న్యూఢిల్లీ: కేబుల్ టీవీ చార్జీల భారాన్ని కాస్త తగ్గించేలా టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ తాజాగా కొత్త టారిఫ్ ఆర్డరు ప్రకటించింది. దీంతో మరిన్ని చానళ్లు.. ఇంకాస్త చౌక రేటుకు అందుబాటులోకి రానున్నాయి. ట్రాయ్ తన వెబ్‌సైట్‌లో ఉంచిన ఆర్డరు ప్రకారం.. ఉచిత చానళ్ల సంఖ్య పెరగనుండగా, పే చానళ్ల చార్జీలు తగ్గనున్నాయి. అలాగే, వివిధ చానళ్లను కలిపి బ్రాడ్‌కాస్టింగ్ సంస్థలు అందించే బొకే ఆఫర్లపైనా ట్రాయ్ పరిమితులు విధించింది. వీటికి సంబంధించి ఆగస్టు, సెప్టెంబర్‌లో ప్రవేశపెట్టిన చర్చాపత్రాలపై పరిశ్రమవర్గాల నుంచి సేకరించిన అభిప్రాయాల ఆధారంగా ఈ మార్గదర్శకాలు రూపొందించింది. సవరించిన టారిఫ్‌లను బ్రాడ్‌కాస్టర్లు జనవరి 15లోగా, మల్టీ సిస్టం ఆపరేటర్లు 20లోగా ప్రచురించాల్సి ఉంటుంది. వినియోగదారులకు.. కొత్త నిబంధనల ప్రయోజనాలు మార్చి 1 నుంచి లభించనున్నాయి. ట్రాయ్ కొత్త టారిఫ్ ఆర్డరు ప్రకారం..
► బొకే కింద అందించే పే చానళ్ల గరిష్ట ధర రూ. 19 నుంచి రూ. 12కి తగ్గుతుంది. ప్రతి చానల్‌కు బ్రాడ్‌కాస్టింగ్ సంస్థ తమకు అనువైన రేటును వసూలు చేసినా, సదరు చానల్‌ను ఇతర చానళ్లతో కలిపి గంపగుత్తగా (బొకే) ఆఫర్ చేసేటప్పుడు గరిష్ట ధర రూ. 12కి (పన్నులు అదనం) మించరాదు.
► రూ. 130 నెట్‌వర్క్ కెపాసిటీ ఫీజు (ఎన్‌సీఎఫ్)తో ప్రస్తుతం 100 ఉచిత చానళ్లు లభిస్తుండగా.. ట్రాయ్ ఆదేశాల ప్రకారం ఈ సంఖ్య 200కు పెరగనుంది. కేబుల్ టీవీ ఆపరేటర్లు, డీటీహెచ్ ప్రొవైడర్లు తమ దగ్గరున్న ఉచిత చానళ్లన్నింటినీ అందించేందుకు.. గరిష్టంగా రూ. 160 మించి ఎన్‌సీఎఫ్ వసూలు చేయరాదు.
► బ్రాడ్‌కాస్టింగ్ సంస్థలకు దీటుగా డిస్ట్రిబ్యూషన్ ప్లాట్‌ఫాం ఆపరేటర్లు కూడా యూజర్లను ఆకర్షించేందుకు ఆఫర్లు ఇవ్వొచ్చు. ఆరు నెలలకు పైగా దీర్ఘకాలిక సబ్‌స్క్రిప్షన్ తీసుకునేవారికి ఎన్‌సీఎఫ్‌పైన, డిస్ట్రిబ్యూటర్ రిటైల్ ధరపైన డిస్కౌంట్లు వంటివి ఇవ్వొచ్చు.
► ఒకటికి మించి టీవీలు ఉన్న ఇళ్లకు సంబంధించిన మార్గదర్శకాలను కూడా ట్రాయ్ సమీక్షించింది. రెండో టీవీకి వసూలు చేసే ఎన్‌సీ ఫీజు.. మొదటి టీవీ సెట్ ఫీజులో 40 శాతాన్ని మించరాదు. ప్రతీ టీవీ కనెక్షన్‌కు వేర్వేరు చానళ్లను ఎంపిక చేసుకునేందుకు వెసులుబాటు ఉంటుంది.
► మల్టీ సిస్టమ్ ఆపరేటర్లు, డైరెక్ట్ టు హోమ్ సేవల సంస్థలకు ట్రాయ్ షాక్ ఇచ్చింది. ఆయా ఆపరేటర్లు తమ చానళ్లను ప్రసారం చేసినందుకు వారికి బ్రాడ్‌కాస్టింగ్ సంస్థలు చెల్లించే నెలవారీ క్యారేజీ ఫీజుపై (ఎంసీఎఫ్) పరిమితులు విధించింది. ఒక్కో చానల్‌కు గరిష్టంగా రూ. 4 లక్షల ఎంసీఎఫ్‌ను నిర్ణయించింది. ఇప్పటిదాకా దీనిపై ఎలాంటి పరిమితులు లేవు.
కేబుల్ టీవీ షేర్ల పతనం..
తక్కువ ధరకే అధిక చానళ్లు వీక్షించేలా ట్రాయ్ తీసుకున్న తాజా నిర్ణయం బ్రాడ్‌కాస్టింగ్, కేబుల్ టీవీ ఆపరేటర్ల కంపెనీ షేర్లను అతలాకుతలం చేసింది. ఆరంభంలో బాగా పతనమైన ఈ షేర్లు చివరకు మిశ్రమంగా ముగిశాయి. సన్ టీవీ నెట్‌వర్క్స్, డెన్ నెట్‌వర్క్స్ షేర్లు 0.1–1.2 శాతం రేంజ్‌లో నష్టపోయాయి. డిష్ టీవీ ఇండియా 2.2 శాతం, జీ ఎంటర్‌టైన్మెంట్ ఎంటర్‌ప్రైజెస్ షేర్ 0.4 శాతం చొప్పున లాభపడ్డాయి.
చౌకగా మరిన్ని చానళ్లు
Published Fri, Jan 3 2020 3:00 AM | Last Updated on Fri, Jan 3 2020 12:23 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment