ఉత్తర కొరియాపై చైనా అనూహ్య ట్విస్ట్!!
బీజింగ్: తన మిత్రపక్షం ఉత్తర కొరియా నిర్విరామంగా అణ్వాయుధ పరీక్షలు చేస్తుండటం చైనాను కూడా చీకాకు పరిచినట్టు ఉంది. తాజాగా చైనా సైతం ఆ దేశ వైఖరిపై విమర్శనాస్త్రాలు సంధించింది. ఉత్తర కొరియా తాజాగా చేపడుతున్న అణ్వాయుధ పరీక్షలు, క్షిపణి కార్యక్రమాలపై తాము తీవ్రంగా ఆందోళన చెందుతున్నట్టు పేర్కొంది. వారానికోసారి క్షిపణి పరీక్షలు చేపడతామని, ఎవరైనా బెదిరిస్తే అణ్వాయుధాలు ప్రయోగించడానికి వెనుకాడబోమని ఉత్తర కొరియా విదేశాంగ మంత్రి పేర్కొన్న నేపథ్యంలో చైనా ఈ విమర్శలు చేయడం గమనార్హం. అంతేకాదు ఉత్తర కొరియా విషయంలో అమెరికా వైఖరిని సైతం చైనా కొనియాడటం గమనార్హం.
‘కొరియా ద్వీపకల్పంలో తలెత్తిన అణ్వాయుధ సమస్యను నివారించేందుకు సాధ్యమైనంతగా శాంతియుత మార్గాలను అన్వేషిస్తామన్న అమెరికా ప్రకటన సానుకూలమైనది, నిర్మాణాత్మకమైనది. ఇది సరైనదేనని మేం భావిస్తున్నాం. అందరూ దీనికి కట్టుబడి ఉండాలని కోరుతున్నాం’ అని చైనా విదేశాంగ అధికార ప్రతినిధి లు కాంగ్ పేర్కొన్నారు. ఇన్నాళ్లు ఉత్తరకొరియాకు ఏకైక మిత్రపక్షంగా ఆ దేశానికి ఏ కష్టం రాకుండా చైనా కాచుకుంటున్న సంగతి తెలిసిందే. తాజా అణు సంఘర్షణ నేపథ్యంలో కొరియా దుందుడుకు ధోరణిని ఖండిస్తూ చైనా సైతం అనూహ్య ట్విస్టు ఇవ్వడం, అమెరికాను పొగడటం గమనార్హం.