భారత్‌పై చైనా నోట మళ్లీ అదే మాట!
బౌద్ధుల మతనాయకుడు దలైలామాను ఉపయోగించుకొని చైనా ప్రయోజనాలను దెబ్బతీసేందుకు భారత్ ప్రయత్నించకూడదని ఆ దేశం పేర్కొంది. దలైలామా ఇటీవల చేపట్టిన అరుణాచల్ ప్రదేశ్ పర్యటన వల్ల ఇరుదేశాల సంబంధాలకు నష్టం కలిగించిందని మరోసారి వ్యాఖ్యానించింది.
‘దలైలామా అరుణాచల్ ప్రదేశ్ పర్యటన భారత్-చైనా సంబంధాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపింది. టిబేట్‌పై తీసుకున్న కట్టుబాటును భారత్ పాటించాల్సిన అవసరముంది. చైనా ప్రయోజనాలకు తక్కువ చేసేందుకు దలైలామాను ఆ దేశం వాడుకోకూడదు’ అని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి లు కాంగ్ అన్నారు. అరుణాచల్ ప్రదేశ్ తమ దేశంలోని దక్షిణ టిబేట్‌లో భాగమని చైనా మొండిగా వాదిస్తున్న సంగతి తెలిసిందే. ధర్మశాల కేంద్రంగా బౌద్ధుల మతనాయకుడిగా, టిబేట్ ఆధ్యాత్మిక గురువుగా ఉన్న దలైలామా ప్రత్యేక దేశంగా టిబేట్ ఏర్పాటుకు కుట్ర పన్నుతున్నారని ఆరోపిస్తున్నది.