Cable TV Operators
-
ఉచిత చానళ్ల సంఖ్య పెంపు
న్యూఢిల్లీ: కేబుల్ టీవీ చార్జీల భారాన్ని కాస్త తగ్గించేలా టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ తాజాగా కొత్త టారిఫ్ ఆర్డరు ప్రకటించింది. దీంతో మరిన్ని చానళ్లు.. ఇంకాస్త చౌక రేటుకు అందుబాటులోకి రానున్నాయి. ట్రాయ్ తన వెబ్సైట్లో ఉంచిన ఆర్డరు ప్రకారం.. ఉచిత చానళ్ల సంఖ్య పెరగనుండగా, పే చానళ్ల చార్జీలు తగ్గనున్నాయి. అలాగే, వివిధ చానళ్లను కలిపి బ్రాడ్‌కాస్టింగ్ సంస్థలు అందించే బొకే ఆఫర్లపైనా ట్రాయ్ పరిమితులు విధించింది. వీటికి సంబంధించి ఆగస్టు, సెప్టెంబర్‌లో ప్రవేశపెట్టిన చర్చాపత్రాలపై పరిశ్రమవర్గాల నుంచి సేకరించిన అభిప్రాయాల ఆధారంగా ఈ మార్గదర్శకాలు రూపొందించింది. సవరించిన టారిఫ్‌లను బ్రాడ్కాస్టర్లు జనవరి 15లోగా, మల్టీ సిస్టం ఆపరేటర్లు 20లోగా ప్రచురించాల్సి ఉంటుంది. వినియోగదారులకు.. కొత్త నిబంధనల ప్రయోజనాలు మార్చి 1 నుంచి లభించనున్నాయి. ట్రాయ్ కొత్త టారిఫ్ ఆర్డరు ప్రకారం.. ► బొకే కింద అందించే పే చానళ్ల గరిష్ట ధర రూ. 19 నుంచి రూ. 12కి తగ్గుతుంది. ప్రతి చానల్‌కు బ్రాడ్‌కాస్టింగ్ సంస్థ తమకు అనువైన రేటును వసూలు చేసినా, సదరు చానల్‌ను ఇతర చానళ్లతో కలిపి గంపగుత్తగా (బొకే) ఆఫర్ చేసేటప్పుడు గరిష్ట ధర రూ. 12కి (పన్నులు అదనం) మించరాదు. ► రూ. 130 నెట్వర్క్ కెపాసిటీ ఫీజు (ఎన్సీఎఫ్)తో ప్రస్తుతం 100 ఉచిత చానళ్లు లభిస్తుండగా.. ట్రాయ్ ఆదేశాల ప్రకారం ఈ సంఖ్య 200కు పెరగనుంది. కేబుల్ టీవీ ఆపరేటర్లు, డీటీహెచ్ ప్రొవైడర్లు తమ దగ్గరున్న ఉచిత చానళ్లన్నింటినీ అందించేందుకు.. గరిష్టంగా రూ. 160 మించి ఎన్సీఎఫ్ వసూలు చేయరాదు. ► బ్రాడ్‌కాస్టింగ్ సంస్థలకు దీటుగా డిస్ట్రిబ్యూషన్ ప్లాట్‌ఫాం ఆపరేటర్లు కూడా యూజర్లను ఆకర్షించేందుకు ఆఫర్లు ఇవ్వొచ్చు. ఆరు నెలలకు పైగా దీర్ఘకాలిక సబ్స్క్రిప్షన్ తీసుకునేవారికి ఎన్‌సీఎఫ్‌పైన, డిస్ట్రిబ్యూటర్ రిటైల్ ధరపైన డిస్కౌంట్లు వంటివి ఇవ్వొచ్చు. ► ఒకటికి మించి టీవీలు ఉన్న ఇళ్లకు సంబంధించిన మార్గదర్శకాలను కూడా ట్రాయ్ సమీక్షించింది. రెండో టీవీకి వసూలు చేసే ఎన్సీ ఫీజు.. మొదటి టీవీ సెట్ ఫీజులో 40 శాతాన్ని మించరాదు. ప్రతీ టీవీ కనెక్షన్‌కు వేర్వేరు చానళ్లను ఎంపిక చేసుకునేందుకు వెసులుబాటు ఉంటుంది. ► మల్టీ సిస్టమ్ ఆపరేటర్లు, డైరెక్ట్ టు హోమ్ సేవల సంస్థలకు ట్రాయ్ షాక్ ఇచ్చింది. ఆయా ఆపరేటర్లు తమ చానళ్లను ప్రసారం చేసినందుకు వారికి బ్రాడ్‌కాస్టింగ్ సంస్థలు చెల్లించే నెలవారీ క్యారేజీ ఫీజుపై (ఎంసీఎఫ్) పరిమితులు విధించింది. ఒక్కో చానల్‌కు గరిష్టంగా రూ. 4 లక్షల ఎంసీఎఫ్ను నిర్ణయించింది. ఇప్పటిదాకా దీనిపై ఎలాంటి పరిమితులు లేవు. కేబుల్ టీవీ షేర్ల పతనం.. తక్కువ ధరకే అధిక చానళ్లు వీక్షించేలా ట్రాయ్ తీసుకున్న తాజా నిర్ణయం బ్రాడ్‌కాస్టింగ్, కేబుల్ టీవీ ఆపరేటర్ల కంపెనీ షేర్లను అతలాకుతలం చేసింది. ఆరంభంలో బాగా పతనమైన ఈ షేర్లు చివరకు మిశ్రమంగా ముగిశాయి. సన్ టీవీ నెట్వర్క్స్, డెన్ నెట్వర్క్స్ షేర్లు 0.1–1.2 శాతం రేంజ్లో నష్టపోయాయి. డిష్ టీవీ ఇండియా 2.2 శాతం, జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ షేర్ 0.4 శాతం చొప్పున లాభపడ్డాయి. -
సోషల్ మీడియాలో పుకార్లు నమ్మొద్దు
సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులే కర్ణాటకలో ఉద్విగ్న పరిస్థితులు నెలకొనడానికి కారణమంటూ వెల్లడైన క్రమంలో, సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లు, తప్పుడు ప్రచారాలను గుడ్డిగా నమ్మవద్దని బెంగళూరు పోలీసులు పేర్కొంటున్నారు. ఏమైనా సందేహాలుంటే 100కి డయల్ చేసి నిర్థారించుకోవాలని సూచిస్తున్నారు. సిటీ పోలీసుల ట్విట్టర్ అకౌంట్ @BlrCityPolice లేదా 9480801000 వాట్సాప్ నెంబర్ ద్వారా కూడా తెలుసుకోవచ్చన్నారు. నగరంలోని 16 పోలీసు స్టేషన్ల పరిధిలో కర్ఫ్యూ కొనసాగుతోంది. కావేరి నది జలాలను తమిళనాడుతో కర్ణాటక పంచుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీచేసిన క్రమంలో ఈ హింసాత్మక వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. మరోవైపు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రంలో అట్టుడుకుతున్న కావేరి నది జల వివాద ప్రసారాలపై హైదరాబాద్ నగర పోలీసులు ఆదేశాలు జారీచేశారు. శాంతి భద్రతలకు వ్యతిరేకంగా హింసను ప్రేరేపించేలా బెంగళూరులో జరుగుతున్న ఈ వివాద ప్రసార ప్రోగ్రామ్‌ల వేటినీ కేబుల్ సర్వీసు ద్వారా ప్రసారం చేయకూడదని సూచిస్తూ అన్ని కేబుల్ టీవీ చానల్స్/ కేబుల్ టీవీ నెట్వర్క్ ఆపరేటర్లకు హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ ఓ అడ్వయిజరీ నోట్‌ను పంపారు. హైదరాబాద్‌లో శాంతి నిర్వహణకు అందరూ కట్టుబడి ఉండాలని అన్ని టీవీ చానల్స్‌కు పోలీసు కమిషనర్ విజ్ఞప్తి చేశారు. కేబుల్ టీవీ నెట్వర్క్స్(రెగ్యులేషన్) యాక్ట్ 1995 కింద పనిచేసే ఆథరైజ్డ్ ఆఫీసర్‌కు ఈ నోటీసులు పంపారు. ఈ చట్టంలోని సెక్షన్ 16 కింద జారీచేసిన ప్రోగ్రామ్ కోడ్ ఉల్లంఘనకు పాల్పడిన నిర్వహణ సంస్థలపై చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ పోలీసు అడ్వయిజరీ పేర్కొంది. బక్రీద్, గణేష్ ఉత్సవాలు హైదరాబాద్‌లో జరుగుతున్న నేపథ్యంలో కావేరి జల వివాదాన్ని ప్రసారం చేసి శాంతి భద్రతలకు ఆటంకం కలిగించవద్దని పేర్కొంటూ అన్ని కేబుల్ టీవీ చానల్స్/ కేబుల్ టీవీ నెట్వర్క్ ఆపరేటర్లకు ఈ ఆదేశాలు జారీ అయ్యాయి. -
19న కేబుల్ టీవీ ప్రసారాలు నిలిపివేత
హైదరాబాద్: కార్పొరేట్ టీవీ మీడియా అరాచకాలకు నిరసనగా ఈ నెల 19న కేబుల్ ప్రసారాలు నిలిపివేయనున్నట్టు తెలంగాణ ఎంఎస్ఓలు, ఆపరేటర్ల జేఏసీ ప్రకటించింది. సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ప్రసారాలు ఆపేస్తామని తెలిపింది. పాల్వంచ ఎంఎస్ఓ మల్లెల నాగేశ్వరరావు హత్య కేసులో నిందితులను అరెస్ట్ చేయాలని కోరుతూ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డిని కలుస్తామని చెప్పారు. తమ డిమాండ్లు, సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ ఎంఎస్ఓలు, ఆపరేటర్లు జేఏసీగా ఏర్పడ్డారు. జేఏసీ కన్వీనర్లుగా సుభాష్ రెడ్డి, నర్సింగరావు, పమ్మి సురేశ్ లను ఎన్నుకున్నారు. -
భారతీయ టీవీ ఛానెళ్లపై నేపాల్ నిరవధిక నిషేధం
కఠ్మాండు: నేపాల్ కేబుల్ టీవీ ఆపరేటర్లు భారతీయ టీవీ ఛానెళ్లపై నిరవధికంగా నిషేధం విధించారు. దేశంలోకి వస్తువుల దిగుమతులను బంద్ చేసినందుకు నిరసనగా భారతీయ ఛానెళ్లను బ్లాక్ చేసినట్లు తెలుస్తోంది. భారత్-నేపాల్ సరిహద్దుల్లో ట్రక్కుల ద్వారా వస్తువుల రవాణా జరుగుతోంది. నూతన రాజ్యాంగంలో పేర్కొన్న 7 ప్రాంతాల మోడల్ వివక్షకు గురిచేయడమేనంటూ మాదేశీలు తమ నిరసన తెలుపుతున్నారు. నేపాల్‌లో తాజా పరిణామాల నేపథ్యంలో భారత్‌పై వ్యతిరేకత అక్కడ తీవ్రమవుతున్నట్లు కనిపిస్తోంది. కానీ, ఇటువంటి చర్యలు ఇరుదేశాలకు మంచిదికాదని నేపాల్‌లో భారత రాయబారి రంజిత్ రే పేర్కొన్నారు. కేవలం కొన్ని ప్రాంతాలలో ఉన్న అసహనాన్ని భారత్‌కి వ్యతిరేకంగా మలుస్తున్నారని, ఈ సమస్యను పరిష్కరించాలంటే తమ వద్ద ఎటువంటి ప్రణాళికలు లేవన్నారు. రాజకీయ సమస్యల కారణంగా విద్వేషాలు పెరుగుతున్నాయని, అవి తగ్గితే పరిస్థితులు మామాలుగా ఉంటాయని తెలుస్తోంది. -
హిందుజా-హిట్స్ సర్వీసులు ప్రారంభం
నెక్ట్స్ డిజిటల్ బ్రాండ్ కింద ఆపరేటర్లకు 500 పైగా టీవీ చానల్స్ ఆవిష్కరించిన కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ న్యూఢిల్లీ : కేబుల్ టీవీ ఆపరేటర్లకు దాదాపు 500 పైచిలుకు టీవీ చానళ్లను అందుబాటులోకి తెచ్చే వినూత్నమైన హిట్స్ (హెడ్ఎండ్ ఇన్ ది స్కై) సర్వీసులను కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అరుణ్ జైట్లీ బుధవారం ఆవిష్కరించారు. కస్టమర్లకు మరిన్ని ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ టీవీ చానళ్లు దీనితో అందుబాటులోకి రాగలవని ఆయన పేర్కొన్నారు. హిందుజా గ్రూప్‌నకు చెందిన హిట్స్ నెట్వర్క్.. నెక్ట్స్ డిజిటల్ బ్రాండ్ కింద మల్టీ సిస్టమ్ ఆపరేటర్లు (ఎంఎస్‌వోలు), లోకల్ కేబుల్ ఆపరేటర్లకు (ఎల్‌సీవోలు) సర్వీసులు అందిస్తుంది. ఈ ప్రాజెక్టులో రూ. 5,000 కోట్లపైగా పెట్టుబడులు ఉం డగలవని హిందుజా వెంచర్స్ చైర్మన్ అశోక్ హిం దుజా ఈ సందర్భంగా తెలిపారు. నెక్స్ట్ డిజి టల్ ప్లాట్‌ఫామ్‌ను పూర్తి దేశీ పరిజ్ఞానంతో రూపొం దించినట్లు ఆయన వివరించారు. కేబుల్ ఆపరేటర్లు స్వతంత్రంగా సేవలు అందించేందుకు ఇది ఉపయోగపడగలదని హిందుజా పేర్కొన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, పంజాబ్‌లో ఈ సేవలు అందుబాటులో ఉంటాయని, త్వరలో మిగతా రాష్ట్రాల్లోనూ లభిస్తాయని ఆయన తెలిపారు.