Cable TV Networks
-
ఉచిత చానళ్ల సంఖ్య పెంపు
న్యూఢిల్లీ: కేబుల్ టీవీ చార్జీల భారాన్ని కాస్త తగ్గించేలా టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ తాజాగా కొత్త టారిఫ్ ఆర్డరు ప్రకటించింది. దీంతో మరిన్ని చానళ్లు.. ఇంకాస్త చౌక రేటుకు అందుబాటులోకి రానున్నాయి. ట్రాయ్ తన వెబ్సైట్లో ఉంచిన ఆర్డరు ప్రకారం.. ఉచిత చానళ్ల సంఖ్య పెరగనుండగా, పే చానళ్ల చార్జీలు తగ్గనున్నాయి. అలాగే, వివిధ చానళ్లను కలిపి బ్రాడ్‌కాస్టింగ్ సంస్థలు అందించే బొకే ఆఫర్లపైనా ట్రాయ్ పరిమితులు విధించింది. వీటికి సంబంధించి ఆగస్టు, సెప్టెంబర్‌లో ప్రవేశపెట్టిన చర్చాపత్రాలపై పరిశ్రమవర్గాల నుంచి సేకరించిన అభిప్రాయాల ఆధారంగా ఈ మార్గదర్శకాలు రూపొందించింది. సవరించిన టారిఫ్‌లను బ్రాడ్కాస్టర్లు జనవరి 15లోగా, మల్టీ సిస్టం ఆపరేటర్లు 20లోగా ప్రచురించాల్సి ఉంటుంది. వినియోగదారులకు.. కొత్త నిబంధనల ప్రయోజనాలు మార్చి 1 నుంచి లభించనున్నాయి. ట్రాయ్ కొత్త టారిఫ్ ఆర్డరు ప్రకారం.. ► బొకే కింద అందించే పే చానళ్ల గరిష్ట ధర రూ. 19 నుంచి రూ. 12కి తగ్గుతుంది. ప్రతి చానల్‌కు బ్రాడ్‌కాస్టింగ్ సంస్థ తమకు అనువైన రేటును వసూలు చేసినా, సదరు చానల్‌ను ఇతర చానళ్లతో కలిపి గంపగుత్తగా (బొకే) ఆఫర్ చేసేటప్పుడు గరిష్ట ధర రూ. 12కి (పన్నులు అదనం) మించరాదు. ► రూ. 130 నెట్వర్క్ కెపాసిటీ ఫీజు (ఎన్సీఎఫ్)తో ప్రస్తుతం 100 ఉచిత చానళ్లు లభిస్తుండగా.. ట్రాయ్ ఆదేశాల ప్రకారం ఈ సంఖ్య 200కు పెరగనుంది. కేబుల్ టీవీ ఆపరేటర్లు, డీటీహెచ్ ప్రొవైడర్లు తమ దగ్గరున్న ఉచిత చానళ్లన్నింటినీ అందించేందుకు.. గరిష్టంగా రూ. 160 మించి ఎన్సీఎఫ్ వసూలు చేయరాదు. ► బ్రాడ్‌కాస్టింగ్ సంస్థలకు దీటుగా డిస్ట్రిబ్యూషన్ ప్లాట్‌ఫాం ఆపరేటర్లు కూడా యూజర్లను ఆకర్షించేందుకు ఆఫర్లు ఇవ్వొచ్చు. ఆరు నెలలకు పైగా దీర్ఘకాలిక సబ్స్క్రిప్షన్ తీసుకునేవారికి ఎన్‌సీఎఫ్‌పైన, డిస్ట్రిబ్యూటర్ రిటైల్ ధరపైన డిస్కౌంట్లు వంటివి ఇవ్వొచ్చు. ► ఒకటికి మించి టీవీలు ఉన్న ఇళ్లకు సంబంధించిన మార్గదర్శకాలను కూడా ట్రాయ్ సమీక్షించింది. రెండో టీవీకి వసూలు చేసే ఎన్సీ ఫీజు.. మొదటి టీవీ సెట్ ఫీజులో 40 శాతాన్ని మించరాదు. ప్రతీ టీవీ కనెక్షన్‌కు వేర్వేరు చానళ్లను ఎంపిక చేసుకునేందుకు వెసులుబాటు ఉంటుంది. ► మల్టీ సిస్టమ్ ఆపరేటర్లు, డైరెక్ట్ టు హోమ్ సేవల సంస్థలకు ట్రాయ్ షాక్ ఇచ్చింది. ఆయా ఆపరేటర్లు తమ చానళ్లను ప్రసారం చేసినందుకు వారికి బ్రాడ్‌కాస్టింగ్ సంస్థలు చెల్లించే నెలవారీ క్యారేజీ ఫీజుపై (ఎంసీఎఫ్) పరిమితులు విధించింది. ఒక్కో చానల్‌కు గరిష్టంగా రూ. 4 లక్షల ఎంసీఎఫ్ను నిర్ణయించింది. ఇప్పటిదాకా దీనిపై ఎలాంటి పరిమితులు లేవు. కేబుల్ టీవీ షేర్ల పతనం.. తక్కువ ధరకే అధిక చానళ్లు వీక్షించేలా ట్రాయ్ తీసుకున్న తాజా నిర్ణయం బ్రాడ్‌కాస్టింగ్, కేబుల్ టీవీ ఆపరేటర్ల కంపెనీ షేర్లను అతలాకుతలం చేసింది. ఆరంభంలో బాగా పతనమైన ఈ షేర్లు చివరకు మిశ్రమంగా ముగిశాయి. సన్ టీవీ నెట్వర్క్స్, డెన్ నెట్వర్క్స్ షేర్లు 0.1–1.2 శాతం రేంజ్లో నష్టపోయాయి. డిష్ టీవీ ఇండియా 2.2 శాతం, జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ షేర్ 0.4 శాతం చొప్పున లాభపడ్డాయి. -
తెలుగులో షాప్ సీజే హోం షాపింగ్ చానల్
-
తెలుగులో షాప్ సీజే హోం షాపింగ్ చానల్
24 గంటల ప్రసారాలు ఏడాదిలో మరో ఆరు భాషల్లో షాప్ సీజే నెట్వర్క్ సీఈవో కెన్నీ షిన్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: తెలుగులో తొలి హోం షాపింగ్ చానల్ ‘షాప్ సీజే’ అందుబాటులోకి వచ్చింది. పూర్తిగా తెలుగులో రూపొందిన కార్యక్రమాలను 24 గంటలు ప్రసారం చేస్తారు. హోం షాపింగ్ రంగంలో ఉన్న షాప్ సీజే దక్షిణ కొరియాకు చెందిన సీజే ఓ షాపింగ్, అమెరికా ప్రైవేట్ ఈక్విటీ దిగ్గజం ప్రావిడెన్స్ ఈక్విటీల జేవీ. సీజే ఓ షాపింగ్ 8 దేశాల్లో వ్యాపారం చేస్తోంది. భారత్‌లో షాప్ సీజే నెట్వర్క్ పేరుతో 2009లో రంగ ప్రవేశం చేసింది. హిందీలో రెండు హోం షాపింగ్ చానళ్లను నిర్వహిస్తున్నట్టు షాప్ సీజే నెట్వర్క్ సీఈవో కెన్నీ షిన్ బుధవారమిక్కడ మీడియాకు తెలిపారు. ఏడాదిలో మరో ఆరు భాషల్లో చానళ్లను ప్రారంభిస్తామన్నారు. ప్రస్తు తం అన్ని కేబుల్ టీవీ నెట్వర్క్స్, సన్ డెరైక్ట్ డీటీహెచ్‌లో షాప్ సీజే తెలుగు ప్రసారం అవుతుంది. సినీ నటి తమన్నా భాటియా చానెల్‌ను ప్రారంభించారు. 300 బ్రాండ్లతో భాగస్వామ్యం.. రీబోక్, కెనాన్, ఎలక్ట్రోలక్స్, ప్రెస్టీజ్, ఇంటెక్స్, ఐబాల్ వంటి 300 బ్రాండ్లతో షాప్ సీజే చేతులు కలిపింది. ఉత్పత్తి ప్రయోజనాలు, ఫీచర్ల గురించి టీవీలో సవివరంగా ప్రసారం చేస్తారు. రోజుకు 30 ఉత్పాదనల వరకు చూపిస్తారు. టీవీలో స్క్రీన్‌పై వచ్చే టోల్ ఫ్రీ నంబరుకు ఫోన్ చేసి కస్టమర్లు ఆర్డరు ఇస్తే చాలు. ప్రాంతాన్నిబట్టి 1-4 రోజుల్లో డెలివరీ చేస్తారు. క్యాష్ ఆన్ డెలివరీ కూడా ఉంది. షాప్సీజే.కామ్ పోర్టల్ ద్వారా కూడా ఉత్పత్తులను విక్రయిస్తోంది. అమ్మకాలను పెంచుకోవడానికి ప్రాంతీయ బ్రాండ్లకు ఇది చక్కని వేదిక అని కెన్నీ షిన్ పేర్కొన్నారు. దేశంలో తమకు 65 లక్షల మంది కస్టమర్లు ఉన్నారని చెప్పారు. ఏడాదిలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి రూ.250 కోట్ల టర్నోవర్ లక్ష్యంగా చేసుకున్నామని సీఎఫ్‌వో ఎన్.రామకృష్ణన్ తెలిపారు. కనీసం 50 శాతం డిస్కౌంట్.. ఉత్పత్తులపై 50-80% వరకు డిస్కౌంట్ ఇస్తున్నామని కంపెనీ సీవోవో ధ్రువ చంద్రియె పేర్కొన్నారు. తయారీ కంపెనీ నుంచి నేరుగా భారీగా ఉత్పత్తులను కొనుగోలు చేయడం వల్లే ఇది సాధ్యమని చెప్పారు. ‘ఉత్పత్తులపై అదనపు వారంటీ ఇస్తున్నాం. కస్టమర్లలో 78% మంది పాతవారే. ఉత్పాదన పాడైతే కంపెనీ సిబ్బంది ఇంటికి వచ్చి తీసుకువెళ్తారు. దానికి బదులు కొత్తది ఇస్తారు’ అని వివరించారు. భారత్‌లో 2014-15లో కంపెనీ రూ.850 కోట్ల టర్నోవర్ సాధించింది.ఈ ఏడాది రూ.1,200 కోట్లు ఆశిస్తోంది. భారత్‌లో ఇప్పటి వరకు రూ.1,000 కోట్లు వెచ్చించామని ప్రావిడెన్స్ ఈక్విటీ డెరైక్టర్ గోపి కృష్ణ వడ్డి వెల్లడించారు. మరింత పెట్టుబడికి సిద్ధమన్నారు.