యూపీపై బీజేపీకి చిదంబరం సూటి ప్రశ్న
చెన్నై: ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ అనుసరించిన వ్యూహంపై కాంగ్రెస్ సీనియర్ నేత పీ చిదంబరం సూటి ప్రశ్నాస్త్రాలు సంధించారు. దేశంలో అతిపెద్ద మైనారిటీ వర్గాన్ని, మహిళలను, అట్టడుగు వర్గాలను ఎన్నికల్లో విస్మరించడం ద్వారా సమగ్ర ఆర్థికాభివృద్ధి సాధ్యమా అని ఆయన ప్రశ్నించారు. ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ భారీ విజయాన్ని ప్రస్తావించిన ఆయన.. ’19.3శాతం ముస్లిం జనాభా ఉన్న రాష్ట్రంలో ఒక్క ముస్లిం అభ్యర్థికి కూడా టికెట్ ఇవ్వకుండా బీజేపీ ఈ విజయాన్ని సాధించింది. దీంతో ’సబ్ కా సాథ్, సబ్ కా వికాస్’ అన్న నినాదానికి సరికొత్త సంకుచిత అర్థం ఇచ్చినట్టు అయింది. ఒక జాతీయ పార్టీ అసలు మహిళా అభ్యర్థులను బరిలోకి దింపకపోవడం, లేదా ఎస్సీ, ఎస్టీలకు రిజర్వుచేయబడిన స్థానాల్లో అసలు అభ్యర్థులనే నిలబెట్టకపోవడం లాంటిదే ఇది’ అని చిదంబరం బీజేపీ తీరును తప్పుబట్టారు.
చెన్నైలో హిందూ సెంటర్ ఫర్ పాలిటిక్స్ అండ్ పబ్లిక్ పాలసీలో నిర్వహించిన ’నిరంతరాయ వృద్ధిని భారత్ సాధిస్తుందా’ అన్న అంశంపై చిదంబరం ప్రసంగించారు. అతిపెద్ద మైనారిటీ వర్గాన్ని, మహిళలను, ఎస్సీ, ఎస్టీలను ఎన్నికల్లో విస్మరించడం ద్వారా దీర్ఘకాలిక ఆర్థిక వృద్ధిని సాధించడం సాధ్యమా అని ఆయన సూటిగా కేంద్రాన్ని ప్రశ్నించారు.