ఎడారి దేశాల్లో అనాథ బతుకులు | Agent cheating on Narasapuram woman | Sakshi
Sakshi News home page

ఎడారి దేశాల్లో అనాథ బతుకులు

Published Mon, Mar 9 2015 1:07 AM | Last Updated on Tue, Aug 21 2018 3:08 PM

Agent cheating on Narasapuram woman

 నరసాపురం అర్బన్/మొగల్తూరు : ఉన్న ఊరిలో ఉపాధి లేక, ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక గంపెడు ఆశతో గల్ఫ్ దేశాలకు పయనమైనవారు ఏజెంట్ల చేతిలో మోసపోయి దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. పరాయి దేశాల్లో పలుకరించే వారు లేక సాయం చేసే చేతులు కనపడక అష్టకష్టాలు పడుతున్నారు. విజిటింగ్ వీసాతో దుబాయ్ వెళ్లి అక్కడ సేటు పెట్టే చిత్రహింసలు భరించలేక ఓ మహిళ స్వచ్ఛంద సంస్థ ద్వారా పోలీసులను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. మహిళలను వ్యభిచార గృహానికి తరలించే ప్రయత్నం సాగుతుండగా విషయం వెలుగులోకి వచ్చింది. తనను మొగల్తూరు గ్రామానికి చెందిన సీహెచ్ త్రిమూర్తులు అనే ఏజెంట్ మోసం చేసి తప్పుడు వీసాతో ఇక్కడకు తీసుకొచ్చి వదిలేశాడని మహిళ ఫిర్యాదు చేశారు. ఈ ఉదంతంతో మొగల్తూరుకు చెందిన సీహెచ్ త్రిమూర్తులు అలియాస్ తిమోతి, మరొక వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నరసాపురం డీఎస్పీ సౌమ్యలత ఈ కేసును విచారిస్తున్నారు.
 
 ఒకే రోజు రెండు గల్ఫ్ కేసులు నమోదు
 సీహెచ్ త్రిమూర్తులు భాగోతాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఆదివారం మొగల్తూరు పోలీస్ స్టేషన్‌లో మరో కేసు నమోదైంది. మొగల్తూరుకు చెందిన జల్లి రాజకుమారిని నాలుగు నెలల క్రితం త్రిమూర్తులు దుబాయ్ పంపించాడు. దుబాయ్ వెళ్లిన 15 రోజుల పాటు  ఇక్కడ కుటుంబ సభ్యులకు ఫోన్ చేసేది. తరువాత ఆమె వద్ద నుంచి ఫోన్, ఇతర సమాచారం కానీ అందడం లేదు. తాజాగా త్రిమూర్తులు వ్యవహారం వెలుగులోకి రావడంతో రాజకుమారి బంధువులు ఆందోళనలో పడ్డారు. రాజకుమారి తండ్రి వెంకటేశ్వరరావు మొగల్తూరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన  కూతురు ఏమైందో తెలియడం లేదని రూ.2 లక్షలు తీసుకుని దుబాయ్ పంపించాడని ఫిర్యాదులో పేర్కొన్నారు.
 
 మొదట్లో ఫోన్‌లో  మాట్లాడినప్పుడు ఇక్కడ 40 మందిని ఓ రూమ్‌లో పెట్టి పనికి పంపిస్తున్నారని, వేధింపులు ఎక్కువగా ఉన్నాయని వాపోయిందని, దానిని బట్టి చూస్తే  తమ బిడ్డ పరిస్థితి దీనంగానే ఉండి ఉంటుందని వెంకటేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. నరసాపురం పట్టణం కృష్ణబాబు కాలనీకి చెందిన సయ్యద్ బుజ్జి తాను గల్ఫ్ ఏజెంట్ చేతిలో మోసపోయానని పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పాలకొల్లుకు చెందిన గల్ఫ్ ఏజెంట్ ఉల్లంపర్తి ప్రభాకర్ తనను, తన కుమార్తె ఇమామ్ ఖాతుమ్‌ను రూ.80 వేలు  తీసుకుని దుబాయ్ పంపించాడని తెలిపారు. అక్కడ తమను ప్రతి రోజు చిత్రహింసలు పెట్టేవారని, రోజుకోచోట గొడ్డుచాకరి చేయించేవారని చెప్పారు. అది భరించలేక తాను ఈ నెల 6న తిరిగి వచ్చేశానని,  తన కూతురు మాత్రం అక్కడే చిత్రహింసలు అనుభవిస్తుందని తెలిపారు.  తన కూతురును రప్పించి న్యాయం చేయాలని పోలీసులను ఆమె కోరారు.
 
 ఉపాధి కోసం గల్ఫ్ బాట
 ఉపాధి కోసం జిల్లాలో ఏటా లక్షా 50 వేల మంది గల్ఫ్ దేశాలకు వెళుతున్నారు. వారిలో డెల్టా ప్రాంతం నుంచి ఎక్కువగా వెళుతున్నారు. నిరక్షరాస్యత కారణంగా వీసా నిబంధనలు తెలియకపోవడం గల్ఫ్ ఏజెంట్లకు వరంగా మారింది. దీంతో వారు మోసాలకు పాల్పడుతున్నారు. గల్ఫ్ ఏజెంట్ల మోసాలకు అడ్డుకట్ట వేయూలని స్థానిక ప్రజలు పోలీసులను కోరుతున్నారు.
 
 గల్ఫ్ ఏజెంట్లపై కేసు నమోదు
 మొగల్తూరు : దుబాయ్ వెళ్లి మోసపోయిన బాధిత కుటుంబ సభ్యులు ఆదివారం మొగల్తూరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఏఎస్సై వై.నాగేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం మొగల్తూరు పంచాయతీ గోడావారి పేటకు చెందిన జల్లి వెంకటేశ్వరరావు కుమార్తె రాజకుమారిని ఉండికి చెందిన గల్ఫ్ ఏజెంట్లు కొల్లి శామ్యూల్, మొగల్తూరుకు చెందిన సీహెచ్ తిమోతి (త్రిమూర్తులు)  నాలుగు నెలల క్రితం దుబాయ్ పంపారు. అక్కడ తమ కుమార్తె ఇబ్బందులకు గురవుతుందని, ఫోన్ సమాచారం లేకపోవడంతో ఆందోళన చెంది తమకు ఫిర్యాదు చేశాడని ఆయన తెలిపారు. బాధితురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఆయన తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement