ఢిల్లీలో ప్రగల్భాలు: సోమయాజులు
చంద్రబాబుపై వైఎస్సార్‌సీపీ నేత సోమయాజులు ఆరోపణ
బాబు లేఖ వల్లే రాష్ట్ర విభజన జరుగుతోందని ఆవేదన
సాక్షి, హైదరాబాద్ : టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీలో బుధవారం చేసిన ప్రసంగంలో ఆయన ప్రగల్భాలు చూస్తూంటే ఆశ్చర్యం కలుగుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు డీఏ సోమయాజులు విమర్శించారు. గురువారం ఆయన పార్టీ కేంద్ర కార్యాలయం ఆవరణలో మీడియాతో మాట్లాడుతూ, బాబు తనను తాను పొగుడుకోవడంపై తీవ్రంగా స్పందించారు. తన హయాంలో ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి చేసినట్టుగానే, ఇపుడు గుజరాత్‌లో నరేంద్రమోడీ కూడా అదే విధంగా చేస్తున్నారని చంద్రబాబు చెప్పుకోవడం, నరేంద్ర మోడీ అదే వేదికపై వింటూ కూర్చోవడం విడ్డూరంగా ఉందని సోమయాజులు అన్నారు. చంద్రబాబు మాటల్లో ఒక్క నిజం లేదని దుయ్యబట్టారు. ‘తానే ఈ దేశానికి సెల్‌ఫోన్లు తెచ్చానన్నారు.. తన పాలనలో మిగులు విద్యుత్ ఉండేదన్నారు. తాను ఏ విధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేశారో ఇపుడు గుజరాత్‌లో మోడీ అదే విధంగా చేస్తున్నారట.. ఇలాంటి విచిత్రమైన విషయాలు చంద్రబాబు ఎలా చెబుతారో అర్థం కాకుండా ఉంది’ అని విమర్శించారు.
పీవీ నరసింహారావు ప్రధానిగా ఉన్నపుడు 1991-96 మధ్య కాలంలో కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రి సుఖ్‌రామ్ సెల్‌ఫోన్లను ప్రవేశ పెట్టారని సోమయాజులు గుర్తు చేశారు. ఇక మిగులు విద్యుత్ విషయానికి వస్తే... బాబు పాలనలో ఐదారుసార్లు చార్జీలు పెంచడంతో ఎవరూ కొనలేని పరిస్థితుల్లో మిగులు సాధ్యమై ఉండొచ్చు అని ఎద్దేవా చేశారు. విద్యుత్ చార్జీలు ఐదారు సార్లు పెంచినందుకే చంద్రబాబును 1999 తరువాత జరిగిన ఏ ఎన్నికల్లోనూ రాష్ట్ర ప్రజలు గెలిపించలేదన్నారు. చంద్రబాబుకు తన నిర్వాకం తెలిసి కూడా పచ్చి అబద్ధాలు చెప్పడం ఆశ్చర్యంగా ఉందన్నారు. బాబు పాలించిన తొమ్మిదేళ్ల కాలంలో రాష్ట్రం అవతరించాక ఎన్నడూ లేని విధంగా రూ. 22 వేలకోట్ల రెవెన్యూ లోటు ఏర్పడిందని గుర్తు చేశారు.
చంద్రబాబుకు అభినందన: తెలంగాణ ఏర్పాటు చేయాలని బాబు లేఖ రాసినందువల్లనే ఈ రోజు రాష్ట్ర విభజన జరుగుతోందని, ఇందుకు ఓ రకంగా చంద్రబాబుకు అభినందనలు తెలపాలని సోమయాజులు వ్యం గ్యంగా అన్నారు. 2008లో ప్రణబ్ కమిటీకి షరతులు లేని లేఖ ఇచ్చింది చాలక, 2009 ఎన్నికల ప్రణాళికలో కూడా తెలంగాణను చేర్చారని, అంతేకాక 2009 డిసెంబర్ 7న జరిగిన అఖిలపక్ష సమావేశంలో తెలంగాణకు మద్దతు పలికారని పేర్కొన్నారు.అలాగే 2012 డిసెంబర్‌లో కేంద్ర హోంమంత్రి షిండే సమక్షంలో జరిగిన అఖిలపక్షంలో కూడా బాబు తెలంగాణ కావాలని కోరారని అన్నారు. రెండు రోజులుగా ఢిల్లీలో మకాం వేసి తన కోరికకు అనుగుణంగా రాష్ట్ర విభజన చేయిస్తున్నందుకు బాబును అభినందిస్తున్నానని ఎద్దేవా చేశారు.