ్మవద్దని బెంగళూరు పోలీసులు పేర్కొంటున్నారు. ఏమైనా సందేహాలుంటే 100కి డయల్ చేసి నిర్థారించుకోవాలని సూచిస్తున్నారు.
సిటీ పోలీసుల ట్విట్టర్ అకౌంట్ @BlrCityPolice లేదా 9480801000 వాట్సాప్ నెంబర్ ద్వారా కూడా తెలుసుకోవచ్చన్నారు. నగరంలోని 16 పోలీసు స్టేషన్ల పరిధిలో కర్ఫ్యూ కొనసాగుతోంది. కావేరి నది జలాలను తమిళనాడుతో కర్ణాటక పంచుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీచేసిన క్రమంలో ఈ హింసాత్మక వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే.
మరోవైపు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రంలో అట్టుడుకుతున్న కావేరి నది జల వివాద ప్రసారాలపై హైదరాబాద్ నగర పోలీసులు ఆదేశాలు జారీచేశారు. శాంతి భద్రతలకు వ్యతిరేకంగా హింసను ప్రేరేపించేలా బెంగళూరులో జరుగుతున్న ఈ వివాద ప్రసార ప్రోగ్రామ్ల వేటినీ కేబుల్ సర్వీసు ద్వారా ప్రసారం చేయకూడదని సూచిస్తూ అన్ని కేబుల్ టీవీ చానల్స్/ కేబుల్ టీవీ నెట్వర్క్ ఆపరేటర్లకు హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ ఓ అడ్వయిజరీ నోట్ను పంపారు.
హైదరాబాద్లో శాంతి నిర్వహణకు అందరూ కట్టుబడి ఉండాలని అన్ని టీవీ చానల్స్కు పోలీసు కమిషనర్ విజ్ఞప్తి చేశారు. కేబుల్ టీవీ నెట్వర్క్స్(రెగ్యులేషన్) యాక్ట్ 1995 కింద పనిచేసే ఆథరైజ్డ్ ఆఫీసర్కు ఈ నోటీసులు పంపారు. ఈ చట్టంలోని సెక్షన్ 16 కింద జారీచేసిన ప్రోగ్రామ్ కోడ్ ఉల్లంఘనకు పాల్పడిన నిర్వహణ సంస్థలపై చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ పోలీసు అడ్వయిజరీ పేర్కొంది. బక్రీద్, గణేష్ ఉత్సవాలు హైదరాబాద్లో జరుగుతున్న నేపథ్యంలో కావేరి జల వివాదాన్ని ప్రసారం చేసి శాంతి భద్రతలకు ఆటంకం కలిగించవద్దని పేర్కొంటూ అన్ని కేబుల్ టీవీ చానల్స్/ కేబుల్ టీవీ నెట్వర్క్ ఆపరేటర్లకు ఈ ఆదేశాలు జారీ అయ్యాయి.