బౌద్ధ సాంస్కృతిక సంపదపై చైనా దాడి
కాబూల్: అఫ్ఘానిస్తాన్‌లోని బమియాన్ బుద్ధ విగ్రహాలను తాలిబన్ టైస్టులు 2001లో ధ్వంసం చేసినప్పుడు ప్రపంచ దేశాలు నిరసన వ్యక్తం చేశాయి. దేశాధినేతలతోసహా వివిధ దేశాల ప్రజలు గళం విప్పి నిరసన వ్యక్తం చేశారు. ‘ఎందుకు ఇలా జరిగింది? మనం ఎందుకు ఈ విధ్వంసాన్ని నిలువరించలేకపోయాం?’ అంటూ వ్యాఖ్యానాలు చేశారు. వారిలో చైనా ప్రజలు కూడా ఉన్నారు. ఇప్పుడు అంతకన్నా ఎక్కువ అఫ్ఘాన్ సాంస్కృతిక వారసత్వ సంపదనను ధ్వంసం చేసేందుకు చైనా మెటలార్జికల్ గ్రూప్ కార్పొరేషన్ (ఎంసీసీ) రంగంలోకి దిగింది.
ఇటు అఫ్ఘాన్, అటు బౌద్ధ చరిత్రను తిరిగి రాయగల ఐదువేల సంవత్సరాల కాంస్య యుగం నాటి మెస్ ఐనాక్ ప్రాంతాన్ని తవ్వి పారేసేందుకు బిడ్డును దక్కించుకుంది. ప్రపంచంలోనే అపార రాగి గనులను భూగర్భంలో దాచుకున్న మెస్ ఐనాక్ ప్రాంతాన్ని కొల్లగొట్టడం కోసమే చైనా కంపెనీ ఈ బిడ్‌ను దాఖలు చేసింది. వచ్చే ఏడాది నుంచే తవ్వకాలు ప్రారంభంకానున్నాయి. కాబూల్ నగరానికి 40 కిలోమీటర్ల దూరంలో ఐదు లక్షల చదరపు మీటర్ల వైశాల్యం కలిగిన మెస్ ఐనాక్‌లో రాగి గనులతోపాటు కాలగర్బంలో కలసిపోయిన అపార బౌద్ధ చరిత్ర దాగి ఉంది. కనీసం నాలుగు వందల బుద్ధుడి విగ్రహాలు, వందలాది దేవాలయాలు, అపార బంగారు, రాగి నాణాలు, నగలు ఈ ప్రాంతంలో ఉన్నాయని ఇప్పటికే పది శాతం వరకు తవ్వకాలు జరిపిన అఫ్ఘాన్ పురావస్తు శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ప్రముఖ పురావస్తు శాస్త్రవేత్త కాదిర్ తిమోరి నాయకత్వంలో కొంతమంది పురావస్తు శాస్త్రవేత్తలు ఇటు అఫ్ఘాన్ ప్రభుత్వానికి, అటు చైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాంస్కృతిక వారసత్వ సంపదను పరిరక్షించేందుకు పోరాటం చేస్తున్నారు. ఈ రెండు ప్రభుత్వాలను ఎదుర్కొనేందుకు తమ శక్తి చాలదని, ప్రపంచ వ్యాప్తంగా నిరసన వ్యక్తంచేస్తూ, తమకు మద్దతిస్తేనే తమ లక్ష్యం నెరవేరుతోందని వారంటున్నారు. వారి సహకారంతో అఫ్ఘాన్‌కు చెందిన ఓ ఫిల్మ్ డివిజన్ ఈ అంశంపై ‘సేవ్ మెస్ ఐనాక్’ పేరిట ఓ డాక్యుమెంటరీని విడుదల చేసింది. దీనిద్వారా ప్రపంచ ప్రజల దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్లడమే తమ ఉద్దేశమని వారు చెప్పారు.
టైస్టులైనందునే నాటి తాలబన్ల విధ్వంసాన్ని ప్రపంచ దేశాలు ఖండించాయా? ఇప్పుడు అఫ్ఘాన్ పురావస్తు శాస్త్రజ్ఞుల పోరాటానికి మద్దతుగా నిలుస్తాయా? అన్న అంశం వేచి చూడాల్సిందే.