చోరీ చేస్తూ.. దొంగ దొంగ అని అరుస్తాడు
మలేషియా టౌన్‌షిప్ (హైదరాబాద్) : ఒంటరిగా నడిచి వెళ్లే మహిళలే టార్గెట్ చేస్తూ వారి వెనుక నడిచి వెళ్తూనే మెడల్లోని గొలుసులు లాగేసుకుని.. ఆపై దొంగ దొంగ...అని పరుగు తీస్తూ తప్పించుకునే తెలివైన స్నాచర్‌ను కేపీహెచ్‌బీ పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. మొత్తం ఏడు చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడిన అతగాడి నుంచి పది తులాల బంగారు నగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
కూకట్‌పల్లి ఏసీపీ సంజీవరావు వెల్లడించిన వివరాలివీ.. పశ్చిమగోదావరి జిల్లా గణపవరం మండలం కాశిపాడుకు చెందిన బొక్క చింతారావు అలియాస్ శ్రీను (30) గతంలో కేపీహెచ్‌బీకి చెందిన ఓ పారిశ్రామిక వేత్త వద్ద ఎనిమిదేళ్ల పాటు కారు డ్రైవర్‌గా పనిచేశాడు. కానీ వేతనం సరిపోవడం లేదని ఆ ఉద్యోగం మానేసి సొంతూరు కాశిపాడు వెళ్లి పోయాడు. కొన్ని రోజులు అక్కడే ఉంటున్నాడు.
అయితే చైన్ స్నాచింగ్‌లతో తక్కువ కాలంలో ఎక్కువ సంపాదించ వచ్చని దురాశ కలిగింది. దీంతో మళ్లీ హైదరాబాద్ చేరుకుని..ఇక్కడి లాడ్జిల్లో ఉంటూ చైన్‌స్నాచింగ్‌లు పాల్పడుతున్నాడు. పని అయిన వెంటనే తిరిగి స్వగ్రామానికి వెళ్లి, కొన్ని రోజుల తర్వాత తిరిగి వస్తాడు. ఒంటరిగా నడిచి వెళ్లే మహిళలనే ఇతడు లక్ష్యంగా చేసుకుంటాడు. వారిని వెంబడించి, అదను చూసుకుని వారి మెడలోని నగలను లాగేసుకుంటాడు.
ఆపై దొంగ..దొంగ అని అరుస్తూ అటుగా వెళ్లే వారి దృష్టి మరల్చి మెల్లగా జారుకుంటాడు. ఈ స్టైల్‌లోనే కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలో నాలుగు... సనత్‌నగర్‌లో ఒకటి... మియాపూర్‌లో ఒకటి... దుండిగల్లో ఒకటి మొత్తం ఏడు స్నాచింగ్‌లకు పాల్పడ్డాడు. ఈ చైన్ స్నాచింగ్లపై ఫిర్యాదులు అందుకున్న పోలీసులు అతని కదలికలపై కన్నేసి ఉంచారు.
శుక్రవారం కేపీహెచ్‌బీకాలనీ రైతుబజార్ సమీపంలో అనుమానాస్పదంగా మహిళల వైపు చూస్తున్న అతడిని పోలీసులు అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారించారు. అనంతరం అతడు చేసిన చైన్ స్నాచింగ్లను పోలీసులకు పుస గుచ్చినట్లు వివరించాడు. అతని వద్ద రూ.2.5 లక్షలు విలువ చేసే బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అతడిని పోలీసులు రిమాండ్‌కు తరలించారు.