ప్లాస్టిక్ మనీతో నల్లధనానికి చెక్!
పరిధి దాటే నగదు లావాదేవీలకు పాన్ తప్పనిసరి
న్యూఢిల్లీ: దేశంలో నల్లధనం చలామణిని అరికట్టేందుకు కీలక చర్యలు చేపట్టనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. నిర్ణీత స్థాయి దాటి సాగే నగదు లావాదేవీలపై పాన్‌కార్డు వివరాల సమర్పణను త్వరలో తప్పనిసరి చేయనున్నట్లు చెప్పారు. ఈ అంశంపై ఫేస్‌బుక్ ద్వారా ఆదివారం నెటిజన్లతో పలు విషయాలను ఆయన పంచుకున్నారు. భారతీయుల నల్లధనంలో అత్యధికం దేశంలోనే ఉందన్న జైట్లీ... ప్లాస్టిక్ కరెన్సీ వాడకాన్ని ప్రామాణికం చేసి అసాధారణ పరిస్థితుల్లోనే నగదు వాడకం జరిగేలా ప్రజల వైఖరిలో మార్పు తేవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ మార్పును ఆచరణలోకి తెచ్చేందుకు వివిధ ప్రాధికార సంస్థలతో కలసి పనిచేస్తున్నట్లు వివరించారు.
అధిక సంఖ్యలో పేమెంట్ గేట్‌వేల ప్రారంభం, ఇంటర్నెట్ బ్యాంకింగ్ వంటి వాటి ద్వారా ప్లాస్టిక్ మనీ వాడకం ఎక్కువగా పెరుగుతుందన్నారు. 18 కోట్ల మంది జన్‌ధన్ ఖాతాదారులకు రూపే కార్డుల జారీ, బ్యాంకు ఖాతాల్లోకి సబ్సిడీల ప్రత్యక్ష నగదు బదిలీ, ముద్రా పథకం కింద ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ముద్రా క్రెడిట్ కార్డుల ద్వారా ఏటీఎంల నుంచే రుణాల విత్‌డ్రాయల్ మొదలైనవి ఈ కోవలోకే వస్తాయన్నారు. విదేశాల్లో దాచిన నల్లధనం వివరాలను సెప్టెంబర్ 30తో ముగిసిన గడువులోగా ప్రకటించి పన్ను, జరిమానా చెల్లించే అవకాశాన్ని వినియోగించుకోని నల్లకుబేరులపై కఠిన చర్యలు తీసుకుంటామని జైట్లీ హెచ్చరించారు.
డిసెంబర్‌లో జాబితా ప్రకటించనున్న స్విస్
జూరిక్: తమ దేశంలోని బ్యాంకుల్లో 1955 నుంచి క్రియారహితంగా ఉన్న భారతీయ ఖాతాదారుల తొలి జాబితాను స్విట్జర్లాండ్ డిసెంబర్‌లో ప్రచురించనుంది. నాటి ఖాతాదారులను సంప్రదించేందుకు బ్యాంకులు చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో స్విస్ ప్రభుత్వం ఈ చర్య చేపట్టనుంది.