
‘మత హింస’ బిల్లులో మార్పులకు ఓకే
విపక్షాల వ్యతిరేకత నేపథ్యంలో కేంద్రం నిర్ణయం
ప్రస్తుత సమావేశాల్లోనే బిల్లు
న్యూఢిల్లీ: వివాదాస్పద మత హింస నిరోధక ముసాయిదా బిల్లు-2013ను ప్రతిపక్ష బీజేపీ సహా ఇతర విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో కేంద్రం వెనక్కు తగ్గింది. ఈ బిల్లు అన్ని వర్గాల ప్రజలకు తటస్థంగా ఉండేలా ఇందులోని పలు నిబంధనలను తొలగించాలని నిర్ణయించింది. అలాగే అల్లర్లను ఎదుర్కోవడంలో కేంద్రం పాత్రను తగ్గించింది. ఈ బిల్లును విధ్వంసకర వంటకంగా అభివర్ణిస్తూ బీజేపీ ప్రధాని అభ్యర్థి, గుజరాత్ సీఎం నరేంద్ర మోడీ గురువారం ప్రధాని మన్మో హన్‌కు లేఖ రాయడం, ఆ వెంటనే ప్రధాని స్పందిస్తూ ఈ బిల్లు సహా శాసన ప్రాధాన్యత అధికంగా ఉన్న అంశాలన్నింటిపై విస్తృత స్థాయి ఏకాభిప్రాయం కోసం కృషి చేస్తామంటూ ప్రకటించిన నేపథ్యంలో బిల్లులో ఈ మార్పులు చోటుచేసుకోవడం గమనార్హం. కాగా, ఈ బిల్లును ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లో ప్రవేశపెడతామని కేంద్ర హోంమంత్రి షిండే తెలిపారు.
బిల్లులో మార్పులు ఇవీ
1. ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం ఈ బిల్లును అన్ని వర్గాలు లేదా మతాలకు తటస్థంగా ఉండేలా మార్చారు. (బిల్లులోని పాత ముసాయిదాలో మాత్రం దేశంలో ఎక్కడ అల్లర్లు జరిగినా అందుకు మెజారిటీ ప్రజలను బాధ్యుల్ని చేసేలా నిబంధన ఉండేది.)
2. మత హింస నియంత్రణకు కేంద్రం సాయం అవసరమని ఏదైనా రాష్ట్రం భావిస్తే అందుకనుగుణంగా కేంద్ర బలగాలను మోహరించాలని కోరవచ్చు. (పాత ముసాయిదాలో కేంద్రానికి ఏకపక్ష అధికారాలు అప్పగించారు. ఏ రాష్ట్రం లోనైనా మత హింస జరిగితే ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించకుండానే కేంద్ర పారామిలిటరీ బలగాలు పంపే అధికారాన్ని కట్టబెట్టారు.)