మాల్యా ఇంటిపై సీబీఐ దాడులు
ఐడీబీఐ రుణ మంజూరీ కేసులో..
న్యూఢిల్లీ/బెంగళూరు/పణజి: నిబంధనలకు విరుద్ధంగా ఐడీబీఐ బ్యాంకు నుంచి దాదాపు రూ. 900 కోట్ల రుణాలు పొందిన వ్యవహారంలో కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్, దాని ప్రమోటర్ విజయ్ మాల్యా నివాసాలు, కార్యాలయాలపై సీబీఐ శనివారం దాడులు నిర్వహించింది. బెంగళూరు, ముంబై, పణజిలోని ఐదు ప్రాంతాల్లో దాడులు నిర్వహించింది. మాల్యాను కొన్ని బ్యాంకులు ఉద్దేశపూర్వక ఎగవేతదారుగా ప్రకటించడంతో పాటు కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో ఉందని తెలిసినప్పటికీ.. ఐడీబీఐ బ్యాంకు నిబంధనలు ఉల్లంఘించి కంపెనీకి రూ. 900 కోట్ల రుణం ఇవ్వడంపై సీబీఐ గతంలో కేసు నమోదు చేసింది.
మాల్యా, కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ చీఫ్ ఫైనాన్స్ ఆఫీసర్ రఘునాథన్‌తో పాటు ఐడీబీఐకి చెందిన కొందరు అధికారులపై ఈ కేసు నమోదైంది. కంపెనీకి నెగటివ్ రేటిం గ్ ఉన్నప్పటికీ, తొలిసారిగా అడగ్గానే అంత భారీ రుణాన్ని బ్యాంకు మంజూరు చేయడం వెనుక స్కామ్ ఉండొచ్చన్న సందేహాలు రేకెత్తించిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. దీనిపై 2014లోనే ప్రాథమిక విచారణ చేపట్టిన సీబీఐ.. కంపెనీకి మిగతా బ్యాంకులు ఇచ్చిన రుణాలు మొండి బకాయిలుగా మారిన తరుణంలో కన్సార్షియం పరిధిని దాటి ఐడీబీఐ బ్యాంకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని రుణం ఇవ్వాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించింది. 2012 నుంచి కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ కార్యకలాపాలు పూర్తిగా నిల్చిపోయాయి. కంపెనీకి పలు దేశీ బ్యాంకులు రూ. 7,000 కోట్ల పైగా రుణాలు ఇచ్చాయి.