మధ్యప్రదేశ్లో శాసనసభకు జరిగిన ఎన్నికల్లో ఓట్ల లెక్కింపులో బీజేపీ తన హవా కొనసాగుతుంది.
మధ్యప్రదేశ్లో శాసనసభకు జరిగిన ఎన్నికల్లో ఓట్ల లెక్కింపులో బీజేపీ తన హవా కొనసాగుతుంది. దాంతో ఆ పార్టీ కార్యకర్తలు ఆనంద డోలికల్లో మునిగితేలుతున్నారు.ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రి పీఠాన్ని తమ పార్టీ కైవసం చేసుకోనుందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా పండగ వాతావరణం నెలకొంది.
రాష్ట్రంలోని అన్ని బీజేపీ కార్యాలయాల వద్ద పండగ వాతావరణం నెలకొంది. తమ పార్టీ ఆధిక్యంతో బీజేపీ కార్యకర్తలు ప్రత్యేకంగా వేడుకలు నిర్వహిస్తున్నారు. ఆ పార్టీ కార్యకర్తలు రోడ్లపైకి వచ్చి కేరింతలు కొట్టారు.బాణాసంచా కాలుస్తున్నారు. ప్రతి ఒక్కరికి మిఠాయి పంచి పెడుతున్నారు. బీజేపీ హ్యాట్రిక్ సాధించడం పట్ల చాలా సంతోషంగా ఉందని ఆ పార్టీ నాయకుడు నరేంద్ర సింగ్ తోమర్ పేర్కొన్నారు. ఇప్పటికే మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పోటీ చేసిన రెండు స్థానాల్లో భారీ ఆధిక్యంలో కొనసాగుతున్న విషయం తెలిసిందే.
మధ్యప్రదేశ్లో భారతీయ జనతాపార్టీ తన ఆధిక్యాన్ని కొనసాగిస్తుంది. రాష్ట్రంలోని మొత్తం 230 శాసన సభ స్థానాల్లో 145 మంది బీజేపీ అభ్యర్థులు విజయపథంలో దూసుకుపోతున్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు 72 స్థానాల్లో ముందంజలో ఉన్నారు. కాగా ఇతరులు 11 మంది అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు.