సీపీకి ఫిర్యాదు ఇస్తున్న బాధిత కుటుంబాలు
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ఉపాధి కోసం వెళ్లి కాంబోడియాలో చిక్కుకున్న ఉమ్మడి కరీంనగర్ జిల్లా యువకుల విషయంలో కొత్త కోణం వెలుగుచూసింది. మంచి ఉద్యోగం, వీసా, దండిగా టిప్పులు వస్తాయని ఆశచూపిన ఏజెంట్లు.. మరో ఏజెంట్‌కు అప్పగించారు.. ఆ ఏజెంట్ యువకులను కాంబోడియాలో చైనాకు చెందిన కేసినో నిర్వాహకులకు అమ్మేశాడు. దీనిపై బాధితుల కుటుంబ సభ్యులు సోమవారం కరీంనగర్ పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు.
అసలు ఏం జరిగింది?
షాబాజ్‌ఖాన్ (మానకొండూరు), షారూఖ్ ఖాన్ (హుస్సేనీపుర, కరీంనగర్), హజీబాబా సయ్యద్ (శాత్రాజ్‌పల్లి, సిరిసిల్ల), నవీద్ అబ్దుల్ (సిరిసిల్ల), సలీం మహమ్మద్ (శాంతినగర్, చింతకుంట) అనే యువకులు కరీంనగర్ గాంధీనగర్‌లో ఉన్న ఇండో అరబ్ ఓవర్సీస్ కన్సల్టెన్సీని వేర్వేరుగా సంప్రదించారు. విదేశాల్లో ఉపాధి అవకాశాల కోసం ఆరా తీశారు. కన్సల్టెన్సీ ఏజెంట్లు మేనాజ్ అలీ, అబ్దుల్ రహీం వారికి కాంబోడియా వీసాలు ఉన్నాయని, తలా రూ.రెండు లక్షలు చెల్లిస్తే పంపుతామని చెప్పారు.
కేసినోలో కంప్యూటర్ ఉద్యోగమని, రోజూ టిప్పులు కూడా వస్తాయని ఆశ చూపారు. ఆ యువకులు దొరికినకాడల్లా అప్పు చేసి మేనాజ్, అబ్దుల్ రహీంలకు డబ్బులు ఇచ్చారు. ఏజెంట్లు ఈ ఐదుగురు యువకులను ఆగస్టు చివరివారంలో ఢిల్లీకి తీసుకెళ్లి అబ్దుల్లా అనే మరో ఏజెంటుకు అప్పగించారు. అబ్దుల్లా వారిని విమానంలో బ్యాంకాక్‌కు, అక్కడి నుంచి బస్సులో కాంబోడియాకు చేర్చాడు.
అక్కడ కేసినో నిర్వహిస్తున్న చైనీయులకు అప్పగించాడు. ప్రతిఫలంగా ఒక్కో యువకుడికి 2,700 డాలర్ల చొప్పున తీసుకుని వెళ్లిపోయాడు. కేసినో నిర్వాహకులు మూడు రోజుల పాటు యువకులకు శిక్షణ ఇచ్చి.. క్రిప్టో కరెన్సీ, క్రెడిట్ కార్డు, హనీ ట్రాప్ వంటి పనులు చేయాలన్నారు. ఆ పని చేయమనడంతో బంధించారు. తిండి పెట్టడం మానేశారు. తాము ఇచ్చిన మేర సొమ్ము చెల్లిస్తేనే వదిలిపెడతామన్నారు.
తమను రక్షించకుంటే ఆకలితో చచ్చిపోయేలా ఉన్నామంటూ ఆ యువకులు కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి కన్నీళ్లు పెట్టుకున్నారు. సోమవారం బాధిత కుటుంబ సభ్యులు కరీంనగర్ సీపీ సత్యనారాయణను కలిసి ఫిర్యాదు చేశారు. వెంటనే టాస్క్‌ఫోర్స్ పోలీసులతో విచారణ చేపడుతున్నట్టు సీపీ తెలిపారు. మరోవైపు ఈ పరిణామాలపై ఇంటెలిజెన్స్ పోలీసులు సీఎంవో కార్యాలయానికి నివేదిక పంపినట్టు తెలిసింది.
మా వాళ్లను కాపాడండి
ఏజెంట్లు విదేశాలకు వెళితే మంచి జీతం వస్తుందని చెప్పి తమ వారిని అమ్మేశారని షాబాజ్ సోదరుడు అఫ్జల్, నవీద్ సోదరుడు అబ్దుల్ ముహీద్ వాపోయారు. 3 వేల డాలర్లు చెల్లిస్తే వదిలేస్తామంటున్నారని పేర్కొన్నారు. ఏజెంట్లను అడిగితే తమకేం సంబంధం లేదన్నట్టు వ్యవహరిస్తున్నారని తెలిపారు.
విదేశాంగ శాఖకు బండి సంజయ్ లేఖ
కాంబోడియాలో యువకులు చిక్కుకున్న అంశంపై ‘సాక్షి’ ప్రచురించిన కథనానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ స్పందించారు. ఆ యువకులను దేశానికి రప్పించడానికి తగిన చర్యలు చేపట్టాలని విదేశాంగ మంత్రి జయశంకర్‌కు లేఖ రాశారు.
Comments
Please login to add a commentAdd a comment