ఇది మాకు పునర్జన్మ.. తిరిగి ఇండియాను చూడమనుకున్నాం | Karimnagar Youth Return Home From Cambodia Thanks to Sakshi Media | Sakshi
Sakshi News home page

ఇది మాకు పునర్జన్మ.. తిరిగి ఇండియాను చూడమనుకున్నాం

Published Fri, Sep 30 2022 6:34 PM | Last Updated on Fri, Sep 30 2022 6:34 PM

Karimnagar Youth Return Home From Cambodia Thanks to Sakshi Media

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌: కాంబోడియాకు ఉద్యోగం కోసం వెళ్లిన తాము నరక కూపం నుంచి బయటపడ్డామని.. తిరిగి ఇండియాకు వస్తామనుకోలేదని.. ఇది తమకు పునర్జన్మ అని.. ఐదుగురు యువకులు వెల్లడించారు. గురువారం ఉదయం కరీంనగర్‌కు చేరుకున్నాక యువకులు ఉద్వేగానికి లోనయ్యారు. ‘సాక్షి’తో ప్రత్యేకంగా తమ ఆవేదనను పంచుకున్నారు. ఎన్నో ఆశలతో కాంబోడియాలో అడుగుపెట్టిన తమకు వెళ్లగానే ఆశలు ఆవిరయ్యాయన్నారు. అక్కడ కంపెనీ నిర్వాహకులు తమ పాస్‌పోర్టులు లాక్కుని, సైబర్‌ నేరాలు చేయాలని తొలిరోజే ఒత్తిడి తెచ్చారన్నారు. 

చేతిలో పాస్‌పోర్టులు లేక, ఎవరిని సంప్రదించాలో తెలియక, ఆకలితో నకనకలాడుతూ తాము ఎంతో మానసికవేదన అనుభవించామన్నారు. బయటికి వెళదామని ప్రయత్నించినా.. తమను చుట్టూ ఎత్తైన గోడలు, వాటికి కరెంటు కంచెలు, భారీ భద్రత నడుమ తమను బంధీ చేశారన్న విషయం తెలుసుకుని మరింత కుంగిపోయామని వాపోయారు. కానీ..‘సాక్షి’ చొరవతో ప్రభుత్వ యంత్రాంగాలు సమన్వయంతో పనిచేసి తిరిగి తమను మాతృభూమిని చేరేలా చేశాయన్నారు. ‘సాక్షి’కి తాము ఎంతో రుణపడి ఉంటామని వివరించారు. ఈ సందర్భంగా ఐదుగురు యువకులు కాంబోడియాలో చైనా సైబర్‌ స్కాం ముఠా చేతిలో అనుభవించిన బాధలను పంచుకున్నారు.


భారతీయులు చాలామంది ఉన్నారు

మాలాగే ఉపాధి ఆశతో అక్కడ సైబర్‌ నేరస్తుల ముఠా చేతిలో పడిన వారు చాలామంది ఉన్నారు. ఇండియాతోపాటు పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్‌కు చెందిన అనేకమంది అమాయకులు వారి వద్ద బందీలుగా ఉన్నారు. అందరితో ఇవే పనులు చేయిస్తున్నారు. ఎదురుతిరిగితే ఇక అంతే సంగతులు. బంధీలకు ఆత్మహత్య తప్ప మరే గత్యంతరమే లేదు.                      
–షారూఖ్‌ఖాన్‌ 


ఏజెంట్లు గోల్‌మాల్‌ చేశారు

మా విషయంలో ఇద్దరు ఏజెంట్లు గోల్‌మాల్‌ చేశారు. మమ్మల్ని కాంబోడియా చేర్చగానే విషయం అర్థమైంది. మమ్మల్ని అబ్దుల్‌ నుంచి అమెరికన్‌ డాలర్లు వెచ్చించి కొనుగోలు చేశామని చైనీయులు చెప్పారు. వచ్చీరాని ఇంగ్లిష్‌లో తాము చెల్లించిన డబ్బులు కట్టే వరకు విడిచి పెట్టమంటూ ఒక గదిలో బంధించారు.
– నవీద్‌ 


సెల్‌ఫోన్‌ తాకట్టుపెట్టాను

మేం వెళ్లిన తొలిరోజు నుంచే చైనీయులు మమ్మల్ని నేరాలు చేయాలని ఒత్తిడి చేయడం ప్రారంభించారు. మేము ససే మీరా అంటే వారు వినిపించుకోలేదు. చివరికి మమ్మల్ని ఆ చెర నుంచి విడిపించిన రోజు మా చేతుల్లో చిల్విగవ్వలేదు. దీంతో నేను నా సెల్‌ఫోన్‌ను తాకట్టుపెట్టాను. ఆకలి ఇబ్బంది పెడుతున్నా మేం కడుపునింపుకోలేదు. ఆ డబ్బులతో మా చిన్నచిన్న ఖర్చులు భరించుకున్నాం.                   
– షాబాజ్‌ఖాన్‌ 


మమ్మల్ని అమ్మేశారని అర్థమైంది

మేం వెళ్లగానే మా పాస్‌పోర్టులు లాగేసుకున్నారు. చెప్పినట్లు చేయాలని బెది రింపులకు దిగారు. ఉద్యోగానికి బదులు బెదిరింపులు రాగానే.. మమ్మల్ని అమ్మేశారని అర్థమైంది. ఇక అక్కడ నుంచి బయటపడటం గగనమే అనుకున్నాం. సైబర్‌ నేరాలు చేయలేక, అక్కడ నుంచి బయటపడే మార్గం లేక నరక యాతన అనుభవించాం.
– సలీమ్‌ 


హోటల్‌ వైఫైతో వీడియో పంపాం

చైనీయుల ఆఫీసులో బంధీ కాగానే తొలుత ఆందోళన చెందాం. డబ్బులు కడితేగానీ పంపేదిలేదని చైనీయులు తెగేసి చెప్పడంతో భయపడ్డాం. తిరిగి ఇల్లు చూస్తామనుకోలేదు. హోటల్‌ వైఫై పాస్‌ వర్డ్‌ తెలుసుకుని వెంటనే మా దయనీయ స్థితి ని వివరిస్తూ వీడియో చేసి ‘సాక్షి’కి పంపించాం. అదే మమ్మల్ని కాపాడింది.      
– హాజీబాబా

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement