సాక్షి, న్యూఢిల్లీ : వినియోగదారులకు రూ 130కు వంద ఛానెళ్ల స్ధానంలో 200 ఛానళ్లను వీక్షించే వెసులుబాటు కల్పిస్తూ ట్రాయ్ న్యూ టారిఫ్ ఆర్డర్ (ఎన్‌టీఓ)కు సవరణలు చేసింది. ప్రసార భారతి ఛానళ్లు కాకుండా 200 ఛానళ్లను రూ 130కే వీక్షించేలా ఈ నిర్ణయం తీసుకున్నామని ట్రాయ్ చైర్మన్ ఆర్‌ఎస్ శర్మ వెల్లడించారు. వినియోగదారులకు అత్యధిక ఛానళ్లను అందించేలా ఎన్‌టీఓలో నిబంధనలు మార్చామని ఆయన పేర్కొన్నారు. ఛానళ్ల అనైతిక పోటీ, అతిక్రమణలకు పాల్పడకుండా ఈ మార్పులు చేపట్టామని చెప్పారు.గతంలో వినియోగదారుల ఉద్దేశాలను ప్రతిబింబించకుండా, వారి ఎంపికకూ విఘాతం కలిగేలా వ్యవహరించే పద్ధతిని ఎన్‌టీఓలో మార్పుల ద్వారా నిలువరించగలిగామని ట్రాయ్ చైర్మన్ వెల్లడించారు. తాజా మార్పులతో బొకే కింద అందించే పే చానళ్ల గరిష్ట ధర రూ. 19 నుంచి రూ. 12కి తగ్గుతుంది. ప్రతి చానల్‌కు బ్రాడ్‌కాస్టింగ్ సంస్థ తమకు అనువైన రేటును వసూలు చేసినా, సదరు చానల్‌ను ఇతర చానళ్లతో కలిపి గంపగుత్తగా (బొకే) ఆఫర్ చేసేటప్పుడు గరిష్ట ధర రూ. 12కి (పన్నులు అదనం) మించరాదు.
Comments
Please login to add a commentAdd a comment