'ఆ ఆరుగురు అందరితో మాట్లాడతారు'
విజయవాడ: బీసీలకు అన్యాయం జరగకుండా సమస్యను పరిష్కరిస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. బుధవారం ఆయన విజయవాడ క్యాంప్ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. కాపుల సమస్యను పరిష్కరించేందుకు ఆరుగురు మంత్రులతో సబ్ కమిటీ వేసినట్లు చంద్రబాబు పేర్కొన్నారు. అలాగే వచ్చే బడ్జెట్లో కాపు కార్పొరేషన్కు వెయ్యి కోట్లు కేటాయిస్తున్నట్లు ఆయన తెలిపారు.
చంద్రబాబు ఇంకా ఏం మాట్లాడారంటే 'నిన్న కాపు నేతలందరితో మాట్లాడా. మేం తొందరపడటం లేదని వారందరు అన్నారు. మీరు కమిషన్ వేసి తొందరగా న్యాయం చేయండి అన్నారు. డబ్బులు కేటాయిస్తామన్నారు... అవి పూర్తిగా చేయండి అన్నారు. నిన్న వాళ్లతో ఏమైతే చెప్పానో అదే విధంగా వెయ్యికోట్లు కేటాయిస్తున్నాం. సమస్యల పరిష్కారానికి ఆరుగురు మంత్రులతో కమిటీ వేశాం. ఆ ఆరుగురు అందరితో మాట్లాడతారు. బీసీలకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకుంటాం. కొంతమంది బీసీ నాయకులు స్టేట్మెంట్లు ఇస్తున్నారు. బీసీ నాయకులు స్టేట్మెంట్లు ఇవ్వడం మంచి పద్ధతి కాదు. రూ.6,600 కోట్లు పెట్టి బీసీలకు సబ్ ప్లాన్ తీసుకొచ్చామని' చెప్పారు.
కేబినేట్ నిర్ణయాలు
► త్వరలో నూతన గృహ నిర్మాణ విధానం
► కేంద్రం లక్షా 93 వేల ఇళ్లు, రాష్ట్రం రెండు లక్షల ఇళ్లు నిర్మిస్తుంది
► 10 వేల ఎకరాల్లో ఈ టౌన్ షిప్ ల నిర్మాణం
► శాంతిభద్రతల కోసం డ్రోన్ వంటి ఎలక్ట్రానిక్ డివైస్ లను వినియోగిస్తాం
► పది లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి
► జూన్ నాటికి అన్ని జిల్లాల్లో ఫైబర్ గ్రిడ్ పనులు
► గ్రామగ్రామానికి ఇంటర్ నెట్ సౌకర్యం కల్పిస్తాం
► వ్యవసాయరంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తాం
► రెగ్యూలర్ వ్యవసాయమే కాకుండా ఆర్గానిక్, ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తాం
► ఈ ఏడాది 5 వేల కిలో మీటర్ల మేర సిమెంట్ రోడ్ల నిర్మాణం
► ఈ ఏడాది 7 నుంచి 8 లక్షల మరుగుదొడ్లు నిర్మిస్తాం.