మనవడికి ఓ సంప్రదాయం .. రాజధాని నిర్మాణానికి ..?
తిరుపతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హిందూమత సంప్రదాయాలను మంట కలిపారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఆరోపించారు. బుధవారం చిత్తూరు జిల్లా తిరుపతిలో చెవిరెడ్డి భాస్కరరెడ్డి మాట్లాడుతూ... చంద్రబాబు పెద్దనాన్న కుమారుడు నారావారిపల్లెలో మరణించి ఆరోరోజులు అయిందని తెలిపారు. కుటుంబంలో ఓ వ్యక్తి చనిపోతే పెద్ద కర్మ జరిగేంతవరకు మైల ఉంటుందని చెవిరెడ్డి ఈ సందర్భంగా గుర్తు చేశారు.
మైల, అంటు ఉన్నప్పుడు ఎవరూ శుభకార్యాలకు వెళ్లరూ... వెళ్లకూడదని అన్నారు. కాని చంద్రబాబు మైలు ఉండి కూడా నారావారి పల్లెలో కలశపూజలు చేశారు. అలాగే నాగదేవతకు పూజలతోపాటు అర్చకులు చేసిన హోమాల్లో చంద్రబాబు పాల్గొన్నారు. మైలలో ఉండి చేసిన ఇవన్నీ తీసుకెళ్లి అమరావతి రాజధాని నిర్మాణానికి వాడతానంటున్నారని చెవిరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. మైల ఉందని తెలిసే ... చంద్రబాబు తన మనవడికి పుట్టి వెంట్రుకలు తీసే కార్యక్రమాన్ని వాయిదా వేసుకున్నారన్నారు.
మైలలో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తే... కుటంబానికి, వంశానికి మంచిది కాదని చంద్రబాబు వాయిదా వేశారన్నారు. మనవడికి ఓ సంప్రదాయం.. రాజధాని నిర్మాణానికి మరో సంప్రదాయమా అని చంద్రబాబును చెవిరెడ్డి సూటిగా ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజలకు సంబంధించిన శుభ కార్యక్రమాన్ని మైలతో ఎలా నిర్వహిస్తారో చెప్పాలని చంద్రబాబును చెవిరెడ్డి ప్రశ్నించారు.