ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు చాలా ఆత్రంగా ఉన్నారు. ఎలాగైనా ఆయా వర్గాల ప్రజలలో ప్రభుత్వంపై వ్యతిరేకత పెంచడానికి నానా పాట్లు పడుతున్నారు. అందులోను రైతులలో ప్రభుత్వంపై అపనమ్మకం కలిగించాలన్నది ఆయన ఉద్దేశం. ఇందుకోసం ఉభయ గోదావరి ఉమ్మడి జిల్లాలను ఎందుకు ఎంచుకున్నారో ఊహించడం కష్టం కాదు. భవిష్యత్తులో టీడీపీతో జనసేన కలిస్తే రెండు పార్టీల క్యాడర్ మద్య ఇబ్బందికర వాతావరణం లేకుండా చూసే లక్ష్యంతో కూడా ఆయన అక్కడే వారం రోజుల మకాం పెట్టినట్లు అనిపిస్తుంది.
దుష్ప్రచారం చేయడానికే బాబు టూర్
ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలలోనే కాదు. రాష్ట్రంలోని ఇతర జిల్లాలలో కూడా వర్షాల వల్ల రైతులకు కొంత నష్టం జరిగింది. కానీ ఆయన మాత్రం అక్కడే కూర్చుని రైతులను రెచ్చగొట్టడానికి విపరీత యత్నం చేశారు. ఆ క్రమంలో నోటికి వచ్చినట్లు మాట్లాడారు. రైతులంతా తమ ధాన్యాన్ని తాడేపల్లికి తరలించాలట. పోరుబాట పట్టాలట. తానే ముందుంటారట. ఇలా ఎన్నిసార్లు ప్రజలను మభ్యపెట్టలేదు. నిజంగానే రైతులకు ఏదైనా కష్టం వస్తే ప్రతిపక్ష నేతగా వెళ్లి వారిని పరామర్శించడం తప్పు కాదు. అక్కడ ప్రభుత్వానికి ఏవైనా సూచనలు చేస్తే చేయవచ్చు. కానీ అచ్చంగా దుష్ప్రచారం చేయడానికే ఆయన టూర్ చేస్తున్నారు.
రైతులకు అండగా సీఎం జగన్
అకాల వర్షాలవల్ల అక్కడక్కడా రైతులు ఇబ్బందికి గురి అయ్యారు. వారిని ఆదుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రతి జిల్లాకు ఒక సీనియర్ అదికారిని నియమించారు. తడిసిన ధాన్యాన్ని పూర్తిగా కొనుగోలు చేయాలని ఆయన స్పష్టం చేశారు. అధికారులు కూడా దీనిపై మీడియా సమావేశం పెట్టి , తుపాను హెచ్చరికలు ఉన్నందున, వర్షాలు మరిన్ని కురిసే అవకాశం ఉన్నందున, తదుపరి తాము ఎన్యుమరేషన్ ప్రారంభించి రైతులకు తగు సాయం చేస్తామని చెప్పారు. ఖరీఫ్‌తో పోల్చితే రబీలో సాగు తక్కువగా ఉంటుంది. అందులోను మే నెల వచ్చేసరికి చాలా వరకు వ్యవసాయ ఆపరేషన్‌లు పూర్తి అయిపోతుంటాయి.
ప్రజలను మభ్య పెట్టాలనే ప్రయత్నం
అయినా నీటి సదుపాయం ఉన్నచోట ఏదో ఒక పంట వేస్తుంటారు. ఇలాంటి అకాల వర్షాలు పడినప్పుడు రైతులకు నష్టం జరుగుతుంటుంది. వారికి సాయం చేయాలని అడగడం వరకు తప్పు లేదు. ఎప్పుడు ఏ కారణం దొరుకుతుందా.. ప్రభుత్వాన్ని ఆడిపోసుకుందాం అన్న తాపత్రయంలో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ అవకాశం వచ్చిందే తడవుగా హడావుడి చేసి ప్రజలను మభ్య పెట్టాలని ప్రయత్నిస్తోంది. ప్రధాన రహదారుల వెంట వెళుతున్నప్పుడు ఆయా చోట్ల రైతులు పంటలు ఆరబోసి కనిపిస్తారు. కొందరు టార్పాలిన్‌లు కప్పి పంటలను కాపాడుకుంటున్నారు.
అది చంద్రబాబుకు ఇష్టం లేదు.
ధాన్యంతో పాటు మొక్కజొన్న పంట కొన్ని చోట్ల వర్షాల వల్ల తడిసింది. వాటిని ఎండబెడుతూ రైతులు కనిపించారు. తెలంగాణతో పోల్చితే ఏపీలో పంట నష్టం తక్కువే అని చెప్పాలి. తెలంగాణలో అనేక చోట్ల వరి ధాన్యం కొట్టుకుపోయిన దృశ్యాలు టీవీలలో కనిపించాయి. ఇక్కడ మిల్లర్లు వాటిని తీసుకోబోమని చెబుతున్నారు. ఏపీలో అలా జరగడం లేదు. మిల్లర్లు తీసుకుంటున్నారు. అది కూడా చంద్రబాబుకు ఇష్టం లేదు. వారు తీసుకుంటున్నారు కనుక ఏదో ఒక ఆరోపణ చేయాలి. అందుకే వెంటనే నూక పేరుతో ధర తగ్గిస్తున్నారని ఆయన ఆరోపించారు. రైతు భరోసా కేంద్రాలు దగా కేంద్రాలని విమర్శించారు.
అది అసలు కథ..
భరోసా కేంద్రాలవల్ల రైతులకు ఎంతో ప్రయోజనం కలుగుతోంది. రైతులు తక్షణమే తమ గ్రామంలో ఉన్న భరోసా కేంద్రాల వద్దకు వెళ్లి తమ అవసరాలను వివరించి సాయం పొందుతున్నారు. ఆ వ్యవస్థ వల్ల వైఎస్సార్‌సీపీ పార్టీకి, సీఎం జగన్‌కు రాజకీయ ప్రయోజనం జరగరాదన్నది ఆయన కోరిక. అందుకే వాటిని సైతం ఆయన వదలిపెట్టడం లేదు. నిజంగానే ఎక్కడైనా రైతు భరోసా కేంద్రంలో ఏదైనా అవకతవక జరుగుతుంటే ప్రభుత్వ దృష్టికి తేవచ్చు. అలాకాకుండా గుంపగుత్తగా మొత్తం వ్యవస్థపైనే ఆరోపణలు చేయడం ద్వారా ఆయన అక్కసు వెళ్లగక్కారు.
ఆ పాయింట్ మాత్రం చెప్పరు
తాను అధికారంలోకి వస్తే ఈ రైతు భరోసా కేంద్రాలను ఎత్తివేస్తామని చెప్పే దైర్యం చంద్రబాబుకు ఉందా? ఆ పాయింట్ మాత్రం చెప్పరు. ఎవరైనా అలాంటి ప్రశ్నలు అడిగితే వారి మీద మండిపడితారు. చివరికి ఆయన రైతుల కులాల గురించి కూడా ప్రశ్నించి మాట్లాడే స్థాయికి వెళ్లారంటే ఇంత సీనియర్ నేత ఇన్నాళ్లుగా ఇలాంటి దిక్కుమాలిన రాజకీయం చేశారా అన్న భావన కలుగుతుంది. వాస్తవానికి ఎవరూ కూడా ఎదుటివారి కులాన్ని అడగరాదు. అందులోను సీనియర్ రాజకీయవేత్తలు అలాంటివాటికి దూరంగా ఉండాలి. కాని చంద్రబాబే అలా అడుగుతుంటే ఏమి చెబుదాం. యథా ప్రకారం తాను ఉంటే వర్షాలను ముందే పసికట్టి రైతులు నష్టపోకుండా చూసేవారట.
బాబు విచిత్ర ప్రకటనలు
గతంలో ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడే అభాసుపాలయ్యారు. సముద్రంలో తుపానులు కంట్రోల్ చేశానని, అమరావతిలో పది డిగ్రీల ఎండ తగ్గించాలని ఆదేశాలు ఇచ్చానని, సెల్ ఫోన్ తానే కనిపెట్టానని, హైదరాబాద్ తానే కట్టానని, ఇలాంటి చిత్ర, విచిత్రమైన ప్రకటనలు చేసి చంద్రబాబు నవ్వులపాలయ్యారు. ఆ సంగతి ఆయనకు టీడీపీ నేతలు ఎవరూ చెప్పరో ఏమోకాని, మళ్లీ అలాంటి వ్యాఖ్యలే చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఆయనపై జోకులు వస్తున్నాయి. చంద్రబాబు ఉంటే అసలు వర్షాలే పడవు కదా అని ఎద్దేవ చేస్తున్నారు.
రైతులంటే చిన్నచూపు
అనంతపురం జిల్లాలో కరువు వస్తే రెయిన్ గన్‌లు అంటూ వందల కోట్లు వ్యయం చేసి తెచ్చి, కరవు తీరిపోయిందని చెప్పేశారు. అసలు వ్యవసాయంపైనే ఆయనకు భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి. రైతులంటే చిన్నచూపు. వారు ఏమి చెప్పినా వింటారులే అన్న భావన. లేకుంటే 89 వేల కోట్ల రూపాయల వ్యవసాయ రుణాలను మాఫీ చేస్తానని, తాకట్టులో ఉన్న రైతుల భార్యల బంగారాన్ని విడిపిస్తానని 2014 ఎన్నికలలో హామీ ఇవ్వగలిగేవారా? పాపం.. అమాయకులైన రైతులు నమ్మి ఆయనకు ఓట్లు వేస్తే , ఆ తర్వాత వారిని దారుణంగా మోసం చేయడమే కాకుండా, వారిని ఆశపోతులని అవమానించారు.
చంద్రబాబు బిల్డప్
ఆయన అధికార ఆశ ముందు రైతుల ఆశ ఎంత చిన్నది. పైగా రైతులేమీ ఆయనను రుణాలు మాఫీ చేయాలని అడగలేదు. చంద్రబాబే ఊరువాడ తిరిగి రుణాలను మాఫీ చేస్తానని ప్రచారం చేసి ఆ తర్వాత చేతులెత్తేశారు. ఇప్పుడేమో రైతులంటే చాలా ప్రేమ ఉన్నట్లు వారి తరపున తాను పోరాడుతున్నట్లు బిల్డప్ ఇచ్చుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబుపై వైఎస్సార్‌సీపీ నేతలు, మంత్రులు విమర్శలు చేస్తున్నారు. ఆయన పేలాలు ఏరుకోవడానికి తిరుగుతున్నారని వారు ఆరోపించారు.
అవును ఆయన ఓట్ల పేలాలను ఈ వర్షాల నష్టాలలో, కష్టాలలో ఏరుకోవాలని చూశారు. రైతులు ఆ విషయాన్ని గమనించలేనంతటి అమాయకులా!.. కొసమెరుపు ఏమిటంటే చంద్రబాబు తన పర్యటనలో భారీగానే నగదు ఉండేలా చూసుకుంటున్నట్లుగా ఉంది. ఒక మహిళ ఏదో సమస్య చెప్పగానే 2.30 లక్షల రూపాయల సాయం చేశారట. మరికొన్నిచోట్ల ఐదువేలు, పదివేలు ఇలా ఇచ్చారని వార్తలు వచ్చాయి. డిజిటల్ కమిటీ ఛైర్మన్‌గా పని చేసిన ఆయన ఇంత మొత్తాలలో నగదు ఇవ్వడం అంటే ఏమి అనుకోవాలి!అది వైట్ మనీ అవుతుందా!బ్లాక్ మనీ అవుతుందా!
-కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్
Comments
Please login to add a commentAdd a comment