Agent cheating
-
ఇది మాకు పునర్జన్మ.. తిరిగి ఇండియాను చూడమనుకున్నాం
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: కాంబోడియాకు ఉద్యోగం కోసం వెళ్లిన తాము నరక కూపం నుంచి బయటపడ్డామని.. తిరిగి ఇండియాకు వస్తామనుకోలేదని.. ఇది తమకు పునర్జన్మ అని.. ఐదుగురు యువకులు వెల్లడించారు. గురువారం ఉదయం కరీంనగర్‌కు చేరుకున్నాక యువకులు ఉద్వేగానికి లోనయ్యారు. ‘సాక్షి’తో ప్రత్యేకంగా తమ ఆవేదనను పంచుకున్నారు. ఎన్నో ఆశలతో కాంబోడియాలో అడుగుపెట్టిన తమకు వెళ్లగానే ఆశలు ఆవిరయ్యాయన్నారు. అక్కడ కంపెనీ నిర్వాహకులు తమ పాస్‌పోర్టులు లాక్కుని, సైబర్ నేరాలు చేయాలని తొలిరోజే ఒత్తిడి తెచ్చారన్నారు. చేతిలో పాస్‌పోర్టులు లేక, ఎవరిని సంప్రదించాలో తెలియక, ఆకలితో నకనకలాడుతూ తాము ఎంతో మానసికవేదన అనుభవించామన్నారు. బయటికి వెళదామని ప్రయత్నించినా.. తమను చుట్టూ ఎత్తైన గోడలు, వాటికి కరెంటు కంచెలు, భారీ భద్రత నడుమ తమను బంధీ చేశారన్న విషయం తెలుసుకుని మరింత కుంగిపోయామని వాపోయారు. కానీ..‘సాక్షి’ చొరవతో ప్రభుత్వ యంత్రాంగాలు సమన్వయంతో పనిచేసి తిరిగి తమను మాతృభూమిని చేరేలా చేశాయన్నారు. ‘సాక్షి’కి తాము ఎంతో రుణపడి ఉంటామని వివరించారు. ఈ సందర్భంగా ఐదుగురు యువకులు కాంబోడియాలో చైనా సైబర్ స్కాం ముఠా చేతిలో అనుభవించిన బాధలను పంచుకున్నారు. భారతీయులు చాలామంది ఉన్నారు మాలాగే ఉపాధి ఆశతో అక్కడ సైబర్ నేరస్తుల ముఠా చేతిలో పడిన వారు చాలామంది ఉన్నారు. ఇండియాతోపాటు పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్‌కు చెందిన అనేకమంది అమాయకులు వారి వద్ద బందీలుగా ఉన్నారు. అందరితో ఇవే పనులు చేయిస్తున్నారు. ఎదురుతిరిగితే ఇక అంతే సంగతులు. బంధీలకు ఆత్మహత్య తప్ప మరే గత్యంతరమే లేదు. –షారూఖ్‌ఖాన్ ఏజెంట్లు గోల్మాల్ చేశారు మా విషయంలో ఇద్దరు ఏజెంట్లు గోల్మాల్ చేశారు. మమ్మల్ని కాంబోడియా చేర్చగానే విషయం అర్థమైంది. మమ్మల్ని అబ్దుల్ నుంచి అమెరికన్ డాలర్లు వెచ్చించి కొనుగోలు చేశామని చైనీయులు చెప్పారు. వచ్చీరాని ఇంగ్లిష్‌లో తాము చెల్లించిన డబ్బులు కట్టే వరకు విడిచి పెట్టమంటూ ఒక గదిలో బంధించారు. – నవీద్ సెల్‌ఫోన్ తాకట్టుపెట్టాను మేం వెళ్లిన తొలిరోజు నుంచే చైనీయులు మమ్మల్ని నేరాలు చేయాలని ఒత్తిడి చేయడం ప్రారంభించారు. మేము ససే మీరా అంటే వారు వినిపించుకోలేదు. చివరికి మమ్మల్ని ఆ చెర నుంచి విడిపించిన రోజు మా చేతుల్లో చిల్విగవ్వలేదు. దీంతో నేను నా సెల్‌ఫోన్‌ను తాకట్టుపెట్టాను. ఆకలి ఇబ్బంది పెడుతున్నా మేం కడుపునింపుకోలేదు. ఆ డబ్బులతో మా చిన్నచిన్న ఖర్చులు భరించుకున్నాం. – షాబాజ్‌ఖాన్ మమ్మల్ని అమ్మేశారని అర్థమైంది మేం వెళ్లగానే మా పాస్‌పోర్టులు లాగేసుకున్నారు. చెప్పినట్లు చేయాలని బెది రింపులకు దిగారు. ఉద్యోగానికి బదులు బెదిరింపులు రాగానే.. మమ్మల్ని అమ్మేశారని అర్థమైంది. ఇక అక్కడ నుంచి బయటపడటం గగనమే అనుకున్నాం. సైబర్ నేరాలు చేయలేక, అక్కడ నుంచి బయటపడే మార్గం లేక నరక యాతన అనుభవించాం. – సలీమ్ హోటల్ వైఫైతో వీడియో పంపాం చైనీయుల ఆఫీసులో బంధీ కాగానే తొలుత ఆందోళన చెందాం. డబ్బులు కడితేగానీ పంపేదిలేదని చైనీయులు తెగేసి చెప్పడంతో భయపడ్డాం. తిరిగి ఇల్లు చూస్తామనుకోలేదు. హోటల్ వైఫై పాస్ వర్డ్ తెలుసుకుని వెంటనే మా దయనీయ స్థితి ని వివరిస్తూ వీడియో చేసి ‘సాక్షి’కి పంపించాం. అదే మమ్మల్ని కాపాడింది. – హాజీబాబా -
గుడ్డిగా నమ్మారు.. చివరికి దుబాయ్‌లో..
జగిత్యాల క్రైం: మంచి ఉద్యోగం, బ్యాంక్ రుణం తీసుకొని ఎగ్గొట్ట వచ్చన్న ఏజెంట్ మాయమాటలు నమ్మి ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన నలుగురు యువకులు మోసపోయారు. విజిట్ వీసాపై దుబాయ్ వెళ్లి అక్కడే చిక్కుకున్నారు. జిల్లాలోని పోతపల్లికి చెందిన రావుల మనోజ్‌కుమార్, తిమ్మాపూర్‌కు చెందిన నూనె నాగరాజు, మడక గ్రామానికి చెందిన నోముల శ్రీధర్, కరీంనగర్ పట్టణం భగత్‌నగర్‌కు చెందిన కొమిడి నవీన్‌రెడ్డి.. నిజామాబాద్ జిల్లా మానిక్బండార్కు చెందిన గల్ఫ్ ఏజెంట్ గుండారపు వంశీకృష్ణను కలిశారు. ఒక్కొక్కరు రూ.1.50 లక్షలు చెల్లిస్తే విజిట్ వీసాపై దుబాయ్ పంపిస్తానని, అక్కడ తమవారు రిసీవ్ చేసుకొని కంపెనీ వీసా ఇప్పిస్తారని నమ్మబలికాడు. కంపెనీ వీసా వచ్చిన తర్వాత బ్యాంకుల నుంచి ఒక్కొక్కరు రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు రుణం తీసుకుని స్వదేశానికి తిరిగి రావచ్చని నమ్మించాడు. గుడ్డిగా ఏజెంట్ మాటలు నమ్మారు ఏజెంట్ మాటలు నమ్మిన సదరు యువకులు ఒక్కొక్కరు రూ1.50 లక్షలు చొప్పున చెల్లించి ఫిబ్రవరి 11న హైదరాబాద్ నుంచి దుబాయ్‌కి చేరుకున్నారు. విమానాశ్రయం నుంచి మేడిపల్లి మండలం మన్నెగూడెంకు చెందిన కొడిమ్యాల బాబా శ్రీనివాస్ ఈ యువకులను తీసుకెళ్లి దుబాయ్‌లోని సత్వా పట్టణంలో ఓ గదిలో పెట్టాడు. మరుసటి రోజు కంపెనీ వీసా కోసం ఏజెంట్‌ను ఫోన్లో నిలదీయగా.. బాబాశ్రీనివాస్ ఇప్పిస్తాడని చెప్పాడు. వారంతా శ్రీనివాస్‌ను అడుగగా.. తనకేమీ సంబంధం లేదని, కొద్దిరోజులపాటు తన వద్ద ఉంచుకోమని చెప్పాడన్నారు. దీంతో మోసపోయామని తెలుసుకొని.. పది రోజుల క్రితం నవీన్‌రెడ్డి అక్కడే ఉన్న వారి బంధువుల సహాయంతో స్వదేశానికి తిరిగి వచ్చాడు. మిగతా ముగ్గురు ఇండియాకు రావాలంటే ఒక్కొక్కరు రూ.44 వేలు చెల్లించాల్సి ఉంది. తమను ఆదుకోవాలని, విజిట్ వీసాపై పంపిన గల్ఫ్ ఏజెంట్ వంశీకృష్ణపై చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు. ( చదవండి: ఆ సంచీలో ఒక్క రూపాయి లేదు.. కిడ్నాప్ ఓ డ్రామా! ) -
ఏజెంట్ చేతిలో మోసపోయిన జగిత్యాల వాసి
శంషాబాద్: ఉపాధి కోసం గల్ఫ్‌కు వెళ్లి ఏజెంట్ చేతిలో మోసపోయిన ఓ బాధితుడు ఎట్టకేలకు హైదరాబాద్‌కు తిరిగొచ్చాడు. అయితే, ఇంటికి వెళ్లేందుకు కనీస చార్జీలు లేకపోవడంతో రెండురోజులు ఎయిర్‌పోర్టులోనే తిండితిప్పలు లేకుండా పడిఉన్నాడు. జగిత్యాలకు చెందిన కిష్టయ్య నెలల కిందట ఏజెంట్‌కు రూ.50వేలు చెల్లించి దుబాయికు వెళ్లాడు. అక్కడ రెండు నెలలపాటు కూలిపని చేశాడు. ఈ సమయంలో ఏజెంట్‌కు సంబంధించిన వ్యక్తులు అతడి పాస్‌పోర్టు, వీసాలతో పాటు పనిచేసిన డబ్బులు కూడా తీసుకున్నారు. పాస్‌పోర్టు, వీసా లేకుండా తిరగడంతో అక్కడి ప్రభుత్వం అతడిని మూడునెలల పాటు జైలులో ఉంచింది. అక్కడి ఇండియన్ ఎంబసీ అధికారులు అతను పనిచేసిన కంపెనీ నుంచి టికెట్ ఇప్పించి హైదరాబాద్‌కు పంపారు. రెండురోజుల కిందట శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న కిష్టయ్య వద్ద ఇంటికి వెళ్లేందుకు కనీస చార్జీలు కూడా లేకపోవడంతో ఎయిర్‌పోర్టు లాన్‌లోనే కాలం వెళ్లదీసాడు. సమాచారం తెలుసుకున్న ఊట్పల్లికి చెందిన టీఆర్ఎస్ నేత రాచమల్ల సురేష్ అతడికి భోజనం పెట్టించి ప్రయాణ చార్జీలు అందజేయడంతో అతడు జగిత్యాల బయలుదేరాడు. -
మా వాళ్లను విడిపించరూ..!
జన్నారం(ఖానాపూర్): ‘మా నాన్న మాతో మాట్లాడక రెండు నెలలయితంది. ఇరాక్ దేశంలో జైళ్లో పడ్డాడట. అమ్మ వాళ్లు ఏడుస్తున్నరు. మా కోసం వేరే దేశం వెళ్లిన మా నాన్నను ఇంటికి తీసుకువచ్చేలా ప్రభుత్వం చొరవ చూపాలి. కేటీఆర్ సార్ మా మీద దయ చూపాలి, మా నాన్నను తీసుకురావాలి’అని మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని కవ్వాల్ గ్రామానికి చెందిన కుంటాల లచ్చన్న పిల్లలు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. కవ్వాల్ గ్రామానికి చెందిన లచ్చన్న, షేర్ల రాజు ఉపాధి కోసం 2015లో ఇరాక్ వెళ్లారు. వీసా కోసం నిజామాబాద్ జిల్లాకు చెందిన ఏజెంట్‌కు రూ.1.50 లక్షలు కట్టారు. ఏజెంట్ విజిట్ వీసాతో వారిని అక్కడికి పంపించాడు. అక్కడికి వెళ్లాక ఏజెంట్ మోసం చేశాడని తెలిసింది. దీంతో తెలిసిన వారి వద్ద ఉంటూ దొంగ చాటుగా పనిచేస్తూ జీవించారు. ఏడాది తర్వాత పనిచేసిన డబ్బులతో అఖా మా చేయించుకున్నారు. ఆ సమయంలో అప్పుల పాలయ్యారు. అఖామా వచ్చాక ఎర్బిల్లోని పాఠశాలలో పని దొరికింది. ఇద్దరూ అక్కడే పని చేస్తూ అఖామాకు చేసిన అప్పులు తీర్చారు. ఇక స్వదేశంలో చేసిన అప్పులే తీర్చాల్సి ఉంది. అప్పులు తీర్చి ఇంటికి వద్దామనుకున్నారు. ఏప్రిల్ 16న పోలీసులు వచ్చి ఎలాంటి కారణం లేకుండా వారిద్దరినీ పట్టుకెళ్లారు. ఎందుకు పట్టుకెళ్లారో.. ఎన్ని రోజులు జైళ్లో ఉంచుతారో తెలియని పరిస్థితి ఏర్పడింది. -
కువైట్‌లో ఓ షఫానా కన్నీటి గాథ!
కువైట్ : ఊరుగాని ఊరులో దేశంగాని దేశంలో తోడెవరూ లేక, సెక్స్ కోసం వేధించే తోడేళ్ల నుంచి తప్పించుకునేందుకు కొంగుతో తలదాచుకొని నాలుగు గోడలకే పరిమితమై బతుకుతున్న ఓ కేరళ యువతి కన్నీటిగాధ ఇది. భారత ఎంబసీ నిర్లక్ష్య వైఖరి కారణంగా వెనుతిరిగి ఊరు చేరే దారులు మూసుకపోగా దారుణ పరిస్థితుల్లో బతుకుతున్న ఓ దైన్య దీనగాథ. చదువుకున్న తానే ఇంత దీనావస్థలో ఉంటే చదువుకోకుండా పొట్టకూటి కోసం కువైట్‌కు చేరుతున్న భారతీయుల బతుకు ఇంకా ఎంత ఛిద్రమోగదా! అన్నది ఆమెలో ద్యోతకమవుతున్న బాధ. కేరళలోని కన్నూర్‌కు చెందిన షఫానాకు ఇప్పుడు 27 ఏళ్లు. రెండేళ్ల క్రితం, అంటే 2014లో ఓ రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది కుటుంబ సభ్యులు మరణించడంతో ఒంటరిగా మిగిలింది. పుట్టిన గడ్డపై ఉంటే పుట్టెడు దు:ఖాన్ని ఎలా దిగమింగుకోవాలో తెలియక సతమతమవుతున్న ఆమెకు ఓ ఏజెంట్ ద్వారా పరిస్థితులను తప్పించుకునేందుకు దారి దొరికిందని భావించింది. అప్పటికే నర్సింగ్ డిగ్రీ చేసిన షఫానాకు కువైట్‌లో మాస్టర్ డిగ్రీ చేయవచ్చని, ఆ తర్వాత ప్రముఖ ఆస్పత్రుల్లో పనిచేయవచ్చంటూ ఏజెంట్ చెప్పిన మాటలను నమ్మి కువైట్ వెళ్లేందుకు సిద్ధపడింది. ఉన్న ఆస్తులమ్ముకొని పరాయి దేశానికి చేరింది. లక్షలాది రూపాయలు లాక్కున్న ఏజెంట్ ఎయిర్‌పోర్టులో తనను రిసీవ్ చేసుకోవడానికి వస్తారని కూడా భ్రమ పడింది. అతనికి బదులుగా కేవలం ముఖ పరిచియం ఉన్న అమర్ అల్షుహౌమీ అనే వ్యక్తి రిసీవ్ చేసుకోవడానికి వచ్చాడు. విమానం ఎక్కే సమయానికిగానీ తనకు వచ్చిన వీసా ఏమిటో ఆమెకు తెలియలేదు. ఎందుకంటే విమానం ఎక్కడానికి కొద్దిసేపు ముందే ఏజెంట్ ద్వారా ఆమెకు వీసా, పాస్‌పోర్టులు అందాయి. వీసాలో ఓ ఇంటికి పని మనిషిగా వెళుతున్న విషయాన్ని గ్రహించి తాను మోసపోయాననుకుంది. చేసేదేమీలేక కువైట్ వెళ్లింది. ‘నేను కువైట్ ఆస్పత్రిలో నర్సుగా పని చేయాలనుకున్నాను. కానీ నా వెంట ఉన్న అమర్ నన్ను ఇళ్లోని మానసిక రోగులను చూసుకునే పని అప్పగించాడు. వెళ్లిన కొత్తలోనే మానసిక జబ్బుతో బాధపడుతున్న ఓ ఏడేళ్ల బాలుడు ఓ ఇనుప రాడ్ తీసుకొని నా మాడు పగులగొట్టాడు. ఎనిమిది కుట్లు పడ్డాయి. ఆ తర్వాత 2015, జనవరి నెలలో మరో మానసిక రోగి కత్తితో నా గొంతు కోశాడు. అప్పుడు కూడా నాకు మెడపై ఎనిమిది కుట్లు పడ్డాయి’ అంటూ గద్గద స్వరంలో ఆమె తన అనుభవాలను వివరించడం మొదలు పెట్టింది. ఈ పరిణామాలతో ఇంకెంత మాత్రం మానసిక రోగులను చూసుకోలేనని తెగేసి చెప్పింది. భారత్‌కు వెళ్లిపోవాలని నిర్ణయించుకుంది. కువైట్‌లోని భారత ఎంబసీకి వెళ్లింది. అక్కడ ఆమె గోడును పట్టించుకోని అధికారులు ఆమెను ఓ ఈజిప్టు అధికారికి అప్పగించారు. ఆమెను కదలకుండా కూర్చోమని, ఆమెపై కేసు నమోదు చేసేవరకు స్పాన్సర్ నుంచి ఎన్ని ఫోన్లు వచ్చినా ఎత్తవద్దని ఆ ఈజిప్టు అధికారి హెచ్చరించారు. ఈ పరిణామానికి షఫానా బిత్తర పోయింది. ‘నా మీద కేసు ఏమిటీ? నేను ఎలాంటి తప్పు చేయలేదే! అమర్ దగ్గర ఉండిపోయిన నా పాస్‌పోర్టును నాకు అప్పగించి భద్రంగా భారత్ పంపిస్తారని నేను భావించాను. అయితే నేను ఎక్కడికో పారిపోయానని, నా స్పాన్సర్ నా మీద ఫిర్యాదు చేశాడట. ఆ ఫిర్యాదును పురస్కరించుకొని నా మీద కేసు దాఖలు చేయాల్సి ఉంటుందని ఆ ఈజిప్టు అధికారి నాకు చెప్పాడు. నా పరిస్థితి మొత్తాన్ని వివరించాను. అయినా భారత్ వెళ్లాలంటే కువైట్ చట్టాల ప్రకారం కొంతకాలం జైలు కెళ్లాల్సి ఉంటుందని చెప్పారు. లేదా వచ్చిన దారినే వెనుతిరిగి వెళ్లిపోవాలన్నారు. దాంతో మళ్లీ కువైట్ వీధుల్లోకి వెళ్లాను’ అని ఆమె చెప్పుకొచ్చింది. ఆ తర్వాత ‘కేరళకు చెందిన ఓ వ్యక్తి నడుపుతున్న ఓ ఆయుర్వేద క్లినిక్‌లో పనికి కుదిరాను. ఓ రోజున బాధంతా క్లినిక్ యజమానికి చెప్పుకున్నాను. తాను తిరిగి భారత్‌కు వెళ్లేందుకు సహాయం చేయమని కోరాను. ఆయన రోహిన్ అనే మరో కేరళకు చెందిన వ్యక్తిని పరిచయం చేశాడు. డ్రైవర్‌గా కువైట్‌లో పనిచేస్తున్న రోహిన్ పలుకుబడితో వీసా దొరుకుతుందని చెప్పాడు. వీసా సాయం చేయడానికి ప్రతిఫలంగా రోహిన్ నా శరీరాన్ని కోరాడు. అందుకు నేను అంగీకరించలేదు. అప్పటి నుంచి నన్ను వేధించసాగాడు. ఓ రోజు ఇద్దరు మిత్రులతో కలసి నా వద్దకు వచ్చాడు. నన్ను ప్రేమిస్తున్నానని, తన సెక్స్ కోరికలు తీరిస్తే సాయం చేస్తానని నమ్మబలికాడు. అందుకు నేను అంగీకరించలేదు. దాంతో కేరళలోవున్న నా బంధువులకు ఫోన్ చేసి నాకు బాయ్ ఫ్రెండ్స్ ఎక్కువగా ఉన్నారని, వారితో తిరుగుతున్నానని దుష్ర్పచారం చేశాడు. అతని నుంచి తప్పించుకునేందుకు ఆయుర్వేద క్లినిక్‌లో పని మానేశాను. తెల్సిన ఇద్దరు నర్సులతో ఓ రూమ్‌లో తలదాచుకున్నాను. బయటకు రావాలంటే భయమేస్తోంది. అత్యవసరమైతే ముఖం నిండా కొంగు కప్పుకొని బయటకు వెళ్లెస్తాను. ఎక్కువ వరకు ఇంట్లోనే ఉంటున్నాను. మామ వరుసయ్యే ఓ బంధువు చేస్తున్న కొద్దిపాటి ఆర్థిక సాయంతో రోజులు గడుస్తున్నాయి. దిక్కుతోచడం లేదు. ఎలా భారత్‌కు వెళ్లాలో తెలియడం లేదు. ఇలాంటి బాధ ఎవరికి ఎదురుకాకూడదు’ అని షఫానా తన గాథను మీడియాలో పంచుకున్నారు. ఇలా భారత్ నుంచి కువైట్ వెళ్లి చిక్కుల్లో పడ్డ షఫానాలు కువైట్‌లో ఎందరో ఉన్నారు. -
ఎడారి దేశాల్లో అనాథ బతుకులు
నరసాపురం అర్బన్/మొగల్తూరు : ఉన్న ఊరిలో ఉపాధి లేక, ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక గంపెడు ఆశతో గల్ఫ్ దేశాలకు పయనమైనవారు ఏజెంట్ల చేతిలో మోసపోయి దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. పరాయి దేశాల్లో పలుకరించే వారు లేక సాయం చేసే చేతులు కనపడక అష్టకష్టాలు పడుతున్నారు. విజిటింగ్ వీసాతో దుబాయ్ వెళ్లి అక్కడ సేటు పెట్టే చిత్రహింసలు భరించలేక ఓ మహిళ స్వచ్ఛంద సంస్థ ద్వారా పోలీసులను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. మహిళలను వ్యభిచార గృహానికి తరలించే ప్రయత్నం సాగుతుండగా విషయం వెలుగులోకి వచ్చింది. తనను మొగల్తూరు గ్రామానికి చెందిన సీహెచ్ త్రిమూర్తులు అనే ఏజెంట్ మోసం చేసి తప్పుడు వీసాతో ఇక్కడకు తీసుకొచ్చి వదిలేశాడని మహిళ ఫిర్యాదు చేశారు. ఈ ఉదంతంతో మొగల్తూరుకు చెందిన సీహెచ్ త్రిమూర్తులు అలియాస్ తిమోతి, మరొక వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నరసాపురం డీఎస్పీ సౌమ్యలత ఈ కేసును విచారిస్తున్నారు. ఒకే రోజు రెండు గల్ఫ్ కేసులు నమోదు సీహెచ్ త్రిమూర్తులు భాగోతాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఆదివారం మొగల్తూరు పోలీస్ స్టేషన్లో మరో కేసు నమోదైంది. మొగల్తూరుకు చెందిన జల్లి రాజకుమారిని నాలుగు నెలల క్రితం త్రిమూర్తులు దుబాయ్ పంపించాడు. దుబాయ్ వెళ్లిన 15 రోజుల పాటు ఇక్కడ కుటుంబ సభ్యులకు ఫోన్ చేసేది. తరువాత ఆమె వద్ద నుంచి ఫోన్, ఇతర సమాచారం కానీ అందడం లేదు. తాజాగా త్రిమూర్తులు వ్యవహారం వెలుగులోకి రావడంతో రాజకుమారి బంధువులు ఆందోళనలో పడ్డారు. రాజకుమారి తండ్రి వెంకటేశ్వరరావు మొగల్తూరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన కూతురు ఏమైందో తెలియడం లేదని రూ.2 లక్షలు తీసుకుని దుబాయ్ పంపించాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. మొదట్లో ఫోన్లో మాట్లాడినప్పుడు ఇక్కడ 40 మందిని ఓ రూమ్‌లో పెట్టి పనికి పంపిస్తున్నారని, వేధింపులు ఎక్కువగా ఉన్నాయని వాపోయిందని, దానిని బట్టి చూస్తే తమ బిడ్డ పరిస్థితి దీనంగానే ఉండి ఉంటుందని వెంకటేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. నరసాపురం పట్టణం కృష్ణబాబు కాలనీకి చెందిన సయ్యద్ బుజ్జి తాను గల్ఫ్ ఏజెంట్ చేతిలో మోసపోయానని పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పాలకొల్లుకు చెందిన గల్ఫ్ ఏజెంట్ ఉల్లంపర్తి ప్రభాకర్ తనను, తన కుమార్తె ఇమామ్ ఖాతుమ్ను రూ.80 వేలు తీసుకుని దుబాయ్ పంపించాడని తెలిపారు. అక్కడ తమను ప్రతి రోజు చిత్రహింసలు పెట్టేవారని, రోజుకోచోట గొడ్డుచాకరి చేయించేవారని చెప్పారు. అది భరించలేక తాను ఈ నెల 6న తిరిగి వచ్చేశానని, తన కూతురు మాత్రం అక్కడే చిత్రహింసలు అనుభవిస్తుందని తెలిపారు. తన కూతురును రప్పించి న్యాయం చేయాలని పోలీసులను ఆమె కోరారు. ఉపాధి కోసం గల్ఫ్ బాట ఉపాధి కోసం జిల్లాలో ఏటా లక్షా 50 వేల మంది గల్ఫ్ దేశాలకు వెళుతున్నారు. వారిలో డెల్టా ప్రాంతం నుంచి ఎక్కువగా వెళుతున్నారు. నిరక్షరాస్యత కారణంగా వీసా నిబంధనలు తెలియకపోవడం గల్ఫ్ ఏజెంట్లకు వరంగా మారింది. దీంతో వారు మోసాలకు పాల్పడుతున్నారు. గల్ఫ్ ఏజెంట్ల మోసాలకు అడ్డుకట్ట వేయూలని స్థానిక ప్రజలు పోలీసులను కోరుతున్నారు. గల్ఫ్ ఏజెంట్లపై కేసు నమోదు మొగల్తూరు : దుబాయ్ వెళ్లి మోసపోయిన బాధిత కుటుంబ సభ్యులు ఆదివారం మొగల్తూరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఏఎస్సై వై.నాగేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం మొగల్తూరు పంచాయతీ గోడావారి పేటకు చెందిన జల్లి వెంకటేశ్వరరావు కుమార్తె రాజకుమారిని ఉండికి చెందిన గల్ఫ్ ఏజెంట్లు కొల్లి శామ్యూల్, మొగల్తూరుకు చెందిన సీహెచ్ తిమోతి (త్రిమూర్తులు) నాలుగు నెలల క్రితం దుబాయ్ పంపారు. అక్కడ తమ కుమార్తె ఇబ్బందులకు గురవుతుందని, ఫోన్ సమాచారం లేకపోవడంతో ఆందోళన చెంది తమకు ఫిర్యాదు చేశాడని ఆయన తెలిపారు. బాధితురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఆయన తెలిపారు.