ఆర్బీఐలోనే క్యాష్ అయిపోయింది!
ఆర్బీఐలోనే క్యాష్ అయిపోయింది!
Published Wed, Nov 16 2016 2:12 PM | Last Updated on Mon, Sep 4 2017 8:15 PM
ఆర్బీఐ చెన్నై ఆఫీసులో గత వారం రోజులుగా రూ.500, రూ.1000 నోట్లను ఎక్స్చేంజ్ చేసుకుందామని ప్రయత్నిస్తున్న వారికి నిరాశే ఎదురవుతోంది. బ్యాంకుకు వస్తున్న విజిటర్స్ సంఖ్య పెరుగుతుండటంతో, ఆ ఆఫీసులో నగదు అయిపోతున్నాయి. దీంతో గంటల కొద్దీ క్యూలైన్లో వేచి చూసిన వారు నిరాశతో తిరుగుముఖం పటాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. పెద్ద నోట్లు రద్దు చేసిన ప్రభుత్వం వాటిని మార్చుకోవడానికి తుది గడువుగా డిసెంబర్ 30ను నిర్ణయించింది. అప్పటివరకు మార్చుకోని వారి పరిస్థితి ఇక అంతే. దీంతో తుది గడువు దగ్గర పడుతున్న క్రమంలో ఆర్బీఐ ఆఫీసులోనే నగదు అయిపోతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. బ్లాక్మనీ నిర్మూలించడానికి ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యను ప్రజలు స్వాగతిస్తున్నప్పటికీ.. కనీస అవసరాలకు కూడా నగదు లభ్యంకాకపోవడంపై ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బిజినెస్లను కూడా గత వారం రోజులుగా పక్కనపెట్టి క్యూలైన్లో నిల్చుంటున్నామని వారు పేర్కొంటున్నారు.
1960లో రిజర్వు బ్యాంకు చెన్నై ఆఫీసును బ్యూటిఫుల్ ఫోర్ట్ గ్లాసిస్ ప్రాంతంలోకి తరలించారు. అప్పటినుంచి చూసుకుంటే ఈ ఆఫీసుకు వచ్చే జనం కొంచెం తక్కువగానే ఉండేవారట. కానీ నవంబర్ 8న పెద్ద నోట్లను రద్దు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో బ్యాంకుకు వచ్చే విజిటర్స్ సంఖ్య పెరిగి, భారీ రద్దీ ఏర్పడిందని అధికారులు చెప్పారు. ముందు రోజు ఉదయం 7 గంటలకు క్యూలైన్లో నిల్చుంటే, తర్వాత రోజైనా తమవంతు రావడంలేదని కొంతమంది ప్రజలు నిరాశ వ్యక్తంచేస్తున్నారు. బ్యాంకులు రూ.2000 నోట్లను ఇష్యూ చేస్తుంటే, కస్టమర్లకు చిల్లర ఇవ్వడానికి ఇబ్బందులు పాలవాల్సి వస్తుందని వ్యాపారస్తులు వాపోతున్నారు. మూడు గంటల నుంచి బ్యాంకు ఆఫీసు ముందు నిల్చుంటే, ఆఖరికి క్యాష్ అయిపోయినట్టు తెలిసిందని మరో కస్టమర్ వాపోయాడు. కొత్త నోట్లు అయిపోతుండంతో, ఇక 10 రూపాయి, 5 రూపాయి నాణేలను జారీచేసే ప్రక్రియలో పడింది రిజర్వు బ్యాంకు.క్యూ లైన్లో నిల్చోవడం ఇష్టపడని వారు, క్యూలో ఉన్నవారికి కమీషన్ ఇస్తూ నగదును డ్రా చేసుకుంటున్నారు. ఒక్కొక్కరూ ఐదు నుంచి ఆరు ఐడీ కార్డులపై నగదును డ్రా చేస్తున్నారు. దీంతో త్వరగా నగదు అయిపోతున్నట్టు కూడా తెలుస్తోంది.
Advertisement
Advertisement