కువైట్‌లో ఓ షఫానా కన్నీటి గాథ! | cheated, assaulted and stranded: a young, educated Kerala nursing girl shafana nightmare in Kuwait | Sakshi
Sakshi News home page

కువైట్‌లో ఓ షఫానా కన్నీటి గాథ!

Published Fri, Jun 24 2016 7:02 PM | Last Updated on Mon, Sep 4 2017 3:18 AM

కువైట్‌లో ఓ షఫానా కన్నీటి గాథ!

కువైట్‌లో ఓ షఫానా కన్నీటి గాథ!

కువైట్ : ఊరుగాని ఊరులో దేశంగాని దేశంలో తోడెవరూ లేక, సెక్స్ కోసం వేధించే తోడేళ్ల నుంచి తప్పించుకునేందుకు కొంగుతో తలదాచుకొని నాలుగు గోడలకే పరిమితమై బతుకుతున్న  ఓ కేరళ యువతి కన్నీటిగాధ ఇది. భారత ఎంబసీ నిర్లక్ష్య వైఖరి కారణంగా వెనుతిరిగి ఊరు చేరే దారులు మూసుకపోగా దారుణ పరిస్థితుల్లో బతుకుతున్న ఓ దైన్య దీనగాథ. చదువుకున్న తానే ఇంత దీనావస్థలో ఉంటే చదువుకోకుండా పొట్టకూటి కోసం కువైట్‌కు చేరుతున్న భారతీయుల బతుకు ఇంకా ఎంత ఛిద్రమోగదా! అన్నది ఆమెలో ద్యోతకమవుతున్న బాధ.

కేరళలోని కన్నూర్‌కు చెందిన షఫానాకు ఇప్పుడు 27 ఏళ్లు. రెండేళ్ల క్రితం, అంటే 2014లో ఓ రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది కుటుంబ సభ్యులు మరణించడంతో ఒంటరిగా మిగిలింది. పుట్టిన గడ్డపై ఉంటే పుట్టెడు దు:ఖాన్ని ఎలా దిగమింగుకోవాలో తెలియక సతమతమవుతున్న ఆమెకు ఓ ఏజెంట్ ద్వారా పరిస్థితులను తప్పించుకునేందుకు దారి దొరికిందని భావించింది. అప్పటికే నర్సింగ్ డిగ్రీ చేసిన షఫానాకు కువైట్‌లో మాస్టర్ డిగ్రీ చేయవచ్చని, ఆ తర్వాత ప్రముఖ ఆస్పత్రుల్లో పనిచేయవచ్చంటూ ఏజెంట్ చెప్పిన మాటలను నమ్మి కువైట్ వెళ్లేందుకు సిద్ధపడింది. ఉన్న ఆస్తులమ్ముకొని పరాయి దేశానికి చేరింది. లక్షలాది రూపాయలు లాక్కున్న ఏజెంట్ ఎయిర్‌పోర్టులో తనను రిసీవ్ చేసుకోవడానికి వస్తారని కూడా భ్రమ పడింది. అతనికి బదులుగా కేవలం ముఖ పరిచియం ఉన్న అమర్ అల్షుహౌమీ అనే వ్యక్తి రిసీవ్ చేసుకోవడానికి వచ్చాడు. విమానం ఎక్కే సమయానికిగానీ తనకు వచ్చిన వీసా ఏమిటో ఆమెకు తెలియలేదు. ఎందుకంటే విమానం ఎక్కడానికి కొద్దిసేపు ముందే ఏజెంట్ ద్వారా ఆమెకు వీసా, పాస్‌పోర్టులు అందాయి. వీసాలో ఓ ఇంటికి పని మనిషిగా వెళుతున్న విషయాన్ని గ్రహించి తాను మోసపోయాననుకుంది. చేసేదేమీలేక కువైట్ వెళ్లింది.

‘నేను కువైట్ ఆస్పత్రిలో నర్సుగా పని చేయాలనుకున్నాను. కానీ నా వెంట ఉన్న అమర్ నన్ను ఇళ్లోని మానసిక రోగులను చూసుకునే పని అప్పగించాడు. వెళ్లిన కొత్తలోనే మానసిక జబ్బుతో బాధపడుతున్న ఓ ఏడేళ్ల బాలుడు ఓ ఇనుప రాడ్ తీసుకొని నా మాడు పగులగొట్టాడు. ఎనిమిది కుట్లు పడ్డాయి. ఆ తర్వాత 2015, జనవరి నెలలో మరో మానసిక రోగి కత్తితో నా గొంతు కోశాడు. అప్పుడు కూడా నాకు మెడపై ఎనిమిది కుట్లు పడ్డాయి’ అంటూ గద్గద స్వరంలో ఆమె తన అనుభవాలను వివరించడం మొదలు పెట్టింది.  ఈ పరిణామాలతో ఇంకెంత మాత్రం మానసిక రోగులను చూసుకోలేనని తెగేసి చెప్పింది. భారత్‌కు వెళ్లిపోవాలని నిర్ణయించుకుంది. కువైట్‌లోని భారత ఎంబసీకి వెళ్లింది. అక్కడ ఆమె గోడును పట్టించుకోని అధికారులు ఆమెను ఓ ఈజిప్టు అధికారికి అప్పగించారు. ఆమెను కదలకుండా కూర్చోమని, ఆమెపై కేసు నమోదు చేసేవరకు స్పాన్సర్ నుంచి ఎన్ని ఫోన్లు వచ్చినా ఎత్తవద్దని ఆ ఈజిప్టు అధికారి హెచ్చరించారు. ఈ పరిణామానికి షఫానా బిత్తర పోయింది.

‘నా మీద కేసు ఏమిటీ? నేను ఎలాంటి తప్పు చేయలేదే! అమర్ దగ్గర ఉండిపోయిన నా పాస్‌పోర్టును నాకు అప్పగించి భద్రంగా భారత్ పంపిస్తారని నేను భావించాను. అయితే నేను ఎక్కడికో పారిపోయానని, నా స్పాన్సర్ నా మీద ఫిర్యాదు చేశాడట. ఆ ఫిర్యాదును పురస్కరించుకొని నా మీద కేసు దాఖలు చేయాల్సి ఉంటుందని  ఆ ఈజిప్టు అధికారి నాకు చెప్పాడు. నా పరిస్థితి మొత్తాన్ని వివరించాను. అయినా భారత్ వెళ్లాలంటే కువైట్ చట్టాల ప్రకారం కొంతకాలం జైలు కెళ్లాల్సి ఉంటుందని చెప్పారు. లేదా వచ్చిన దారినే వెనుతిరిగి వెళ్లిపోవాలన్నారు. దాంతో మళ్లీ కువైట్ వీధుల్లోకి వెళ్లాను’ అని ఆమె చెప్పుకొచ్చింది.

ఆ తర్వాత ‘కేరళకు చెందిన ఓ వ్యక్తి నడుపుతున్న ఓ ఆయుర్వేద క్లినిక్‌లో పనికి కుదిరాను. ఓ రోజున బాధంతా క్లినిక్ యజమానికి చెప్పుకున్నాను. తాను తిరిగి భారత్‌కు వెళ్లేందుకు సహాయం చేయమని కోరాను. ఆయన రోహిన్ అనే మరో కేరళకు చెందిన వ్యక్తిని పరిచయం చేశాడు. డ్రైవర్‌గా కువైట్‌లో పనిచేస్తున్న రోహిన్ పలుకుబడితో వీసా దొరుకుతుందని చెప్పాడు. వీసా సాయం చేయడానికి ప్రతిఫలంగా రోహిన్ నా శరీరాన్ని కోరాడు. అందుకు నేను అంగీకరించలేదు. అప్పటి నుంచి నన్ను వేధించసాగాడు. ఓ రోజు ఇద్దరు మిత్రులతో కలసి నా వద్దకు వచ్చాడు. నన్ను ప్రేమిస్తున్నానని, తన సెక్స్ కోరికలు తీరిస్తే సాయం చేస్తానని నమ్మబలికాడు.

అందుకు నేను అంగీకరించలేదు. దాంతో కేరళలోవున్న నా బంధువులకు ఫోన్ చేసి నాకు బాయ్ ఫ్రెండ్స్ ఎక్కువగా ఉన్నారని, వారితో తిరుగుతున్నానని దుష్ర్పచారం చేశాడు. అతని నుంచి తప్పించుకునేందుకు ఆయుర్వేద క్లినిక్‌లో పని మానేశాను. తెల్సిన ఇద్దరు నర్సులతో ఓ రూమ్‌లో తలదాచుకున్నాను. బయటకు రావాలంటే భయమేస్తోంది. అత్యవసరమైతే ముఖం నిండా కొంగు కప్పుకొని బయటకు వెళ్లెస్తాను. ఎక్కువ వరకు ఇంట్లోనే ఉంటున్నాను. మామ వరుసయ్యే ఓ బంధువు చేస్తున్న కొద్దిపాటి ఆర్థిక సాయంతో రోజులు గడుస్తున్నాయి. దిక్కుతోచడం లేదు. ఎలా భారత్‌కు వెళ్లాలో తెలియడం లేదు. ఇలాంటి బాధ ఎవరికి ఎదురుకాకూడదు’ అని షఫానా తన గాథను మీడియాలో పంచుకున్నారు. ఇలా భారత్ నుంచి కువైట్ వెళ్లి చిక్కుల్లో పడ్డ షఫానాలు కువైట్‌లో ఎందరో ఉన్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement