తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపుపై కేంద్రం ప్రకటన
170 (3) అధికరణ ప్రకారం 2026 తర్వాత జనాభా లెక్కల వివరాల తర్వాతే సీట్ల పెంపు సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. 170 (3) అధికరణ సవరణతోనే అసెంబ్లీ స్థానాల పెంపు సాధ్యమవుతుందని అటార్నీ జనరల్ కూడా న్యాయ శాఖకు ఇదే సలహా ఇచ్చారని పేర్కొన్నారు. కాగా, అసెంబ్లీ సీట్ల పెంపు విషయంపై కేంద్ర హోంశాఖలో కేబినెట్ నోట్ తయారవుతోందని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు. అసెంబ్లీ సీట్ల పెంపు ఉండబోదని వస్తున్న వార్తలపై వెంటనే కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో మాట్లాడి ఈ మేరకు ఓ ప్రకటనలో స్పష్టతనిచ్చారు.
పాత జిల్లాల ప్రకారమే పునర్విభజన చేపట్టండి: ఈసీని కోరిన టీటీడీపీ నేతలు
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం–2014 ప్రకారం తెలంగాణలో నియోజకవర్గాల పునర్విభజనను పాత జిల్లాల ప్రాతిపదికన చేపట్టాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని తెలంగాణ టీడీపీ నేతలు కోరారు. కొత్త జిల్లాల ప్రకారం పునర్విభజన చేస్తే దళితులు, గిరిజనులకు అన్యాయం జరుగుతుందన్నారు. ఈ మేరకు టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ, కార్యనిర్వాహక అ«ధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, ఎంపీ గరికపాటి మోహన్‌రావు, ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య మంగళవారం ఢిల్లీలో ఎన్నికల కమిషనర్ ఓంప్రకాశ్ రావత్‌తో భేటీ అయి వినతిపత్రాన్ని సమర్పించారు. తెలంగాణలో అధికార పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తోందని, పార్టీలని టీఆర్‌ఎస్‌లో విలీనం చేస్తూ స్పీకర్ బులెటిన్ విడుదల చేయడం అశాస్త్రీయమని వివరించారు. రాష్ట్రంలో జిల్లాల విభజనను రాష్ట్ర ప్రభుత్వం ఇష్టానుసారంగా చేసిందన్నారు.
ఆ ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించండి...
పార్టీ ఫిరాయించిన 12 మంది టీడీపీ ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని కోరినట్టు రమణ మీడియాకు తెలిపారు. రాష్ట్రంలో టీడీపీ, వైఎస్సార్‌సీపీ, బీఎస్పీ, సీపీఎం పార్టీలను టీఆర్‌ఎస్‌లో విలీనం చేస్తున్నట్టు స్పీకర్ బులెటిన్ విడుదల చేయడం అశాస్త్రీయమని, ఈ విషయంలో పూర్తి అధికారం ఎన్నికల కమిషన్ పరిధిలో ఉంటుందని రేవంత్‌రెడ్డి తెలిపారు. దీనిపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషనర్‌ను కోరినట్టు చెప్పారు.