బ్యాంకులో సీబీఐ రైడ్స్.. భారీగా నగదు లభ్యం
బ్యాంకులో సీబీఐ రైడ్స్.. భారీగా నగదు లభ్యం
Published Thu, Dec 22 2016 11:35 AM | Last Updated on Mon, Sep 4 2017 11:22 PM
మల్లాపురం: పాత నోట్ల రద్దయిన దగ్గర్నుంచి దేశవ్యాప్తంగా జరుగుతున్న సీబీఐ, ఐటీ, ఈడీ రైడ్స్లో కోట్లకు కోట్ల బ్లాక్మనీ, కొత్త కరెన్సీ నోట్లు వెలుగులోకి వస్తున్న సంగతి తెలిసిందే. ఇవి కేవలం వ్యక్తుల వద్ద, ఎయిర్పోర్టులోనే కాదు, బ్యాంకులోనూ భారీగానే నగదు పట్టుబడుతోంది. బ్యాంకులో నగదు పట్టుబడటం ఏమిటా అనుకుంటున్నారా? ఆర్బీఐ నిబంధనలు ఉల్లంఘించి ఎలాంటి ఆధారాలు లేకుండా అక్రమంగా డిపాజిట్ చేసుకున్న మొత్తమే ఈ నగదు. కనీస ఆధారాలు లేకుండా నగదు డిపాజిట్ చేసుకుంటున్నారని గుర్తించిన సీబీఐ, మల్లాపురం కోపరేటివ్ బ్యాంకుల్లో దాడులు జరిపింది. ఈ దాడుల్లో కనీసం రూ.266 కోట్ల నగదు పట్టుబడింది. వీటికి సరిపడ ఎలాంటి డాక్యుమెంట్లు లేకపోవడం గమనార్హం. నవంబర్ 10 నుంచి 14 వరకు భారీ మొత్తంలో ఈ నగదు బ్యాంకుకు చేరినట్టు రైడ్స్లో అధికారులు గుర్తించారు.
ఎలాంటి డాక్యుమెంట్లు లేకుండానే ఈ నగదును బ్యాంకు వారు డిపాజిట్ చేసుకున్నారని సంబంధిత వర్గాలు చెప్పాయి. అయితే ఇవి బ్లాక్మనీనా కాదా అనేది తేలాల్సి ఉంది. ఈ అకౌంట్ హోల్డర్స్ వివరాలను వెంటనే తమకు అందించాలని బ్యాంకు అధికారులను సీబీఐ ఆదేశించింది. అదేవిధంగా పాత నోట్లు రద్దయిన తర్వాత ఆర్బీఐ విధించిన నిబంధనలను ఈ బ్యాంకు ఉల్లంఘించినట్టు కూడా అధికారులు గుర్తించారు. కస్టమర్ల డబ్బులను డిపాజిట్ చేసుకోవడానికి వారు ఎలాంటి నిబంధనలు పాటించలేదని అధికారులు పేర్కొన్నారు. మరోవైపు సహకార బ్యాంకుల్లో ఉన్న లొసుగులను ఆశ్రయంగా తీసుకుని కొంతమంది రాజకీయవేత్తలు, బడాబాబులు భారీ మొత్తంలో నగదును డిపాజిట్ చేస్తున్నారని అంతకమున్నుపే పలు వార్తలొచ్చిన సంగతి తెలిసిందే.
Advertisement
Advertisement