
తక్షణ చర్యలు తీసుకోండి: సీఎం చంద్రబాబు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కురుస్తున్న అకాల వర్షాల కారణంగా ప్రాణ,ఆస్తుల హాని నివారణకు తక్షణ చర్యలు తీసుకోవాల్సిందిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. సోమవారం చైనా పర్యటనలో ఉన్న చంద్రబాబు ఫోన్‌లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు, వ్యవసాయ శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావులను అకాల వర్షాలపై అడిగి తెలుసుకుని జిల్లా అధికారులను అప్రమత్తం చేయాలని ఆదేశించారు.
దీంతో మంత్రి పత్తిపాటి, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావులు జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ వర్షాలకు రాష్ట్రంలో ఆరుగురు మృతి చెందడంతో పాటు, ఒక లక్ష ఎకరాల్లో పంట నష్టం జరిగిన ట్లు అంచనా వేశారు. మరణించిన వారి కుటుంబాలకు తక్షణం ఎక్స్‌గ్రేషియాను అందజేయాలని ప్రధాన కార్యదర్శి ఆయా జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు.