ఉప ఎన్నికల్లో సీఎం ఘనవిజయం
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అభ్యర్థి, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి ముఖ్యమంత్రి వీ నారాయణస్వామి ఉప ఎన్నికల్లో విజయం సాధించారు. పుదుచ్చేరి నెల్లితోప్పె అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికలో అన్నాడీఎంకే అభ్యర్థి ఓంశక్తి శేఖర్‌పై 11,151 ఓట్ల తేడాతో గెలుపొందారు.
గత మే 16న జరిగిన పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంతో వీ నారాయణస్వామి ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టారు. అయితే, ఆయన శాసనసభ్యుడు కాకపోవడంతో ఉప ఎన్నికల బరిలోకి దిగారు. నారాయణస్వామి సీఎంగా కొనసాగాలంటే ఈ ఎన్నికలో తప్పక గెలువాల్సిన పరిస్థితి నెలకొనడంతో ఈ ఫలితాలపై సర్వత్రా ఆసకక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో అన్నాడీఎంకే అభ్యర్థి ఓం శక్తిశేఖర్ గట్టిపోటీ ఇచ్చారు. దీంతో ఆసాంతం ఈ ఉప ఎన్నికలు హోరాహోరీగా జరిగాయి.
దేశవ్యాప్తంగా ఉప ఎన్నికల ఫలితాలు
దేశవ్యాప్తంగా ఆరు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలోని నాలుగు లోక్‌సభ స్థానాలకు, ఎనిమిది అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల ఫలితాలు మంగళవారం వెలువడుతున్నాయి.
త్రిపురలోని బర్జాలా అసెంబ్లీ స్థానాన్ని సీపీఎం కైవసం చేసుకుంది. కాంగ్రెస్ ఎమ్మెల్యే జితేంద్ర సర్కార్ రాజీనామాతో జరిగిన ఈ ఉప ఎన్నికలో అధికార పార్టీ సీపీఎం దూకుడు ప్రదర్శించింది. అదేవిధంగా సీపీఎం ఎమ్మెల్యే సమీర్ దేబ్ సర్కార్ మృతితో కోవాయి అసెంబ్లీ స్థానంలో ఉప ఎన్నిక జరుగగా.. ఈ స్థానాని కూడా సీపీఎం కైవసం చేసుకుంది.
అసోం లఖీంపుర లోక్‌సభ స్థానంలో బీజేపీ ముందంజలో ఉంది. ఇక్కడ కాంగ్రెస్ రెండో స్థానంలో ఉంది. మధ్యప్రదేశ్‌లోని షాదోల్ లోక్‌సభ స్థానంలోనూ, నేపనగర్ అసెంబ్లీ స్థానంలో బీజేపీ ముందంజలో ఉంది.