
అమెరికా మహిళకు షాకిచ్చిన చైనా!
హుస్టన్‌కు చెందిన సాండీ ఫాన్ గిల్లీస్ 2015 మార్చిలో టెక్సాస్ అధికారులతో కలిసి వ్యాపార పర్యటన నిమిత్తం చైనా వచ్చింది.
తమ దేశానికి వ్యతిరేకంగా గూఢచర్యానికి పాల్పడిందంటూ అమెరికన్ మహిళా వ్యాపారవేత్తకు చైనా కోర్టు శిక్ష విధించింది. మూడున్నరేళ్లు జైలులో గడుపాలని, ఆ తర్వాత ఆమెను స్వదేశానికి పంపాలని తీర్పు ఇచ్చింది.
హుస్టన్‌కు చెందిన సాండీ ఫాన్ గిల్లీస్ 2015 మార్చిలో టెక్సాస్ అధికారులతో కలిసి వ్యాపార పర్యటన నిమిత్తం చైనా వచ్చింది. అయితే, ఆమె గూఢచర్యానికి పాల్పడుతున్నదంటూ చైనా పోలీసులు అదుపులోకి తీసుకొని, కస్టడీలో పెట్టుకున్నారు. మంగళవారం కోర్టు విచారణ సందర్భంగా ఆమె నేరాన్ని అంగీకరించిందని, దీంతో ఆమెకు కోర్టు శిక్ష విధించిందని ఆమె లాయర్ చెప్తున్నారు. కానీ, ఆమె భర్త జెఫ్ గిల్లీస్ మాత్రం సాండీ అమాయకురాలని, అక్రమంగా చైనా అదుపులోకి తీసుకున్న ఆమెను వెంటనే విడుదల చేయాలని ఆందోళనలు నిర్వహిస్తున్నారు. 1990 దశకంలో అమెరికా ప్రభుత్వం తరఫున చైనాలో సాండీ గూఢచర్యానికి పాల్పడిందని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అయితే, ఆ సమయంలో సాండీ అమెరికాలోనే ఉన్నదని ఆయన పత్రాలు చూపిస్తున్నారు.