తెలుగులో షాప్ సీజే హోం షాపింగ్ చానల్ | Home shopping channel in the shop cj | Sakshi
Sakshi News home page

తెలుగులో షాప్ సీజే హోం షాపింగ్ చానల్

Published Thu, Oct 15 2015 12:37 AM | Last Updated on Sun, Sep 3 2017 10:57 AM

తెలుగులో షాప్ సీజే హోం షాపింగ్ చానల్

తెలుగులో షాప్ సీజే హోం షాపింగ్ చానల్

24 గంటల ప్రసారాలు
ఏడాదిలో మరో ఆరు భాషల్లో షాప్ సీజే నెట్‌వర్క్ సీఈవో కెన్నీ షిన్

 
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: తెలుగులో తొలి హోం షాపింగ్ చానల్ ‘షాప్ సీజే’ అందుబాటులోకి వచ్చింది. పూర్తిగా తెలుగులో రూపొందిన కార్యక్రమాలను 24 గంటలు ప్రసారం చేస్తారు. హోం షాపింగ్ రంగంలో ఉన్న షాప్ సీజే దక్షిణ కొరియాకు చెందిన సీజే ఓ షాపింగ్, అమెరికా ప్రైవేట్ ఈక్విటీ దిగ్గజం ప్రావిడెన్స్ ఈక్విటీల జేవీ. సీజే ఓ షాపింగ్ 8 దేశాల్లో వ్యాపారం చేస్తోంది. భారత్‌లో షాప్ సీజే నెట్‌వర్క్ పేరుతో 2009లో రంగ ప్రవేశం చేసింది. హిందీలో రెండు హోం షాపింగ్ చానళ్లను నిర్వహిస్తున్నట్టు షాప్ సీజే నెట్‌వర్క్ సీఈవో కెన్నీ షిన్ బుధవారమిక్కడ మీడియాకు తెలిపారు. ఏడాదిలో మరో ఆరు భాషల్లో చానళ్లను ప్రారంభిస్తామన్నారు. ప్రస్తు తం అన్ని కేబుల్ టీవీ నెట్‌వర్క్స్, సన్ డెరైక్ట్ డీటీహెచ్‌లో షాప్ సీజే తెలుగు ప్రసారం అవుతుంది. సినీ నటి తమన్నా భాటియా చానెల్‌ను ప్రారంభించారు.
 
300 బ్రాండ్లతో భాగస్వామ్యం..
 రీబోక్, కెనాన్, ఎలక్ట్రోలక్స్, ప్రెస్టీజ్, ఇంటెక్స్, ఐబాల్ వంటి 300 బ్రాండ్లతో షాప్ సీజే చేతులు కలిపింది. ఉత్పత్తి ప్రయోజనాలు, ఫీచర్ల గురించి టీవీలో సవివరంగా ప్రసారం చేస్తారు. రోజుకు 30 ఉత్పాదనల వరకు చూపిస్తారు. టీవీలో స్క్రీన్‌పై వచ్చే టోల్ ఫ్రీ నంబరుకు ఫోన్ చేసి కస్టమర్లు ఆర్డరు ఇస్తే చాలు. ప్రాంతాన్నిబట్టి 1-4 రోజుల్లో డెలివరీ చేస్తారు. క్యాష్ ఆన్ డెలివరీ కూడా ఉంది. షాప్‌సీజే.కామ్ పోర్టల్ ద్వారా కూడా ఉత్పత్తులను విక్రయిస్తోంది. అమ్మకాలను పెంచుకోవడానికి ప్రాంతీయ బ్రాండ్లకు ఇది చక్కని వేదిక అని కెన్నీ షిన్ పేర్కొన్నారు. దేశంలో తమకు 65 లక్షల మంది కస్టమర్లు ఉన్నారని చెప్పారు. ఏడాదిలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి రూ.250 కోట్ల టర్నోవర్ లక్ష్యంగా చేసుకున్నామని సీఎఫ్‌వో ఎన్.రామకృష్ణన్ తెలిపారు.

 కనీసం 50 శాతం డిస్కౌంట్..
 ఉత్పత్తులపై 50-80% వరకు డిస్కౌంట్ ఇస్తున్నామని కంపెనీ సీవోవో ధ్రువ చంద్రియె పేర్కొన్నారు. తయారీ కంపెనీ నుంచి నేరుగా భారీగా ఉత్పత్తులను కొనుగోలు చేయడం వల్లే ఇది సాధ్యమని చెప్పారు. ‘ఉత్పత్తులపై అదనపు వారంటీ ఇస్తున్నాం. కస్టమర్లలో 78% మంది పాతవారే. ఉత్పాదన పాడైతే కంపెనీ సిబ్బంది ఇంటికి వచ్చి తీసుకువెళ్తారు. దానికి బదులు కొత్తది ఇస్తారు’ అని వివరించారు. భారత్‌లో 2014-15లో కంపెనీ రూ.850 కోట్ల టర్నోవర్ సాధించింది.ఈ ఏడాది రూ.1,200 కోట్లు ఆశిస్తోంది. భారత్‌లో ఇప్పటి వరకు రూ.1,000 కోట్లు వెచ్చించామని ప్రావిడెన్స్ ఈక్విటీ డెరైక్టర్ గోపి కృష్ణ వడ్డి వెల్లడించారు. మరింత పెట్టుబడికి సిద్ధమన్నారు.
 
 

Advertisement
Advertisement