న్యూఢిల్లీ: త్వరలో రానున్న పండుగల సీజన్‌లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త రానుంది. కేంద్ర ప్రభుత్వం ఈనెలలో వారికి 10 శాతం కరువు భత్యం (డీఏ) పెంచవచ్చని అధికార వర్గాలు వెల్లడించాయి. దీంతో ప్రస్తుతం 80 శాతం ఉన్న డీఏ 90 శాతానికి పెరగనుంది. ఈ పెంపుతో 50 లక్షల మంది కేంద్ర ఉద్యోగులకు, 30 లక్షల మంది పింఛన్‌దారులకు లబ్ధిచేకూరనుంది. మొత్తమ్మీద 80 లక్షల మందికి ప్రయోజనం కలగనుంది. డీఏ పెంపును ఈ ఏడాది జూలై 1 నుంచి అమలుపరుస్తారని ఆ వర్గాలు చెప్పాయి.
సవరించిన వినియోగదారుల ధరల సూచీ (జూన్ నెల) ఆధారంగా డీఏ పెంపును నిర్ణయిస్తారని తెలిపాయి. జూన్ నెల రిటైల్ ద్రవ్యోల్బణం 11.63 శాతంగా ఉందని, దీనిని ఆగస్టు 30న విడుదల చేశారని పేర్కొన్నాయి. జూన్ అంచనాలు అందుబాటులో ఉన్నందున కేంద్ర ఆర్థిక శాఖ ఈ నెలలోనే డీఏ పెంపు ప్రతిపాదనలను రూపొందించి, వాటిని కేబినెట్ ఆమోదానికి పంపుతుందని ఆ వర్గాలు చెప్పాయి. ఇదిలా ఉండగా, డీఏ రెండంకెలు పెరగనుండటం మూడేళ్ల తర్వాత ఇదే తొలిసారి కావడం గమనార్హం. 2010 సెప్టెంబర్‌లో ప్రభుత్వం 10 శాతం పెంచగా, 2013 ఏప్రిల్‌లో 8 శాతం పెంచారు. జూలై 2012 నుంచి జూన్ 2013 వరకున్న రిటైల్ ద్రవ్యోల్బణం సూచీ ఆధారంగా డీఏ పెంపుపై తుది నిర్ణయం తీసుకుంటారు.
కేంద్ర ఉద్యోగులకు త్వరలో 10శాతం డీఏ పెంపు!
Published Mon, Sep 2 2013 3:02 AM | Last Updated on Mon, Aug 20 2018 9:16 PM
Advertisement