
దాతృత్వం స్వతహాగా రావాలి: ప్రేమ్‌జీ
న్యూఢిల్లీ: దాతృత్వమనేది సహజసిద్ధంగా రావాలే తప్ప దీన్ని బలవంతంగా రుద్దడం కుదరదని ఐటీ దిగ్గజం విప్రో చైర్మన్ అజీం ప్రేమ్‌జీ అభిప్రాయపడ్డారు. సమాజం అభివృద్ధి చెందడంలో మనమూ పాలుపంచుకోవాలని, అయితే ఈ భావన మనసులో నుంచే రావాల్సి ఉంటుందని ఆల్ ఇండియా మేనేజ్‌మెంట్ అసోసియేషన్ (ఏఐఎంఏ) 40వ వార్షిక సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆయన చెప్పారు. సామాజిక బాధ్యతలో భాగంగా కంపెనీలు తమ లాభాల్లో కొంత మొత్తాన్ని ప్రజోపయోగ కార్యక్రమాలకు(సీఎస్‌ఆర్) ఉపయోగించడాన్ని ప్రభుత్వం తప్పనిసరి చేసిన నేపథ్యంలో ప్రేమ్‌జీ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. లాభాల్లో 2 శాతాన్ని సీఎస్‌ఆర్‌పై వెచ్చించాలన్న నిబంధనను భవిష్యత్‌లో పన్ను కింద మార్చేయకూడదని ప్రేమ్‌జీ పేర్కొన్నారు.
అందరూ పాలుపంచుకోవాలి..
సామాజిక బాధ్యత కేవలం ప్రభుత్వానికే పరిమితం కాదని, సమాజంలో మార్పు రావాలంటే మొత్తం వ్యవస్థ అంతా ఈ ప్రక్రియలో పాలుపంచుకోవాల్సిన అవసరం ఉందని ప్రేమ్‌జీ అన్నారు. అయితే, ఈ చర్యలేవైనా సరే అర్థవంతంగా ఉండాలని ఆయన పేర్కొన్నారు. 2010లో ప్రేమ్‌జీ విప్రోలో 8.7% వాటాలను స్వచ్ఛంద సేవా సంస్థ అజీం ప్రేమ్‌జీ ఫౌండేషన్‌కి విరాళంగా ఇచ్చిన సంగతి తెలిసిందే.